యామల్‌ ఒక్కడే కాదు.. ఈ ముగ్గురూ ఇప్పుడు మెస్సీకి ‘ప్రత్యర్థులే’! | Not Just Yamal These 3 Spain Stars Also Posed With Messi As Kids Pics Viral | Sakshi
Sakshi News home page

యామల్‌ ఒక్కడే కాదు.. ఈ ముగ్గురు స్పెయిన్‌ స్టార్లకూ మెస్సీతో అనుబంధం!

Jul 18 2026 2:01 PM | Updated on Jul 18 2026 2:25 PM

Not Just Yamal These 3 Spain Stars Also Posed With Messi As Kids Pics Viral

PC: X

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్‌కప్‌-2026 ఫైనల్‌ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. న్యూజెర్సీ వేదికగా భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అర్జెంటీనా- స్పెయిన్‌ మధ్య టైటిల్‌ పోరు జరుగనుంది. ఈ నేపథ్యంలో అందరి కళ్లు అర్జెంటీనా దిగ్గజం లియోనల్‌ మెస్సీ, స్పెయిన్‌ యువ సంచలనం లమీన్‌ యామల్‌పైనే నిలిచాయి.

లాలపోసి జోల పాడాడు
నిజానికి కెరీర్‌లో అప్పుడప్పుడే ఎదుగుతున్న ఏ ఆటగాడైనా... తన అభిమాన ప్లేయర్‌ను దగ్గర నుంచి చూడాలనో లేక అతడితో ఆటోగ్రాఫ్, ఫొటోగ్రాఫ్‌ తీసుకోవాలనో కోరుకుంటాడు. భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి చిన్నప్పుడు ఆశిష్‌ నెహ్రా చేతుల మీదుగా అవార్డు తీసుకొని మురిసిపోగా... శ్రేయస్‌ అయ్యర్‌ బాల్‌బాయ్‌గా ఉన్నప్పుడు ఇర్ఫాన్‌ పఠాన్‌ మాటలతో స్ఫూర్తిపొందాడు. 

ఇలా ఎవరైనా ఊహ వచ్చాకే తమ అభిమాన ఆటగాళ్లతో అనుబంధం పెంచుకుంటారు. కానీ, స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ యువ సంచలనం లమీన్‌ యామల్‌ అనుభవం మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. ఊహ తెలియక ముందే యామల్‌ను అతడి అభిమాన ప్లేయర్‌ ముద్దాడాడు. ఐదు నెలల వయసులోనే లాలపోసి జోల పాడాడు. ఇదేంటీ విడ్డూరం అనుకుంటున్నారా! కాదు నిజమే.  

అపుడు ఐదు నెలల పసికందు.. ఇపుడు ప్రత్యర్థి
దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకుంటున్న ఓ యువ ఆటగాడు... ఓ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఐదు నెలల పసికందును ఎత్తుకొని ముద్దుచేశాడు. 

కట్‌ చేస్తే... ఆ ఎత్తుకున్న వ్యక్తి ప్రస్తుతం అర్జెంటీనా దిగ్గజం లియోనెల్‌ మెస్సీ కాగా... ఆ ముద్దులొలికే బాబు స్పెయిన్‌ స్టార్‌ ప్లేయర్‌ లమీన్‌ యామల్‌. యూనిసెఫ్, బార్సిలోనా ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో 2007లో జరిగిన ఈ కార్యక్రమంలో ఐదు నెలల యామల్‌కు మెస్సీ స్నానం చేయించాడు. 

ఆ రోజు మెస్సీ చేతుల్లో ఆడుకున్న ఆ చిన్నారి ఇప్పుడు పెరిగి పెద్ద వాడై అతడితోనే తలపడేందుకు సిద్ధమయ్యాడు. అమెరికా వేదికగా ఆదివారం జరగనున్న ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ ప్రపంచకప్‌ ఫైనల్లో ఈ ఇద్దరు ప్లేయర్లు అమీతుమీ తేల్చుకోనున్న నేపథ్యంలో... 19 ఏళ్ల నాటి ఫొటో సోషల్‌ మీడియాను ఊపేస్తోంది.

అయితే ఏఐ యుగంలో ఈ ఫోటో నకిలీ అయి ఉంటుందని ప్రచారం జరగగా... యూనిసెఫ్‌ ప్రతినిధులు ఈ ఫొటో వెనక ఉన్న చరిత్రను తాజాగా వెల్లడించారు. 2008 యూనిసెఫ్‌ క్యాలెండర్‌ కోసం ఈ ఫొటోషూట్‌ నిర్వహించినట్లు తెలిపారు. హాలీవుడ్‌ సినిమా స్క్రిప్ట్‌ను తలపిస్తున్న ఈ నిజజీవిత కథ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.  

యామల్‌ ఒక్కడే కాదు..
ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర అంశం తెరమీదకు వచ్చింది. యామల్‌ ఒక్కడే కాదు.. ఫైనల్లో మెస్సీ బృందంతో తలపడనున్న స్పెయిన్‌ జట్టులో మరో ముగ్గురు కూడా మెస్సీతో చిన్ననాడే ఫొటోలకు ఫోజులిచ్చారు. వారు మరెవరో కాదు.. డానీ ఒల్మో (Dani Olmo), జోవాన్‌ గ్రేసియా (Joan Garcia), గవీ (Gavi).

బార్సిలోనా మిడ్‌ఫీల్డర్‌ గవీకి మెస్సీ రోల్‌ మోడల్‌. ఇప్పుడు తన ఆరాధ్య ఫుట్‌బాలర్‌కు ప్రత్యర్థిగా అతడు బరిలోకి దిగనున్నాడు. ఇక స్పెయిన్‌ జట్టులో ఫార్వర్డ్‌ ప్లేయర్‌గా, సెంట్రల్‌ మిడ్‌ఫీల్డర్‌గా డానీ పాత్ర కీలకం. బార్సిలోనాలో చాలా ఏళ్ల క్రితమే అతడు మెస్సీతో కలిసి ఫొటో దిగాడు. 

ఇప్పుడు తన అనుభవాన్ని డానీ.. తన రోల్‌ మోడల్‌ మెస్సీకి వ్యతిరేకంగా ఉపయోగించబోతున్నాడు. ఇక జోవాన్‌ గ్రేసియా స్పెయిన్‌ గోల్‌ కీపర్‌. చిన్నపుడు మెస్సీతో కలిసి అతడు సందడి చేశాడు. ఇప్పుడు మెస్సీ గోల్‌ కొట్టకుండా ఆపే అడ్డుగోడలా నిలబడేందుకు సిద్ధమయ్యాడు. 

ఇది విధి రాసిన కథ
ఈ నేపథ్యంలో.. ‘ఇది విధి రాసిన కథ.. మెస్సీ చేతుల్లో నాడు ఒదిగిపోయిన చిన్నారులు నేడు.. అతడికే ప్రత్యర్థిగా మారడం నిజంగా నమ్మలేని విషయం’ అంటూ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాగా యామల్‌ ఫొటో నిజమే అని యూనిసెఫ్‌ ధ్రువీకరించగా.. మిగతా ముగ్గురితో ఉన్న ఫొటోలు మాత్రం బార్సిలోనా ఇండిపెండెంట్‌ న్యూస్‌ చానెల్‌ బార్కా యూనివర్సల్‌ ఎక్స్‌ వేదికగా షేర్‌ చేయడంతో తెరమీదకు వచ్చాయి.

చదవండి: రోహిత్‌, జైస్వాల్‌ కోసం నాడు గిల్‌ అలా చేశాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement