విశ్రాంతి వద్దన్న రోహిత్‌.. అతడి కోసం గిల్‌ అనూహ్య నిర్ణయం! | Rohit Denied Request Gill Had To Take Big ODI Call For Jaiswal: Report | Sakshi
Sakshi News home page

విశ్రాంతి వద్దన్న రోహిత్‌.. శుబ్‌మన్‌ గిల్‌ అనూహ్య నిర్ణయం!

Jul 18 2026 1:01 PM | Updated on Jul 18 2026 1:17 PM

Rohit Denied Request Gill Had To Take Big ODI Call For Jaiswal: Report

PC: BCCI X

టీమిండియా దిగ్గజ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ గురించి ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇంగ్లండ్‌తో లార్డ్స్‌ వేదికగా ఆదివారం జరిగే మూడో వన్డే హిట్‌మ్యాన్‌ కెరీర్‌లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌ అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్‌ సైకియా ఈ వార్తల్ని కొట్టిపారేశాడు. లార్డ్స్‌ వన్డే రోహిత్‌కు చివరి మ్యాచ్‌ కాదని స్పష్టం చేశాడు.

సెలక్టర్లపై బీసీసీఐ ఆగ్రహం!
అదే విధంగా ఈ విషయంలో లీకులు ఇచ్చారని సెలక్టర్లపై బీసీసీఐ ఆగ్రహం చేసినట్లు సమాచారం. ఇలాంటి తరుణంలో మరో ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. నిజానికి అఫ్గానిస్తాన్‌తో ఇటీవల స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌ నుంచే రోహిత్‌ శర్మను పక్కనపెట్టాలని అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం.

అప్పుడే డిసైడ్‌ అయ్యారు
విశ్రాంతి పేరిట రోహిత్‌ను పక్కనపెట్టి.. యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ను అఫ్గాన్‌తో సిరీస్‌లో ఆడించాలనే యోచనలో ఉన్నారట. అయితే, ఇందుకు రోహిత్‌ ససేమిరా అనడంతో.. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ స్వయంగా తన బ్యాటింగ్‌ స్థానాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘గత నెలలో స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ నుంచి రోహిత్‌ శర్మను తప్పించాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నారు. కానీ అతడు ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఆఖరిదైన మూడో వన్డేలోనైనా విశ్రాంతి తీసుకోవాలని కోరారు.

విశ్రాంతి వద్దన్న రోహిత్‌.. గిల్‌ అనూహ్య నిర్ణయం!
అతడి స్థానంలో జైస్వాల్‌ను ఆడించాలనుకున్నారు. కానీ రోహిత్‌ రెస్ట్‌ తీసుకునేందుకు నిరాకరించాడు. దీంతో జైస్వాల్‌ను ఎలాగైనా ఆడించాలనే ఉద్దేశంతోనే కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు’’ అని పేర్కొన్నాయి. అదే విధంగా.. ‘‘అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్ల నుంచి రిటైర్‌ అయిన తర్వాత రోహిత్‌కు అసలైన సవాలు ఎదురైంది.

అతడు దేశవాళీ క్రికెట్‌లోనూ కేవలం రెండు మ్యాచ్‌లే ఆడాడు. కానీ ఆశించిన స్థాయిలో లయను అందుకోలేకపోయాడు. ఇటీవల కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఫామ్‌ కోల్పోయిన రోహిత్‌ విషయంలో సెలక్టర్లు అయితే ఇప్పటికే తమ నిర్ణయం గురించి చెప్పేశారు. రోహిత్‌ శర్మ, బోర్డు తీసుకునే నిర్ణయం ఆధారంగానే అతడు వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీ-2027 ఆడతాడా? లేదా? అన్నది తేలుతుంది’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

తొలుత విఫలమైనా..
కాగా అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌లో రోహిత్‌ శర్మ 16, 48, 79 పరుగులు సాధించాడు. ఇక రెండో వన్డేతో తుదిజట్టులోకి వచ్చిన జైస్వాల్‌ నిరాశపరిచినా (4).. మూడో వన్డేలో అజేయ శతకం (110*)తో ఆకట్టుకున్నాడు. మరోవైపు.. తొలి వన్డేలో ఓపెనర్‌గా దిగి 84 పరుగులతో అజేయంగా నిలిచిన గిల్‌.. తర్వాత రెండు వన్డేలో మూడో నంబర్‌ బ్యాటర్‌గా వచ్చి భారీ శతకం (154)తో దుమ్ములేపాడు.

ఇదిలా ఉంటే.. రెగ్యులర్‌ వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి వ్యక్తిగత కారణాల వల్ల ఈ సిరీస్‌కు దూరం కావడంతో.. అతడి స్థానంలో యశస్వి జైస్వాల్‌కు జట్టులో చోటు దక్కింది. ఈ వన్డే సిరీస్‌లో భారత్‌ అఫ్గాన్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇక తాజాగా ఇ​ంగ్లండ్‌ పర్యటనలో రోహిత్‌ శర్మ ఇప్పటికి రెండు వన్డేలలో వరుసగా 11,  26 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్‌ వార్తలు తెరమీదకు రావడం గమనార్హం.

చదవండి: అదే మా కొంప ముంచింది: శుబ్‌మన్‌ గిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement