Rohit Sharma (X/@BCCI)
భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ ముగింపు దశకు చేరుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డే అతని చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ అదే జరిగితే, భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ వన్డే బ్యాటర్ శకం ముగిసినట్లే. ఈ సందర్భంగా చాలా కాలం పాటు చెక్కుచెదరకుండా నిలిచే అతని అరుదైన రికార్డులపై ఓ లుక్కేద్దాం.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు
రోహిత్ శర్మ టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి 513 మ్యాచ్‌ల్లో 657 సిక్సర్లు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో మరే బ్యాటర్ ఇప్పటివరకు ఇన్ని సిక్సర్లు కొట్టలేదు. వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 553 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు
వన్డేల్లో ఒక డబుల్ సెంచరీ చేయడమే గొప్ప ఘనతగా భావిస్తారు. అలాంటిది రోహిత్ ఏకంగా మూడు డబుల్ సెంచరీలు నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. 2013లో ఆస్ట్రేలియాపై 209, 2014లో శ్రీలంకపై 264, 2017లో శ్రీలంకపైనే అజేయంగా 208 పరుగులు చేశాడు. ఇప్పటివరకు మరే బ్యాటర్ రెండు డబుల్ సెంచరీలు కూడా నమోదు చేయలేదు.
వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు
2014లో కోల్‌కతాలో శ్రీలంకపై రోహిత్ ఆడిన 264 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఇప్పటికీ వన్డే చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా కొనసాగుతోంది. 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లతో ఈ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు.
ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు
2019 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఏకంగా ఐదు సెంచరీలు బాదాడు. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంకపై శతకాలు నమోదు చేసి ఒకే ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆ టోర్నీలో మొత్తం 648 పరుగులతో టాప్ స్కోరర్‌గా కూడా నిలిచాడు.
ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు
ప్రపంచకప్‌ల్లో రోహిత్ ఇప్పటివరకు ఏడు సెంచరీలు సాధించాడు. డేవిడ్ వార్నర్, సచిన్ టెండూల్కర్ తలో ఆరు సెంచరీలతో అతని తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
వన్డేల్లో అత్యధిక 150+ స్కోర్లు
వన్డేల్లో 150కు పైగా ఎనిమిది ఇన్నింగ్స్‌లు ఆడిన ఏకైక బ్యాటర్ రోహిత్ శర్మ. వీటిలో మూడు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. డేవిడ్ వార్నర్ ఏడు 150+ స్కోర్లతో రెండో స్థానంలో ఉండగా.. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ తలో ఐదు సార్లు ఈ ఘనత సాధించారు.
ఈ గణాంకాలు చూస్తే రోహిత్ శర్మ పేరు మీద ఉన్న కొన్ని రికార్డులను సమీప భవిష్యత్తులో బద్దలు కొట్టడం అత్యంత కష్టమనే విషయం స్పష్టమవుతోంది. రోహిత్ పేరిట లిఖించిబడిన ఈ రికార్డులు భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు.


