‘లార్డ్స్‌ వన్డే ఆఖరిది కాదు’ | BCCI Secretary Saikia clarifies on Rohit Sharmas career | Sakshi
Sakshi News home page

‘లార్డ్స్‌ వన్డే ఆఖరిది కాదు’

Jul 18 2026 3:49 AM | Updated on Jul 18 2026 3:49 AM

BCCI Secretary Saikia clarifies on Rohit Sharmas career

రోహిత్‌ శర్మ కెరీర్‌పై బీసీసీఐ కార్యదర్శి సైకియా స్పష్టీకరణ  

న్యూఢిల్లీ: ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ శర్మ వన్డే రిటైర్మెంట్‌పై వాదోపవాదాలు నడుస్తున్న తరుణంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టతనిచ్చింది. ఇంగ్లండ్‌తో లండన్‌లోని లార్డ్స్‌ మైదానం వేదికగా ఆదివారం జరగనున్న మూడో వన్డే రోహిత్‌ శర్మ కెరీర్‌కు చివరిదనే వాదనను బోర్డు కార్యదర్శి దేవజిత్‌ సైకియా తోసిపుచ్చాడు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా వన్డే ప్రపంచకప్‌ జరగనుండగా... అందులో ఆడాలని రోహిత్‌ భావిస్తుండగా... అతడి స్థానంలో యశస్వి జైస్వాల్‌కు అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. 

ఈ నేపథ్యంలో రోహిత్‌ వన్డే కెరీర్‌పై శుక్రవారం సైకియా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘రోహిత్‌ కెరీర్‌కు సంబంధించి ఏవేవో వార్తలు వస్తున్నాయి. ఆదివారం లార్డ్స్‌లో రోహిత్‌ చివరి వన్డే మ్యాచ్‌ ఆడబోతున్నాడనే విషయంపై ఎలాంటి చర్చ జరగలేదు. భారత వన్డే జట్టులో రోహిత్‌ కీలక సభ్యుడు. జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లో అతడు భాగం. లార్డ్స్‌ వన్డే అతడికి చివరి మ్యాచ్‌ కాదు’ అని సైకియా వెల్లడించాడు. సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ అజిత్‌ అగార్కర్, ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ తీరుపై బీసీసీఐ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో రోహిత్‌ వన్డే కెరీర్‌కు రిటైర్మెంట్‌ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడ్డట్లు అయింది. 

కెప్టెన్ గా భారత జట్టుకు టి20 ప్రపంచకప్, చాంపియన్స్‌ ట్రోఫీ అందించిన రోహిత్‌... వన్డే వరల్డ్‌ కప్‌ గెలవడమే తన లక్ష్యమని ఇప్పటికే పలుమార్లు ప్రకటించాడు. 2023లో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో రోహిత్‌ సారథ్యంలోని భారత జట్టు ఫైనల్లో ఆ్రస్టేలియా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలవగా... ఈసారి చిరకాల కల నెరవేర్చుకునేందుకు రోహిత్‌ మరో ఏడాది పాటు కెరీర్‌ కొనసాగించేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement