సెంచరీ కన్నా... గెలుపే ముఖ్యం | Team success is more important than individual milestones says Joe Root | Sakshi
Sakshi News home page

సెంచరీ కన్నా... గెలుపే ముఖ్యం

Jul 18 2026 3:39 AM | Updated on Jul 18 2026 3:39 AM

Team success is more important than individual milestones says Joe Root

ఇంగ్లండ్‌ స్టార్‌ జో రూట్‌ వెల్లడి  

కార్డిఫ్‌: వ్యక్తిగత మైలురాళ్ల కన్నా... జట్టు విజయమే ముఖ్యమని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌ వెల్లడించాడు. భారత్‌తో గురువారం జరిగిన రెండో వన్డేలో రూట్‌ 99 పరుగులతో అజేయంగా నిలిచాడు. కావాల్సినన్ని బంతులు అందుబాటులో ఉన్నా సెంచరీ పూర్తి చేసుకోవాలని చూడకుండా... సహచరుడికి మ్యాచ్‌ ముగించమని సూచించి తన విలువ చాటుకున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించగా... రూట్‌ అద్భుత పోరాటంతో రెండో వన్డేలో ఇంగ్లండ్‌ గెలుపొందింది. 

భారత్‌ 44 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌట్‌ కాగా... ఇంగ్లండ్‌ 44.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రూట్‌ మాట్లాడుతూ... ‘జట్టు విజయం సాధించినప్పుడు వచ్చే ఆనందం వ్యక్తిగత మైలురాళ్లు దాటినప్పుడు రాదు. భారత్‌ ఫీల్డింగ్‌ను దృష్టిలో పెట్టుకొని... అవకాశం వస్తే విన్నింగ్‌ రన్స్‌ చేయమని అట్కిన్సన్‌కు చెప్పా. 99 పరుగుల వద్ద అజేయంగా ఉంటాను అనే భావన కూడా నా మనసులో రాలేదు. ఆఖరి మ్యాచ్‌లోనూ ఇదే జోరు కనబరుస్తూ సిరీస్‌ సాధించాలనుకుంటున్నాం’ అని పేర్కొన్నాడు. 

వన్డేల్లో 99 నాటౌట్‌గా నిలిచిన తొలి ఇంగ్లండ్‌ క్రికెటర్‌ రూట్‌ కాగా... ఓవరాల్‌గా 17వ బ్యాటర్‌. ఇంగ్లండ్‌ విజయానికి 42 బంతుల్లో 12 పరుగులు అవసరమైన దశలో... 98 పరుగుల వద్ద ఉన్న రూట్‌ సింగిల్‌ తీసి సహచరుడికి బ్యాటింగ్‌ ఇవ్వడం గమనార్హం. వన్డే ఫార్మాట్‌లో తమ జట్టు మరింత పట్టుదలగా ఆడాల్సిన అవసరముందని రూట్‌ అన్నాడు. 

యువ ఆటగాళ్లు వీలైనంత త్వరగా ఫార్మాట్‌కు అనుగుణంగా ఆటను మార్చుకోవాలని సూచించాడు. ఒక దశలో వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును రూట్‌... ఒంటి చేత్తో ఒడ్డున పడేశాడు. వన్డే కెరీర్‌లో ఇప్పటి వరకు 191 మ్యాచ్‌లాడిన రూట్‌ 50.66 సగటుతో 7752 పరుగులు చేశాడు. అందులో 20 సెంచరీలు, 47 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement