సిరీస్‌ సమం | England beat India by 4 wickets in the second ODI | Sakshi
Sakshi News home page

IND vs ENG: సిరీస్‌ సమం

Jul 17 2026 1:18 AM | Updated on Jul 17 2026 10:24 AM

England beat India by 4 wickets in the second ODI

రెండో వన్డేలో భారత్‌ ఓటమి

4 వికెట్లతో నెగ్గిన ఇంగ్లండ్‌

కోహ్లి, శ్రేయస్‌ పోరాటం వృథా

కార్డిఫ్‌: ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో చక్కటి విజయం సాధించిన భారత జట్టు... రెండో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో పోరులో ఆతిథ్య ఇంగ్లండ్‌ 4 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. ఫలితంగా సిరీస్‌ 1–1తో సమమైంది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 44 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (66 బంతుల్లో 65; 8 ఫోర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (71 బంతుల్లో 66; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. 

గిల్‌ (31; 6 ఫోర్లు), రోహిత్‌ శర్మ (26; 1 ఫోర్, 1 సిక్స్‌) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. గత మ్యాచ్‌ అర్ధశతక వీరులు వాషింగ్టన్‌ సుందర్‌ (2), అక్షర్‌ పటేల్‌ (1)తో పాటు ఇషాన్‌ కిషన్‌ (1), శివమ్‌ దూబే (0) సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆఖర్లో బుమ్రా (13 బంతుల్లో 20 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక పరుగులు జోడించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆర్చర్, ఆట్కిన్సన్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌ 44.1 ఓవర్లలో 6 వికెట్లకు 235 పరుగులు చేసింది. 

మాజీ కెప్టెన్‌ జో రూట్‌ (133 బంతుల్లో 99 నాటౌట్‌; 9 ఫోర్లు) సెంచరీకి ఒక్క పరుగు దూరంలో అజేయంగా నిలిచాడు. డకెట్‌ (0), బెథెల్‌ (4), కెప్టెన్‌ బ్రూక్‌ (16), సామ్‌కరన్‌ (26), బట్లర్‌ (17) విఫలమ య్యారు. ఒక దశలో 125 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ జట్టును రూట్‌ ఆదుకున్నాడు. విల్‌ జాక్స్‌ (30; 2 ఫోర్లు)తో కలిసి 86 బంతుల్లో 72 పరుగులు జోడించాడు. దీంతో విజయ సమీకరణం ఇంగ్లండ్‌కు అనుకూలంగా మారింది.

ఆరంభంలో ప్రభావవంతంగా కనిపించిన భారత బౌలర్లు ఆ తర్వాత అదే జోరు కనబర్చడంలో విఫలమయ్యారు. గుర్‌నూర్‌ బ్రార్‌ రెండు వికెట్లు పడగొట్టగా... బుమ్రా, ప్రసిధ్, శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. ఆదివారం లార్డ్స్‌లో నిర్ణయాత్మక మూడో వన్డే జరగనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement