అతడిని ఆరో స్థానంలో ఆడిస్తారా?: మాజీ కెప్టెన్‌ ఫైర్‌ | IND vs ENG You are wasting one of best batters in world: Kris Srikkanth | Sakshi
Sakshi News home page

IND vs ENG: అతడిని ఆరో స్థానంలో ఆడిస్తారా?: మాజీ కెప్టెన్‌ ఫైర్‌

Jul 15 2026 1:10 PM | Updated on Jul 15 2026 1:26 PM

IND vs ENG You are wasting one of best batters in world: Kris Srikkanth

Photo Credit: BCCI X

ఇంగ్లండ్‌ తాజా పర్యటనలో టీమిండియా ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. టీ20 సిరీస్‌లో ఆతిథ్య జట్టు చేతిలో 4-0తో క్లీన్‌స్వీప్‌ అయిన భారత్‌.. వన్డే సిరీస్‌లో మాత్రం శుభారంభం అందుకుంది. బర్మింగ్‌హామ్‌ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ సేన.. ఇంగ్లండ్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ముగ్గురూ అదరగొట్టారు
ఇంగ్లండ్‌ విధించిన 259 పరుగుల లక్ష్యాన్ని 45.2 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనింగ్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ గిల్‌ 80 పరుగులతో అదరగొట్టగా.. ఆల్‌రౌండర్లు వాషింగ్టన్‌ సుందర్‌ (52), అక్షర్‌ పటేల్‌ (57) అజేయ అర్ధ శతకాలతో రాణించి జట్టును గెలిపించారు.

రాహుల్‌ విఫలం
ఇక ఈ మ్యాచ్‌లో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ రెగ్యులర్‌గా వచ్చే ఐదో స్థానంలో కాకుండా.. ఆరో నంబర్‌ బ్యాటర్‌గా బరిలోకి దిగాడు. అతడి స్థానంలో వాషీ ఐదో స్థానానికి ప్రమోట్‌ అయి సక్సెస్‌ కాగా.. రాహుల్‌ మూడు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి జోష్‌ టంగ్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు.

ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే బ్యాటర్‌ 
ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ కెప్టెన్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ టీమిండియా యాజమాన్యంపై మండిపడ్డాడు. రాహుల్‌కు అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ.. ‘‍‘నాకు తెలిసి రాహుల్‌కు కూడా ఇలా డిమోట్‌ అవ్వడం నచ్చి ఉండదు.

ఇలాగే బలి చేస్తారా?
ఏదేమైనా ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే బ్యాటర్‌ సేవలను మీరు సరిగ్గా ఉపయోగించుకోకుండా.. అతడి ప్రతిభను వృథా చేస్తున్నారు. ఇకముందు కూడా వరల్డ్‌ బెస్ట్‌ బ్యాటర్‌ను ఇలాగే బలి చేస్తారా?

లెఫ్ట్‌- రైట్‌ కాంబినేషన్‌ గురించి మీరు ఆలోచించి ఉండవచ్చు. కానీ దీని వల్ల కేఎల్‌ రాహుల్‌ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అతడు మ్యాచ్‌ విన్నర్‌. ఒంటిచేత్తో జట్టును గెలిపించగలడు. అలాంటి ఆటగాడి పట్ల ఇలాంటి వైఖరి ఎంతమాత్రం సరికాదు.

ఇలా చేస్తే మున్ముందు కష్టమే
రాహుల్‌ను ఆరు లేదంటే ఏడో స్థానంలో ఎలా పంపగలరు?.. భారత క్రికెట్‌కు ఇది మంచిదికాదు. ముఖ్యంగా వన్డే వరల్డ్‌కప్‌-2027కు ముందు రాహుల్‌ విషయంలో ఇలాంటి ఆటలు వద్దు. సౌతాఫ్రికాలో పిచ్‌లు ఇంతకంటే బౌన్సీగా ఉంటాయి. కాబట్టి రాహుల్‌ కంటే ముందు వాషీని బ్యాటింగ్‌కు పంపడం సరికాదు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

కాగా కర్ణాటక బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ తన వన్డే కెరీర్‌లో ఇప్పటికి బ్యాటింగ్‌ ఆర్డర్‌లో తొలి ఏడు స్థానాల్లోనూ ఆడాడు. సగటు 50తో పరుగులు రాబట్టాడు. ఎనిమిది సెంచరీలు కూడా చేశాడు. 

ఇక ఐదో నంబర్ బ్యాటర్‌గా 35 ఇన్నింగ్స్‌ ఆడిన రాహుల్‌ అత్యుత్తమంగా 63.20 సగటుతో పరుగులు చేశాడు. ఇక ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ 14 ఇన్నింగ్స్‌లో ఆరో స్థానంలో బరిలోకి దిగినపుడు అతడి సగటు కేవలం 37 మాత్రమే కావడం గమనార్హం.

చదవండి: గిల్‌ గాయంపై అప్‌డేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement