మాట తప్పిన బీసీసీఐ!? | New Twist In Doeschate Resignation BCCI Promise Broken: Reports | Sakshi
Sakshi News home page

మాట తప్పిన బీసీసీఐ!?

Jul 15 2026 12:24 PM | Updated on Jul 15 2026 12:28 PM

New Twist In Doeschate Resignation BCCI Promise Broken: Reports

డస్కటే (PC: BCCI)

టీమిండియానువీడనున్న డస్కటే! 

లీగ్‌ క్రికెట్‌పై అసిస్టెంట్‌ కోచ్‌ ఆసక్తి

అసలు నిజం ఏమిటి?

టీమిండియా అసిస్టెంట్‌ కోచ్‌ ర్యాన్‌ టెన్‌ డస్కటే రాజీనామా అంశంలో బిగ్‌ ట్విస్ట్‌..! వ్యక్తిగత కారణాల దృష్ట్యా అతడు తన పదవి నుంచి తప్పుకొన్నాడని తొలుత వార్తలు వచ్చాయి. ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ తర్వాత డస్కటే తన బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది.

మాట తప్పిన బీసీసీఐ!
అయితే, కేవలం వ్యక్తిగత కారణాలు కాకుండా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) యాజమాన్యం తనకు ఇచ్చిన మాట తప్పినందు వల్లే డస్కటే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాజా సమాచారం. కాగా రెండేళ్ల క్రితం గౌతం గంభీర్‌ భారత హెడ్‌ కోచ్‌గా నియమితుడైన తర్వాత డస్కటే టీమ్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. 

గంభీర్‌ ఏరికోరి తెచ్చుకుంటే..
గతంలో ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు కలిసి పని చేసిన అనుభవంతో డస్కటేను గంభీర్‌ ఎంచుకున్నాడు. అయితే ఇప్పటికీ తన బాధ్యతలపై స్పష్టత లేకపోవడంతో డస్కటే జట్టుకు దూరం కావడమే సరైందిగా భావిస్తున్నట్లు తెలిసింది. 

టీమ్‌తో చేరినప్పుడు తనకు స్పెషలిస్ట్‌ ఫీల్డింగ్‌ కోచ్‌ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారట. కానీ హైదరాబాద్‌కు చెందిన టి.దిలీప్‌ను చాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత కూడా కొనసాగించడంతో డస్కటేకు ఆ అవకాశం దక్కలేదు.

పని లేదు.. అందుకే
‘బ్యాటింగ్‌ బాధ్యతలను గంభీర్‌తో పాటు బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్‌ చూస్తున్నారు. పేసర్ల కోసం మోర్నీ మోర్కెల్, స్పిన్నర్లకు సాయిరాజ్‌ బహుతులే కోచ్‌లుగా ఉన్నారు. ఇక డస్కటేకు పని ఏముంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 

మరోవైపు.. లండన్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న డస్కటే తన కుటుంబంతో తగిన సమయం గడిపేందుకు కూడా భారత జట్టును వీడాలని భావిస్తున్నట్లు క్రిక్‌బజ్‌ పేర్కొంది.

అంతర్జాతీయ జట్టుకంటే ఫ్రాంచైజీ లీగ్‌లతో కలిసి పని చేయడం తనకు సౌకర్యంగా ఉంటుందని కూడా డస్కటే అనుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు లీగ్‌ల యాజమాన్యాలు డస్కటేను సంప్రదించినట్లు సమాచారం. ఇక డస్కటే నిజంగా తప్పుకొంటే దిలీప్‌ను బీసీసీఐ మరికొంత కాలం పాటు ఫీల్డింగ్‌ కోచ్‌గా కొనసాగించే అవకాశం ఉంది.  

చదవండి: ఇంగ్లండ్‌ కంచుకోట బద్దలు.. గిల్‌  రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement