breaking news
Ryan Ten Doeschate
-
BCCI: ఇద్దరు టీమిండియా కోచ్‌లపై వేటు!.. అతడు మాత్రం..
గత కొన్నాళ్లుగా టీమిండియా టెస్టుల్లో నిరాశపరుస్తోంది. ముఖ్యంగా గౌతం గంభీర్ హెడ్‌కోచ్‌గా వచ్చిన తర్వాత స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడుతోంది. స్వదేశంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో కనీవినీ ఎరుగని రీతిలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు.. ఆస్ట్రేలియా పర్యటనలోనూ చేదు అనుభవం చవిచూసింది.కంగారూ జట్టు చేతిలో 3-1తో ఓడి దాదాపు పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. ఈ క్రమంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2025 ఫైనల్ చేరే అవకాశాన్ని కూడా టీమిండియా కోల్పోయింది. డబ్ల్యూటీసీ మొదలుపెట్టిన తర్వాత వరుసగా రెండుసార్లు టైటిల్ పోరుకు అర్హత సాధించిన భారత్.. ఈసారి మాత్రం ఇలా డీలాపడింది.అయితే, గత వైఫల్యాలు మరిచి డబ్ల్యూటీసీ 2025-27 సీజన్‌ను ఆరంభించిన టీమిండియా.. ఇంగ్లండ్ పర్యటనలోనూ నిరాశపరుస్తోంది. కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్ నేతృత్వంలో... టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా లీడ్స్‌లో ఓడిపోయిన టీమిండియా.. ఎడ్జ్‌బాస్టన్‌లో మాత్రం తొలిసారి గెలుపు జెండా ఎగురవేసింది.అనంతరం లార్డ్స్‌లో ఓడిపోయిన గిల్ సేన... తాజాగా మాంచెస్టర్‌లో ముగిసిన నాలుగో టెస్టులో ‘డ్రా’ తో గట్టెక్కింది. ఇక ఓవల్ మైదానంలో.. ఆఖరిదైన ఐదో టెస్టులో గెలిస్తేనే టీమిండియా సిరీస్‌ను 2-2తో సమం చేయగలుగుతుంది. లేదంటే.. విదేశీ గడ్డపై వరుసగా రెండోసారి భంగపాటు తప్పదు.నిజానికి లీడ్స్, లార్డ్స్‌లో వ్యూహాత్మక తప్పిదాల వల్లే గెలవాల్సిన మ్యాచ్‌లలో టీమిండియా ఓడిపోయింది. ముఖ్యంగా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సేవలు వాడుకోకపోవడం.. కరుణ్ నాయర్ విఫలమవుతున్నా వరుస అవకాశాలు ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈ క్రమంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పై వేటు వేయాలనే డిమాండ్లు వస్తున్నాయి.అయితే, గంభీర్‌పై నమ్మకం ఉంచిన యాజమాన్యం బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటేలపై మాత్రం వేటు వేయనున్నట్లు సమాచారం. ‘ది టెలిగ్రాఫ్’ కథనం ప్రకారం.. ఆసియా కప్-2025 ముగిసిన తర్వాత వీళ్లిద్దరికి ఉద్వాసన పలికేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రంగం సిద్ధం చేసింది. వెస్టిండీస్‌తో అక్టోబరులో జరిగే సిరీస్‌కు ముందే వీరిపై వేటు వేయనుంది. మోర్కెల్ బౌలింగ్ కోచ్‌గా వచ్చిన తర్వాత టీమిండియా బౌలింగ్ విభాగంలో పెద్దగా మార్పులేమీ రాలేదని మేనేజ్మెంట్ భావిస్తోంది. మరోవైపు.. అసిస్టెంట్ కోచ్‌గా డష్కాటే సేవలు కూడా అంత గొప్పగా లేవనే భావనలో ఉంది. ఈ నేపథ్యంలోనే మోర్కెల్, డష్కాటేలను సాగననంపేందుకు బోర్డు సిద్ధమైంది.కాగా గంభీర్ కోరిక మేరకే మోర్నీ మోర్కెల్, డష్కాటేలతో పాటు అభిషేక్ నాయర్‌ను మేనేజ్మెంట్ అతడి సహాయక సిబ్బందిలో చేర్చింది. అయితే, ఆస్ట్రేలియా పర్యటన తర్వాత అభిషేక్ నాయర్‌పై వేటు వేసిన బీసీసీఐ... తాజాగా మోర్నీ, డష్కాటేల భవితవ్యంపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. -
సిరాజ్ సింహం లాంటోడు.. ఒక్కోసారి మేమే వారిస్తాం: టీమిండియా కోచ్
భారత పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) గురించి టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే (Ryan ten Doeschate) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పనిభారం గురించి అతడు అస్సలు ఆలోచించడని.. తామే ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. సిరాజ్ సింహం లాంటివాడని.. జట్టు ప్రయోజనాల కోసం ఎల్లవేళలా బంతితో సిద్ధంగా ఉంటాడంటూ ప్రశంసించాడు.నాలుగో టెస్టు గెలిస్తేనే..ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ-2025 (Anderson- Tendulkar Trophy) ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఐదింటిలో ఇప్పటికి మూడు టెస్టులు పూర్తి కాగా.. ఆతిథ్య జట్టు గిల్ సేనపై 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య జరిగే నాలుగో టెస్టు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్ గెలవాలన్న టీమిండియా ఆశలు సజీవంగా ఉంటాయి.బుమ్రా ఆడేది మూడేఅయితే, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండడని టీమిండియా యాజమాన్యం ముందే చెప్పింది. అతడు కేవలం మూడు టెస్టులే ఆడతాడని స్పష్టం చేసింది. ఈ క్రమంలో లీడ్స్‌లో ఆడిన బుమ్రా.. ఎడ్జ్‌బాస్టన్‌లో విశ్రాంతి తీసుకుని.. లార్డ్స్‌లో మళ్లీ ఆడాడు.ఇక బుమ్రా గైర్హాజరీలో పేస్ దళాన్ని ముందుకు నడిపిస్తున్న మరో సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ మెరుగ్గా రాణిస్తున్నాడు. మూడు టెస్టుల్లోనూ ఆడిన అతడు.. మొత్తంగా 13 (2, 6, 1, 2, 2) వికెట్లు తీశాడు. ముఖ్యంగా ఎడ్జ్‌బాస్టన్‌లో ఆరు వికెట్లతో చెలరేగి భారత్ చారిత్రాత్మక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.సిరాజ్ సింహం లాంటోడుఈ నేపథ్యంలో డస్కటే సిరాజ్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘‘అలాంటి ఆటగాడు మా జట్టులో ఉండటం మాకు సానుకూలాంశం. ఇక్కడ ఫాస్ట్‌బౌలర్‌గా అతడి నుంచి మనం అందరికంటే కాస్త ఎక్కువగానే వికెట్లు తీస్తాడని ఆశిస్తాం.అయితే, తను పనిభారం గురించి మాత్రం అస్సలు పట్టించుకోడు. అందుకే మేమే అతడిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. సింహం లాంటి పోరాటపటిమ అతడి సొంతం.మేమే అతడిని వారిస్తాంలార్డ్స్లో స్టోక్స్ మాదిరి అదనపు ఓవర్లు వేసేందుకు సిరాజ్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కానీ అతడు ఫిట్‌గా ఉండేలా చూసుకోవడం మా పని. అందుకే ఒక్కోసారి మేనేజ్మెంట్ అతడిని వారించాల్సి వస్తుంది కూడా. ఏదేమైనా అతడి చేతిలో బంతి ఉందంటే కచ్చితంగా ఏదో ఒక అద్భుతం చేస్తాడనే నమ్మకం ఉంటుంది’’ అంటూ ఆట పట్ల సిరాజ్ అంకితభావం గురించి డస్కటే వివరించాడు.కాగా 2023 నుంచి టీమిండియా ఆడిన 27 టెస్టులలో సిరాజ్ 24 మ్యాచ్‌లు ఆడాడు. టీమిండియా ఫాస్ట్బౌలర్లలో ఒక్కరు కూడా ఇలా వరుస మ్యాచ్‌లు ఆడలేదు. ఇక 2023 నుంచి ఇప్పటిదాకా అతడు 569.4 ఓవర్లు బౌల్ చేశాడు. ఈ మధ్యకాలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (721.2 ఓవర్లు), పేసర్ మిచెల్ స్టార్క్ (665.1) తర్వాత ఈ స్థాయిలో అలుపెరగకుండా బౌలింగ్ చేసిన ఏకైక భారత ఫాస్ట్‌బౌలర్ సిరాజ్. ఇదిలా ఉంటే.. మాంచెస్టర్ వేదికగా జూలై 23-27 మధ్య భారత్- ఇంగ్లండ్ నాలుగో టెస్టు జరుగనుంది.చదవండి: భారత ఓపెనింగ్ జోడీ ప్రపంచ రికార్డు -
నాలుగో టెస్టులో రిషబ్ పంత్ ఆడుతాడా? కీలక్ అప్డేట్ ఇచ్చిన కోచ్
ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి ప్రారంభం కానున్న నాలుగో టెస్టులో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు బెకెన్‌హామ్‌లో తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టింది. గురువారం తొలి ప్రాక్టీస్ సెషన్లో గిల్ సేన తీవ్రంగా శ్రమించింది. అయితే ఈ ప్రాక్టీస్ సెషన్‌కు టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ దూరమయ్యాడు.లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో పంత్ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడి స్ధానంలో ధ్రువ్ జురెల్ సబ్‌స్ట్యూట్ వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఫీల్డింగ్‌కు దూరంగా ఉన్న పంత్.. రెండు ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు మాత్రం వచ్చాడు. తీవ్రమైన నొప్పితో బాధపడుతూనే బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో నాలుగో టెస్టుకు పంత్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. తాజాగా పంత్ గాయంపై భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్‌డెష్కాట్ అప్డేట్ ఇచ్చాడు. పంత్ ఇంకా నొప్పితో బాధపడుతున్నాడని, మాంచెస్టర్ టెస్ట్ సమయానికి ఫిట్నెస్ సాధిస్తాడని టెన్‌డెష్కాట్ థీమా వ్యక్తం చేశాడు."మాంచెస్టర్‌లో జరిగే నాలుగో టెస్టుకు ముందు పంత్ తన బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను మొదలు పెడతాడు. ఆ సమయానికి అతడు కచ్చితంగా ఫిట్నెస్ సాధిస్తాడన్న నమ్మకం ఉంది. అతడు మూడో టెస్టులో చాలా నొప్పితో బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత అతడి చేతి వేలి నొప్పి కాస్త తగ్గింది.కానీ ముందుస్తు జాగ్రత్తగా ప్రస్తుతం అతడు ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నాడు. వికెట్ కీపింగ్ చేయగలడా లేదా అన్నది ఆఖరిలో మేము నిర్ధారించుకుంటాము. మరోసారి ఇన్నింగ్స్ మధ్యలో కీపర్‌ను మార్చాల్సిన పరిస్థితి రాకూడదు. పూర్తి ఫిట్నెస్ సాధిస్తే పంత్‌నే బ్యాటింగ్, వికెట్ కీపింగ్ రెండూ చేస్తాడు. రాబోయే రోజుల్లో అతడి ఫిట్‌నెస్‌పై కచ్చితంగా అప్డేట్ ఇస్తామని" విలేకరుల సమావేశంలో డెష్కాట్ పేర్కొన్నాడు.చదవండి: ENG vs IND: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు.. టీమిండియాకు భారీ షాక్ -
జైస్వాల్‌పై గంభీర్ ఆగ్రహం!.. ‘వేటు’ తప్పదన్న డష్కాటే!
ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమిండియా ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటి ఫీల్డింగ్ వైఫల్యం. కీలక సమయాల్లో కీలక క్యాచ్‌లు నేలపాలు చేసి.. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు దాదాపు ఆరుసార్లు మనోళ్లు ‘లైఫ్’ ఇచ్చారు. అందుకు బదులుగా ఓటమి రూపంలో భారీ మూల్యమే చెల్లించారు.ఇక ఫీల్డర్ల తప్పిదాలు గమనిస్తే ప్రధాన దోషిగా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) పేరు చెప్పవచ్చు. ఆరింటిలో నాలుగు క్యాచ్‌లు అతడే జారవిడిచాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ వీరుడు, గెలుపునకు పునాది వేసిన బెన్ డకెట్ ఇచ్చిన క్యాచ్‌ను జైసూ వదిలేయడం తీవ్ర ప్రభావం చూపింది.జైస్వాల్ ఫీల్డింగ్ తీరుపై గంభీర్ ఆగ్రహంఈ నేపథ్యంలో జైస్వాల్ ఫీల్డింగ్ తీరుపై హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అతడితో క్యాచింగ్ ప్రాక్టీస్ చేయించిన గౌతీ.. ఈ సందర్భంగా గట్టిగానే క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఫీల్డింగ్ విషయంలో జైసూని డిమోట్ చేయాలని నిర్ణయించినట్లు రెవ్‌స్పోర్ట్స్ పేర్కొంది.టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డష్కాటే సోమవారం నాటి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని దాదాపు ధ్రువీకరించింది. ‘‘క్యాచింగ్ విభాగం మరింత దృఢంగా మారాలి. ఇంగ్లండ్‌లో కనీసం నాలుగు ప్రధాన క్యాచర్లు ఒక్కోసారి కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.విరామం అనివార్యంయశస్వి కూడా మంచి క్యాచర్. ఇక ఇద్దరు స్పిన్నర్లను ఆడించినప్పుడు షార్ట్ లెగ్ ఫీల్డింగ్ స్థానం మరింత కీలకమవుతుందని చెప్తారు. అందుకే అక్కడ మేము ఒకరి కంటే ఎక్కువ మందిని సెట్ చేయాలని భావిస్తున్నాం.ఏదేమైనా యశస్వికి గల్లీ క్యాచ్ పాయింట్ నుంచి కాస్త విరామం ఇవ్వడం అవసరమే. ప్రస్తుతం అతడి ఫీల్డింగ్ తీరు బాగాలేదు. అయినా సరే అతడు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండాలంటే ఈ బ్రేక్ ఇవ్వాలి’’ అంటూ స్లిప్ క్యాచింగ్ రోల్ నుంచి జైసూను తప్పిస్తామని డష్కాటే చెప్పకనే చెప్పాడు. ఇదిలా ఉంటే.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ (101)తో అదరగొట్టాడు.కాగా ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లిన టీమిండియా.. లీడ్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు (జూలై 2-6) బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో జరుగనుంది.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. భారత తుది జట్టులోకి తమిళనాడు కుర్రాడు? -
రోహిత్ శర్మకు ఫ్రెండ్.. సీనియర్లకు అతడి ప్రవర్తన నచ్చలేదు!
సీనియర్ ఆటగాళ్లతో సఖ్యత లేకపోవడమే టీమిండియా కోచ్ అభిషేక్ నాయర్ (Abhishek Nayar)పై వేటుకు కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. డ్రెసింగ్‌రూమ్‌లో నాయర్ వ్యవహారశైలి పట్ల జట్టులోని కీలక సభ్యులు అసంతృప్తిగా ఉన్నారని.. వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్న తర్వాతే బీసీసీఐ (BCCI)అతడిని తప్పించిందని తెలుస్తోంది. కాగా భారత క్రికెట్ జట్టు సహాయక సిబ్బందికి సంబంధించి బీసీసీఐ అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. టీమ్ అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న అభిషేక్ నాయర్‌పై వేటు వేసింది. ఎనిమిది నెలల క్రితమే బాధ్యతలు తీసుకున్న నాయర్‌ను బాధ్యతల నుంచి తప్పించేందుకు బోర్డు సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది. మూడు నెలల తర్వాతస్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్‌లో 0–3తో ఓటమి, ఆపై ఆస్ట్రేలియా గడ్డపై 1–3తో సిరీస్ కోల్పోయిన తర్వాత జనవరిలో బీసీసీఐ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించింది.ఇందులో జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్క (Ajit Agarkar)ర్తో పాటు బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పాల్గొన్నారు. ఈ సమావేశం తర్వాతే కోచింగ్ బృందంలో ఎవరి పైనైనా చర్యలు ఉండవచ్చని అర్థమైంది. ఇప్పుడు దాదాపు మూడు నెలల తర్వాత అభిషేక్ నాయర్‌ను బోర్డు తప్పించింది. హెడ్ కోచ్‌గా గంభీర్ కాంట్రాక్ట్‌ను 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఖాయం చేసిన బీసీసీఐ... నాయర్‌ను నియమించినప్పుడు అతని పదవీ కాలం విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టతనివ్వలేదు.కొటక్ ఎంపికతోనే... 2024 ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు కోసం గంభీర్, అభిషేక్ నాయర్ కలిసి పని చేశారు. జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. గంభీర్ హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాక ఎలాంటి దరఖాస్తులు, ఇంటర్వ్యూలు లేకుండా తనకు నచ్చిన వారిని ఎంచుకునేందుకు బోర్డు అవకాశం ఇచ్చింది. రోహిత్ శర్మకు మంచి స్నేహితుడుఈ క్రమంలో నాయర్‌ను అతను అసిస్టెంట్ కోచ్‌గా తీసుకున్నాడు. రోహిత్ శర్మకు మంచి స్నేహితుడైన నాయర్... అటు కెప్టెన్, ఇటు కోచ్‌గా మధ్య మంచి సంధానకర్తగా కూడా పని చేయగలడని భావించడం కూడా అతని ఎంపికకు మరో కారణం.భారత్ తరఫున 3 వన్డేలు ఆడిన ముంబై ఆల్‌రౌండర్ నాయర్‌కు దేశవాళీ క్రికెట్లో మంచి రికార్డుంది. అధికారికంగా ఏ జట్టుకు కోచ్‌గా పని చేయకపోయినా కూడా వ్యక్తిగతంగా ఎంతో మంది బ్యాటర్ల ఆటను మెరుగుపర్చడంలో అతని పాత్ర చాలా ఉంది. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వెంకటేశ్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రఘువంశీ ఇదే మాట చెప్పారు.అపుడే నాయర్ భవిష్యత్తుపై సందేహాలునిజానికి చాంపియన్స్ ట్రోఫీకి అప్పటికే ఉన్న సహాయక సిబ్బందితో పాటు అదనంగా మరో అసిస్టెంట్ కోచ్ సితాన్షు కొటక్‌ను పంపడంతోనే నాయర్ భవిష్యత్తుపై సందేహాలు వచ్చాయి. ఇప్పుడు అదే నిజమైంది. మరోవైపు ఫీల్డింగ్ కోచ్, హైదరాబాద్‌కు చెందిన టి.దిలీప్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్‌లను కూడా తప్పిస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. పని తీరు గురించి కాకుండా వీరి పదవీకాలం ముగియడమే కారణమని తెలుస్తోంది. బోర్డు కొత్త నిబంధనల (ఎస్ఓపీ) ప్రకారం సహాయక సిబ్బంది పదవీకాలం గరిష్టంగా మూడేళ్లే ఉండాలి. గంభీర్ ఏమాత్రం వ్యతిరేకించలేదుఇదిలా ఉంటే.. పట్టుబట్టి మరీ అభిషేక్ నాయర్‌ను తన సహాయక సిబ్బందిలో చేర్చుకున్న గంభీర్.. అతడిని తప్పించే సమయంలో ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘నాయర్‌పై వేటు వేయడాన్ని గంభీర్ ఏమాత్రం వ్యతిరేకించలేదు.డష్కాటే, మోర్నీ మోర్కెల్‌ను తన సిబ్బందిలో చేర్చుకునేందుకు గంభీర్ బోర్డుతో ఎన్నో సంప్రదింపులు జరిపాడు. అనేక చర్చల తర్వాతే వారిని సిబ్బందిలో చేర్చుకునే అవకాశం వచ్చింది. వారిని వదులుకునేందుకు మాత్రం అతడు సిద్ధంగా లేడు. అయితే, అభిషేక్ నాయర్ విషయం మాత్రం వేరు’’ అని పేర్కొన్నాయి.చదవండి: నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. ప్రేమగా చెంప నిమిరిన మాజీ ఓనర్! -
గంభీర్ వ్యూహం అదే.. ఇకపై కూడా మార్పు ఉండదు: అసిస్టెంట్ కోచ్
ఇంగ్లండ్‌తో మూడో టీ20లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌పై వచ్చిన విమర్శలపై అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే(Ryan Ten Doeschate) స్పందించాడు. హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) వ్యూహాలకు అనుగుణంగానే తమ ప్రణాళికలు ఉంటాయని తెలిపాడు. ఫలితాలతో సంబంధం లేకుండా.. దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా ఇక ముందు కూడా ప్రయోగాలు కొనసాగిస్తామని పేర్కొన్నాడు.కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్(India vs England)తో పాటు మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్ ఇండియా పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ మొదలుకాగా.. ఇరుజట్ల మధ్య ఇప్పటికే మూడు మ్యాచ్‌లు జరిగాయి.బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదంటూకోల్కతా, చెన్నైలలో వరుస విజయాలు సాధించిన.. రాజ్‌కోట్‌లో మంగళవారం జరిగిన మూడో టీ20లో మాత్రం పరాజయం పాలైంది. తద్వారా ఇంగ్లండ్‌పై సూర్య సేన ఆధిక్యం 2-1కు తగ్గింది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదంటూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ సహా పలువురు మాజీ క్రికెటర్లు విమర్శించారు.స్పెషలిస్టు బ్యాటర్ అయిన ధ్రువ్ జురెల్‌ను ఎనిమిదో స్థానంలో ఆడించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అతడిని కాదని.. కేవలం లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసమని ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్- అక్షర్ పటేల్‌లను ముందుగా బ్యాటింగ్‌కు పంపడాన్ని తప్పుబట్టారు. ఇక ఈ మ్యాచ్‌లో జురెల్ రెండు పరుగులకే పరిమితం కాగా.. వాషింగ్టన్ సుందర్ 6, అక్షర్ పటేల్ 15 పరుగులు చేశారు.మిగతా వాళ్లు కూడా నామమాత్రపు స్కోర్లకే పరిమితం కావడంతో టీమిండియా లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిపాలైంది. ఇంగ్లండ్ విధించిన 172 పరుగుల టార్గెట్‌ను పూర్తి చేసే క్రమంలో 145 పరుగుల వద్ద నిలిచి.. 26 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ తీరుపై విమర్శలు వచ్చాయి. మా వ్యూహాల్లో భాగమే..ఈ క్రమంలో అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే స్పందిస్తూ.. ‘‘ధ్రువ్ జురెల్‌ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు ఎందుకు పంపించారని మీరు వాదించవచ్చు. అయితే, కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత .. ముఖ్యంగా టీ20 క్రికెట్లో గౌతం గంభీర్ బ్లూప్రింట్ ఎలా ఉందో ఓ సారి గమనిస్తే విషయం మీకే అర్థమవుతుంది.ఎనిమిదో నంబర్ వరకు బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లు ఉండేలా అతడు సెట్ చేస్తాడు. ఇక ధ్రువ్ ఎనిమిదో స్థానంలో వచ్చినపుడు అతడి అత్యుత్తమ ప్రదర్శన చూస్తామని నేను అనుకోలేదు. ఏదేమైనా అతడిని అలా లోయర్ ఆర్డర్లో పంపించడం మా వ్యూహాల్లో భాగమే.వీలైనన్ని అవకాశాలు ఇస్తాంఫలితం ఎలా ఉన్నా... మా ఆటగాళ్లపై నమ్మకం ఉంచుతాం. సుదీర్ఘకాలంలో జట్టు ప్రయోజనాల దృష్ట్యా వారికి వీలైనన్ని అవకాశాలు ఇస్తాం. తప్పక తమను తాము నిరూపించుకుని. తమ విలువేంటో చాటుకుంటారు’’ అని పేర్కొన్నాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య శుక్రవారం నాలుగో టీ20 జరుగనుంది. పుణె ఇందుకు వేదిక. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ సేన రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉందని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్‌లను తప్పించి..వారి స్థానంలో శివం దూబే, అర్ష్‌దీప్ సింగ్‌లను ఆడించాలని సూచించాడు. చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ.. ఆసీస్‌కు భారీ షాక్! విధ్వంసకర వీరుడు దూరం -
బంగ్లాతో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తాము: టీమిండియా కోచ్
హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో మూడో టీ20లో తలపడేందుకు టీమిండియా అన్నివిధాల సిద్దమైంది. శనివారం సాయంత్రం 7:00 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకున్న టీమిండియా.. ఆఖరి టీ20లో గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్‌టెన్ డోస్చేట్ విలేకరుల సమావేశంలో పాల్గోన్నాడు.ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలన్నదే మా జట్టు, అభిమానుల కోరిక. కచ్చితంగా అలాగే ముగించేందుకు ప్రయత్నిస్తాము అని చెప్పుకొచ్చాడు. అదే విధంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మనస్తత్వం గురించి మాట్లాడాడు.దేశం తరపున ఆడే ప్రతీ మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని గంభీర్ భావిస్తాడు. ప్రతీసారి ఆటగాళ్లని కూడా ఒత్తిడికి గురిచేస్తాడన్న విషయం తెలిసిందే. కాబట్టి ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ మ్యాచ్‌కు కూడా అన్ని మ్యాచ్‌లకు సన్నద్దమైనట్లే సిద్దమయ్యాము. ప్రస్తుతం భారత జట్టు అద్బుతంగా ఆడుతోంది. కుర్రాళ్లు కూడా బాగా రాణిస్తున్నారు. తొలిసారి భారత జట్టు తరపున ఆడుతున్న కుర్రాళ్లను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జితేష్ శర్మ, తిలక్ వర్మ, హర్షిత్ రానాలకు ఆడే అవకాశం ఇంకా రాలేదు. మూడో టీ20 జట్టు ఎంపిక కు ఈ యంగ్ ప్లేయర్లను కూడా పరిగణలోకి తీసుకుంటున్నాము. కుర్రాళ్లందరికి అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం వచ్చేలా ప్రయత్నిస్తున్నామని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ర్యాన్‌టెన్ డోస్చేట్ పేర్కొన్నాడు.చదవండి: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రాబిన్ ఉతప్ప -
ట్విస్ట్ ఇచ్చిన గంభీర్!.. ఆ విషయంలో నో క్లారిటీ
భారత క్రికెట్ జట్టు శ్రీలంకకు పయనమైంది. టీ20 రెగ్యులర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, వన్డే వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్, రింకూ సింగ్ తదితరులు సోమవారం ముంబై నుంచి విమానంలో బయల్దేరారు.ఇక లంకకు ప్రయాణమయ్యే ముందు టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కోచింగ్ సహాయక సిబ్బంది గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.వారికే పెద్దపీటబ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా మూడు విభాగాలకు వేర్వేరు కోచ్‌లు ఉన్నా.. అన్నింటిలోనూ ప్రావీణ్యం చూపగలిగే సిబ్బందికే తాను పెద్దపీట వేస్తానని పేర్కొన్నాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్‌లో తనతో కలిసి పనిచేసిన అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డష్కాటేలను అసిస్టెంట్ కోచ్‌లుగా శ్రీలంకకు వస్తున్నట్లు గంభీర్ అధికారికంగా వెల్లడించాడు.‘‘నేను కోరుకున్నట్లుగానే బీసీసీఐ చాలా విషయాల్లో సానుకూలంగా స్పందించినందుకు సంతోషంగా ఉంది. అభిషేక్, డష్కాటే అసిస్టెంట్ కోచ్‌లు అంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.శ్రీలంక టూర్ ముగిసిన తర్వాతే క్లారిటీఅయితే, శ్రీలంక పర్యటన ముగిసిన తర్వాతే సపోర్టింగ్ స్టాఫ్ విషయంలో స్పష్టత వస్తుంది. ప్రస్తుతం అభిషేక్ నాయర్, సాయిరాజ్ బహుతులే, దిలీప్ జట్టుతో పాటు శ్రీలంక వస్తున్నారు.డష్కాటే కొలంబోలో మాతో చేరతాడు. అభిషేక్, డష్కాటే అసిస్టెంట్ కోచ్‌లే. వీళ్లిద్దరు నా సహాయకులుగా ఉండటం మంచి విషయం. అయితే, వాళ్లు ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించనున్నారో శ్రీలంక టూర్ ముగిసిన తర్వాతే తేలుతుంది’’ అని గంభీర్ పేర్కొన్నాడు.కాగా ఐపీఎల్-2024లో కోల్‌కతా మెంటార్‌గా గౌతం గంభీర్ వ్యవహరించగా.. అభిషేక్ నాయర్, డష్కాటే అసిస్టెంట్ కోచ్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పదేళ్ల తర్వాత ఆ జట్టు మరోసారి చాంపియన్‌గా నిలిచింది.ఈ విజయంలో కీలక పాత్ర గంభీర్దేనంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్‌ను నియమించింది బీసీసీఐ. శ్రీలంకతో జూలై 27న మొదలుకానున్న టీ20 సిరీస్‌తో కోచ్‌గా గంభీర్ తన ప్రస్థానం మొదలుపెట్టనున్నాడు. చదవండి: అందుకే కెప్టెన్సీ ఇవ్వలేదు: అగార్కర్ ఘాటు వ్యాఖ్యలు#WATCH | Mumbai | Indian Men's Cricket Team arrives at the Airport, they'll leave for Sri Lanka, shortly.Indian Cricket Team will play the ODI and T20I series, 3 matches each, against Sri Lanka, starting on July 27 and ending on August 7. pic.twitter.com/ZmBmBqLasH— ANI (@ANI) July 22, 2024