
సీనియర్ ఆటగాళ్లతో సఖ్యత లేకపోవడమే టీమిండియా కోచ్ అభిషేక్ నాయర్ (Abhishek Nayar)పై వేటుకు కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. డ్రెసింగ్‌రూమ్‌లో నాయర్ వ్యవహారశైలి పట్ల జట్టులోని కీలక సభ్యులు అసంతృప్తిగా ఉన్నారని.. వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్న తర్వాతే బీసీసీఐ (BCCI)అతడిని తప్పించిందని తెలుస్తోంది.
కాగా భారత క్రికెట్ జట్టు సహాయక సిబ్బందికి సంబంధించి బీసీసీఐ అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. టీమ్ అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న అభిషేక్ నాయర్‌పై వేటు వేసింది. ఎనిమిది నెలల క్రితమే బాధ్యతలు తీసుకున్న నాయర్‌ను బాధ్యతల నుంచి తప్పించేందుకు బోర్డు సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది.
మూడు నెలల తర్వాత
స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్‌లో 0–3తో ఓటమి, ఆపై ఆస్ట్రేలియా గడ్డపై 1–3తో సిరీస్ కోల్పోయిన తర్వాత జనవరిలో బీసీసీఐ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించింది.
ఇందులో జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్క (Ajit Agarkar)ర్‌తో పాటు బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పాల్గొన్నారు. ఈ సమావేశం తర్వాతే కోచింగ్ బృందంలో ఎవరి పైనైనా చర్యలు ఉండవచ్చని అర్థమైంది.
ఇప్పుడు దాదాపు మూడు నెలల తర్వాత అభిషేక్ నాయర్‌ను బోర్డు తప్పించింది. హెడ్ కోచ్‌గా గంభీర్ కాంట్రాక్ట్‌ను 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఖాయం చేసిన బీసీసీఐ... నాయర్‌ను నియమించినప్పుడు అతని పదవీ కాలం విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టతనివ్వలేదు.
కొటక్ ఎంపికతోనే...
2024 ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు కోసం గంభీర్, అభిషేక్ నాయర్ కలిసి పని చేశారు. జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. గంభీర్ హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాక ఎలాంటి దరఖాస్తులు, ఇంటర్వ్యూలు లేకుండా తనకు నచ్చిన వారిని ఎంచుకునేందుకు బోర్డు అవకాశం ఇచ్చింది.
రోహిత్ శర్మకు మంచి స్నేహితుడు
ఈ క్రమంలో నాయర్‌ను అతను అసిస్టెంట్ కోచ్‌గా తీసుకున్నాడు. రోహిత్ శర్మకు మంచి స్నేహితుడైన నాయర్... అటు కెప్టెన్, ఇటు కోచ్‌గా మధ్య మంచి సంధానకర్తగా కూడా పని చేయగలడని భావించడం కూడా అతని ఎంపికకు మరో కారణం.
భారత్ తరఫున 3 వన్డేలు ఆడిన ముంబై ఆల్‌రౌండర్ నాయర్‌కు దేశవాళీ క్రికెట్‌లో మంచి రికార్డుంది. అధికారికంగా ఏ జట్టుకు కోచ్‌గా పని చేయకపోయినా కూడా వ్యక్తిగతంగా ఎంతో మంది బ్యాటర్ల ఆటను మెరుగుపర్చడంలో అతని పాత్ర చాలా ఉంది. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వెంకటేశ్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రఘువంశీ ఇదే మాట చెప్పారు.
అపుడే నాయర్ భవిష్యత్తుపై సందేహాలు
నిజానికి చాంపియన్స్ ట్రోఫీకి అప్పటికే ఉన్న సహాయక సిబ్బందితో పాటు అదనంగా మరో అసిస్టెంట్ కోచ్ సితాన్షు కొటక్‌ను పంపడంతోనే నాయర్ భవిష్యత్తుపై సందేహాలు వచ్చాయి. ఇప్పుడు అదే నిజమైంది.
మరోవైపు ఫీల్డింగ్ కోచ్, హైదరాబాద్‌కు చెందిన టి.దిలీప్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్‌లను కూడా తప్పిస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. పని తీరు గురించి కాకుండా వీరి పదవీకాలం ముగియడమే కారణమని తెలుస్తోంది. బోర్డు కొత్త నిబంధనల (ఎస్‌ఓపీ) ప్రకారం సహాయక సిబ్బంది పదవీకాలం గరిష్టంగా మూడేళ్లే ఉండాలి.
గంభీర్ ఏమాత్రం వ్యతిరేకించలేదు
ఇదిలా ఉంటే.. పట్టుబట్టి మరీ అభిషేక్ నాయర్‌ను తన సహాయక సిబ్బందిలో చేర్చుకున్న గంభీర్.. అతడిని తప్పించే సమయంలో ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘నాయర్‌పై వేటు వేయడాన్ని గంభీర్ ఏమాత్రం వ్యతిరేకించలేదు.
డష్కాటే, మోర్నీ మోర్కెల్‌ను తన సిబ్బందిలో చేర్చుకునేందుకు గంభీర్ బోర్డుతో ఎన్నో సంప్రదింపులు జరిపాడు. అనేక చర్చల తర్వాతే వారిని సిబ్బందిలో చేర్చుకునే అవకాశం వచ్చింది. వారిని వదులుకునేందుకు మాత్రం అతడు సిద్ధంగా లేడు. అయితే, అభిషేక్ నాయర్ విషయం మాత్రం వేరు’’ అని పేర్కొన్నాయి.
చదవండి: నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. ప్రేమగా చెంప నిమిరిన మాజీ ఓనర్!