
ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమిండియా ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటి ఫీల్డింగ్ వైఫల్యం. కీలక సమయాల్లో కీలక క్యాచ్‌లు నేలపాలు చేసి.. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు దాదాపు ఆరుసార్లు మనోళ్లు ‘లైఫ్’ ఇచ్చారు. అందుకు బదులుగా ఓటమి రూపంలో భారీ మూల్యమే చెల్లించారు.
ఇక ఫీల్డర్ల తప్పిదాలు గమనిస్తే ప్రధాన దోషిగా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) పేరు చెప్పవచ్చు. ఆరింటిలో నాలుగు క్యాచ్‌లు అతడే జారవిడిచాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ వీరుడు, గెలుపునకు పునాది వేసిన బెన్ డకెట్ ఇచ్చిన క్యాచ్‌ను జైసూ వదిలేయడం తీవ్ర ప్రభావం చూపింది.
జైస్వాల్ ఫీల్డింగ్ తీరుపై గంభీర్ ఆగ్రహం
ఈ నేపథ్యంలో జైస్వాల్ ఫీల్డింగ్ తీరుపై హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అతడితో క్యాచింగ్ ప్రాక్టీస్ చేయించిన గౌతీ.. ఈ సందర్భంగా గట్టిగానే క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఫీల్డింగ్ విషయంలో జైసూని డిమోట్ చేయాలని నిర్ణయించినట్లు రెవ్‌స్పోర్ట్స్ పేర్కొంది.
టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డష్కాటే సోమవారం నాటి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని దాదాపు ధ్రువీకరించింది. ‘‘క్యాచింగ్ విభాగం మరింత దృఢంగా మారాలి. ఇంగ్లండ్‌లో కనీసం నాలుగు ప్రధాన క్యాచర్లు ఒక్కోసారి కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.
విరామం అనివార్యం
యశస్వి కూడా మంచి క్యాచర్. ఇక ఇద్దరు స్పిన్నర్లను ఆడించినప్పుడు షార్ట్ లెగ్ ఫీల్డింగ్ స్థానం మరింత కీలకమవుతుందని చెప్తారు. అందుకే అక్కడ మేము ఒకరి కంటే ఎక్కువ మందిని సెట్ చేయాలని భావిస్తున్నాం.
ఏదేమైనా యశస్వికి గల్లీ క్యాచ్ పాయింట్ నుంచి కాస్త విరామం ఇవ్వడం అవసరమే. ప్రస్తుతం అతడి ఫీల్డింగ్ తీరు బాగాలేదు. అయినా సరే అతడు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండాలంటే ఈ బ్రేక్ ఇవ్వాలి’’ అంటూ స్లిప్ క్యాచింగ్ రోల్ నుంచి జైసూను తప్పిస్తామని డష్కాటే చెప్పకనే చెప్పాడు. ఇదిలా ఉంటే.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ (101)తో అదరగొట్టాడు.
కాగా ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లిన టీమిండియా.. లీడ్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు (జూలై 2-6) బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో జరుగనుంది.
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. భారత తుది జట్టులోకి తమిళనాడు కుర్రాడు?