ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. భార‌త తుది జ‌ట్టులోకి త‌మిళ‌నాడు కుర్రాడు? | Washington Sundar Likely To Pip Kuldeep As Second Spinner For Edgbaston Test Says Report | Sakshi
Sakshi News home page

IND vs ENG: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. భార‌త తుది జ‌ట్టులోకి త‌మిళ‌నాడు కుర్రాడు?

Jul 1 2025 1:20 PM | Updated on Jul 1 2025 1:54 PM

Washington Sundar Likely To Pip Kuldeep As Second Spinner For Edgbaston Test: Report

రోహిత్‌ శర్మతో వాషింగ్టన్‌ సుందర్‌(ఫైల్‌ ఫోటో)

ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా జూలై 2 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఆల్‌రౌండ‌ర్ నితీశ్ కుమార్ రెడ్డి ఆడ‌డం దాదాపు ఖాయ‌మైంది. బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్ శార్ధూల్ ఠాకూర్ స్ధానంలో నితీశ్ తుది జ‌ట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. లీడ్స్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టులో విఫలం కావడంతో  శార్ధూల్‌పై వేటు వేసేందుకు టీమ్ మెనెజ్‌మెంట్ సిద్ద‌మైన‌ట్లు స‌మాచారం.

తొలి టెస్టులో ఓట‌మిపాలైన టీమిండియా.. ఎడ్జ్‌బాస్ట‌న్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను స‌మం చేయాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలో సోమ‌వారం త‌మ నెట్‌ప్రాక్టీస్ సెష‌న్‌ను భార‌త జ‌ట్టు పొడిగించింది. దాదాపు నాలుగైదు గంట‌ల పాటు భార‌త ఆట‌గాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మించారు. నితీశ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్‌, బౌలింగ్‌ ప్రాక్టీస్ చేశాడు.

ఫీల్డింగ్ డ్రిల్స్‌లో కూడా ఈ ఆంధ్ర క్రికెట‌ర్ పాల్గోన్నాడు. ముఖ్యంగా నితీశ్ స్లిప్స్‌లో ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేసిన‌ట్లు తెలుస్తోంది. జైశ్వాల్ బ‌దులుగా నితీశ్ స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. తొలి టెస్టులో జైశ్వాల్ స్లిప్స్‌లో ఏకంగా మూడు క్యాచ్‌లు విడిచిపెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే శార్ధూల్ ఠాకూర్‌ మాత్రం ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నాడ‌ని  ఎక్స్‌ప్రెస్ స్పోర్ట్స్ త‌మ క‌థ‌నంలో పేర్కొంది.

వాషింగ్ట‌న్‌కు చోటు?
మ‌రోవైపు ఈ మ్యాచ్‌లో ఇద్ద‌రు స్పిన్న‌ర్ల‌తో భార‌త్ ఆడ‌నున్నట్లు తెలుస్తోంది. తొలుత కుల్దీప్ యాద‌వ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఇవ్వాల‌ని టీమిండియా మెనెజ్‌మెంట్ భావిస్తున్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. కానీ ఇప్పుడు కుల్దీప్  యాదవ్‌కు బ‌దులుగా ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్‌కు చోటివ్వాల‌ని గంభీర్ అండ్ కో యోచిస్తున్న‌ట్లు ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

సోమ‌వారం జ‌రిగిన నెట్‌సెష‌న్‌లో ఈ త‌మిళ‌నాడు ఆల్‌రౌండ‌ర్‌ తీవ్రంగా శ్ర‌మించ‌డం ఈ వార్త‌లకు మ‌రింత ఊత‌మిస్తున్నాయి. అయితే ప్రీ మ్యాచ్ ప్రెస్‌ కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడిన భార‌త జ‌ట్టు స‌హాయ‌క కోచ్ ర్యాన్ టెన్‌ డస్కటే మాత్రం ఈ విష‌యంపై ఎటువంటి క్లారిటీ ఇవ్వ‌లేదు. అదేవిధంగా బుమ్రా అందుబాటుపై కూడా మ్యాచ్ రోజున నిర్ణ‌యం తీసుకుంటామ‌ని డ‌స్క‌టే వెల్ల‌డించాడు. కాగా ఈ మ్యాచ్‌ కోసం ఇంగ్లండ్‌ తమ తుది జట్టును ఇప్పటికే ప్రకటించింది.

టీమిండియాతో రెండో టెస్ట్‌ కోసం ఇంగ్లండ్‌ తుది జట్టు..
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్
చదవండి: నా మనసంతా అక్కడే.. ఎక్కడున్నా పట్టేస్తారు: పెదవి విప్పిన కావ్యా మారన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement