టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా.. ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో టైటిల్‌ను ముద్దాడింది. ఇది భారత్‌కు మూడో టీ20 వరల్డ్‌కప్ విజయం కావడం గమనార్హం. మూడు టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీలను సొంతం చేసుకున్న ఏకైక జట్టుగా మెన్ బ్లూ చరిత్ర సృష్టించింది.
అయితే తాజాగా ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో కూడిన బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రకటించాడు. ఆకాశ్ చోప్రా తన జట్టులో ఓపెనర్లుగా సంజూ శాంసన్, ఫిన్ అలెన్‌లను ఎంపిక చేశాడు. ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచిన సంజూ శాంసన్‌పై చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు.
"శాంసన్ నాలుగు మ్యాచ్‌లు ఆడకపోయినా భారత్ తరపున లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్, ఫైనల్‌లో వరుసగా హాఫ్ సెంచరీలు బాదడం నిజంగా అద్భుతం. అందుకే అతడికి ఓపెనర్‌గా అవకాశమిచ్చా" అని చోప్రా పేర్కొన్నాడు.
అదేవిధంగా సాహిబ్జాదా ఫర్హాన్, టిమ్ సీఫెర్ట్, పాతుమ్ నిస్సంక బ్రియన్ బెన్నెట్, ఐడెన్ మార్క్‌రమ్‌లు ఓపెనర్లగా రాణించినప్పటికి ఫిన్ అలెన్ వైపే తను మొగ్గు చూపుతున్నట్లు చోప్రా తెలిపాడు. సౌతాఫ్రికాతో జరిగిన సెమీస్‌లో అలెన్ కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాది అందరిని ఆశ్చర్యపరిచాడు.
ఇక వరుసగా రెండు మూడు స్ధానంలో ఇషాన్ కిషన్, జాకబ్ బెథెల్‌కు చోప్ర అవకాశమిచ్చాడు. ఆల్‌రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, విల్ జాక్స్, అక్షర్ పటేల్‌కు చోటు దక్కింది. ఫాస్ట్ బౌలర్లగా అమెరికా పేసర్ షాడ్లీ షాల్క్విక్, జస్ప్రీత్ బుమ్రా, లుంగి ఎంగిడీలకు ఛాన్స్ లభించింది. భారత్ నుంచి ఆరుగురు ఈ జట్టులో చోటు దక్కింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను మాత్రం చోప్రా పరిగణలోకి తీసుకోలేదు.
ఆకాశ్ చోప్రా ఎంచుకున్న టీ20 ప్రపంచకప్ బెస్ట్ ఎలెవన్ ఇదే
సంజు శాంసన్, ఫిన్ అలెన్, ఇషాన్ కిషన్, జాకబ్ బెథెల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, విల్ జాక్స్, అక్షర్ పటేల్, షాడ్లీ షాల్క్విక్, జస్ప్రీత్ బుమ్రా, లుంగి ఎంగిడీ
చదవండి: ఇండియా క్రికెట్‌ను నాశనం చేసింది: షోయబ్ అక్తర్


