టీ20 ప్రపంచకప్-2026 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి టీమిండియా ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ విజయంపై టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. వరుసగా రెండో టి20 ప్రపంచకప్ విజయంలో భాగమవడం ఎంతో ఆనందంగా ఉందని భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు.
ఈ మెగా టోర్నీలో రెండు అర్ధ సెంచరీలు సహా పేస్ బౌలింగ్‌తో మొత్తం 9 వికెట్లు పడగొట్టిన హార్దిక్ కొన్ని మ్యాచ్‌ల్లో కీలక సమయాల్లో మెరుపులు మెరిపించాడు. అతని నిలకడను గుర్తించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ప్రపంచకప్ జట్టులో ఆల్‌రౌండర్‌గా స్థానం కల్పించింది.
పాండ్యాతో పాటు శాంసన్, ఇషాన్, బుమ్రా ఐసీసీ టీమ్‌లో ఉన్నారు. 32 ఏళ్ల పాండ్యా 18 నెలల క్రితం బార్బడోస్ (2024)లో రోహిత్ సారథ్యంలో ప్రపంచకప్ గెలిచినప్పుడు భావోద్వేగానికి గురయ్యాడు. ఆనందబాష్పాలతో విజయోత్సంలో పాల్గొన్న ఈ ఆల్‌రౌండర్ అప్పుడు ఆత్మ ప్రమాణం చేసుకున్నానని చెప్పుకొచ్చాడు.
‘నాడు దక్షిణాఫ్రికాపై (2024లో) కప్ గెలవగానే... ఇకమీదట భారత్ తరఫున ఏ టోర్నీలో బరిలోకి దిగినా... జట్టు గెలవడానికే ఆడతాను. ట్రోఫీని సగర్వంగా ఎత్తుతాను అని నా మనసుకు నేను ప్రమాణం చేశాను. ఇప్పుడు కివీస్‌పై విజయంతో నా వాగ్దానాన్ని నెరవేర్చుకున్నానన్న సంతృప్తి కలిగింది. అయితే ఇది ఇక్కడితోనే ఆగిపోదు.
నాలో ఇంకా 10 ఏళ్ల క్రికెట్ ఉంది. ఆ పదేళ్లలో 10 ఐసీసీ టైటిల్స్ గెలవాలన్నదే నా లక్ష్యం. సొంతగడ్డపై వరల్డ్ కప్ గెలవడం చాలా ఎమోషనల్. నిన్నటి నుంచే మేమే ఛాంపియన్లమని నాకు తెలుసు. గెలుపు తప్ప మరో ఆలోచనే నాకు లేదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే" అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు.
ఆ ప్రపంచకప్ (2024) సమయంలో తాను ఎన్నో వ్యక్తిగత సమస్యలతో సతమతమయ్యానని చెప్పాడు. అందుకే ఇతరత్రా విషయాల్ని పక్కనబెట్టి ఆటపైనే దృష్టి పెట్టేందుకు స్వీయ వాగ్దానం చేసుకున్నట్లు చెప్పాడు.
చదవండి: T20 WC 2026: పాపం పాకిస్తాన్..! మరోసారి ‘టీ కప్’తో ట్రోల్ చేసిన వరుణ్


