భారత్‌కు నిరాశ | FIH Hockey Womens World Cup 2026 Qualifiers: India vs Scotland ends in 2-2 draw | Sakshi
Sakshi News home page

భారత్‌కు నిరాశ

Mar 10 2026 4:05 AM | Updated on Mar 10 2026 4:05 AM

FIH Hockey Womens World Cup 2026 Qualifiers: India vs Scotland ends in 2-2 draw

స్కాట్లాండ్‌తో మ్యాచ్‌ 2–2తో ‘డ్రా’

మహిళల హాకీ ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: సొంతగడ్డపై భారత మహిళల హాకీ జట్టు నిరాశాజనక ప్రదర్శన కనబరిచింది. ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో భాగంగా గచ్చిబౌలి స్టేడియంలో సోమవారం స్కాట్లాండ్‌తో జరిగిన పూల్‌ ‘బి’ రెండో లీగ్‌ మ్యాచ్‌ను భారత్‌ 2–2తో ‘డ్రా’ చేసుకుంది. తమకంటే బలహీన జట్టయిన స్కాట్లాండ్‌పై భారత్‌ పలు అవకాశాలు చేజార్చుకొని విజయాన్ని కోల్పోయింది. భారత్‌ తరఫున నవనీత్‌ కౌర్‌ (18వ నిమిషంలో), సునెలితా టొప్పో (29వ నిమిషంలో)... స్కాట్లాండ్‌ తరఫున మెక్‌ఇవాన్‌ హీతర్‌ (6వ నిమిషంలో), ఫియోనా బర్నెట్‌ (33వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు.

భారత్‌కు మొత్తం 9 పెనాల్టీ అవకాశాలు రాగా, రెండింటిలో మాత్రమే జట్టు సఫలమైంది. అంతకుముందు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో ఉరుగ్వే 3–2తో వేల్స్‌పై, ఇంగ్లండ్‌ 3–0తో కొరియాపై, ఇటలీ 3–0తో ఆస్ట్రియాపై గెలిచాయి. పూల్‌ ‘బి’లో ప్రస్తుతం భారత్, స్కాట్లాండ్‌ 4 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. ఉరుగ్వే 3 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. 

వేల్స్‌ ఖాతా తెరువలేదు. నేడు విశ్రాంతి దినం. బుధవారం జరిగే పూల్‌ ‘ఎ’ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌తో ఆస్ట్రియా (మధ్యాహ్నం గం. 12:45 నుంచి), ఇటలీతో కొరియా (మధ్యాహ్నం 3 గంటల నుంచి), ఉరుగ్వేతో స్కాట్లాండ్‌ (సాయంత్రం గం. 5:15 నుంచి), వేల్స్‌తో భారత్‌ (రాత్రి గం. 7:30 నుంచి) తలపడతాయి. లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిశాక రెండు పూల్స్‌ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. వేల్స్‌తో మ్యాచ్‌ను భారత్‌ ‘డ్రా’ చేసుకుంటే సెమీఫైనల్‌కు చేరుకుంటుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement