
కావ్యా మారన్ (PC: BCCI/IPL)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా మారి.. లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరు (287) సాధించిన జట్టుగా కొనసాగుతోంది. 2016లో టైటిల్ గెలిచిన సన్‌రైజర్స్.. గత రెండేళ్లుగా మరోసారి ఇలా పాతరోజులను గుర్తుచేస్తూ ఆరెంజ్ ఆర్మీని ఖుషీ చేస్తోంది. దేశీ స్టార్ అభిషేక్ శర్మతో పాటు ఆస్ట్రేలియా స్టార్లు ప్యాట్ కమిన్స్, ట్రవిస్ హెడ్, సౌతాఫ్రికా స్టార్ హెన్రిచ్ క్లాసెన్ రాకతో జట్టు బలపడింది.
కమిన్స్ కెప్టెన్సీలో గతేడాది ఏకంగా ఫైనల్ చేరిన సన్‌రైజర్స్ ఈసారి మాత్రం కాస్త నిరాశపరిచింది. ఆరంభంలో వరుస ఓటములు చవిచూసినా ఆఖర్లో వరుసగా మ్యాచ్‌లు గెలవడం అభిమానులకు కాస్త ఊరట కలిగించే అంశం. ఇక సన్‌రైజర్స్ అనగానే ఆటగాళ్లతో పాటు ఆ జట్టు సహ యజమాని కావ్యా మారన్ (Kavya Maran) ఠక్కున గుర్తుకువస్తారు.
సోషల్ మీడియా క్వీన్
సన్ నెట్‌వర్క్ అధినేత కళానిధి మారన్ కుమార్తె అయిన కావ్యా.. సన్‌రైజర్స్ బాధ్యతలు చూసుకుంటున్నారు. మ్యాచ్ జరిగిన ప్రతిసారి.. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్ ఆడుతుందంటే అక్కడ కావ్యా తప్పనిసరిగా కనిపిస్తారు. మ్యాచ్ సాగుతున్న వేళ తన భావోద్వేగాలను ఏమాత్రం దాచుకోరు.
ప్రతికూల ఫలితం వచ్చినప్పుడు చిన్నబుచ్చుకునే కావ్యా.. అనుకూల ఫలితం వచ్చినప్పుడు మాత్రం చిన్న పిల్లలా ఎగిరి గంతులు వేస్తారు. ఈ నేపథ్యంలో తొలిసారి మీడియా కంటికి చిక్కినప్పటి నుంచి ఇప్పటిదాకా సోషల్ మీడియాలో కావ్యా మారన్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరోవైపు.. ఆమెను ట్రోల్ చేస్తూ మీమ్స్ క్రియేట్ చేసే వాళ్లూ ఎక్కువే.
నన్ను తప్పక క్యాప్చర్ చేస్తాడు
ఈ క్రమంలో సోషల్ మీడియాలో తన ఫొటోలు, తనపై వచ్చే మీమ్స్‌పై కావ్యా మారన్ తాజాగా స్పందించారు. ఇన్‌సైడ్‌స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నిజంగానే అవి నా మనసు నుంచి వచ్చిన భావోద్వేగాలు. మ్యాచ్ ఎక్కడ జరిగినా అక్కడికి వెళ్లడం నా పనిలో భాగం. అయితే, ఆట పట్ల ఉన్న అభిమానం కూడా అందుకు మరో కారణం.
హైదరాబాద్‌లో ఇంకా వేరేగా నేనేం చేయగలను. స్టేడియంలో కూర్చోవాల్సిందే కదా!.. అక్కడ మాత్రమే నేను కూర్చుకునేందుకు వీలుంటుంది. ఒకవేళ్ల అహ్మదాబాద్ లేదంటే.. చెన్నై వెళ్తే అక్కడా ఏదో చోట కూర్చోవాల్సిందే.
నేను ఎక్కడున్నా సరే కెమెరామెన్ నన్ను తప్పక క్యాప్చర్ చేస్తాడు. కొన్నిసార్లు అవే మీమ్స్‌గా రూపాంతరం చెందుతాయి’’ అని కావ్యా మారన్ పేర్కొన్నారు.
నా మనసంతా అదే..
ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టంటే తనకు ఎంతో ఇష్టమన్న కావ్యా మారన్.. ‘‘ సన్‌రైజర్స్ ఆడుతుందంటే నా మనసంతా అక్కడే ఉంటుంది. సన్‌రైజర్స్‌కు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. దాని కోసం నా శాయశక్తులా కష్టపడి చేయగలిగిందంతా చేస్తాను.
కాబట్టి సహజంగానే జట్టు విజయాలు, అపజయాలను మనసుకు తీసుకుంటాను. అందుకే గెలిచినప్పుడు ఎంతగా సంతోషిస్తానో.. ఓడినప్పుడు అంతే బాధపడతాను’’ అని చెప్పుకొచ్చారు.
చదవండి: రితికా కంటే ముందు ఆమెతో ప్రేమలో రోహిత్?.. నన్‌గా మారిన నటి?!