ఐసీసీ టీ20 వరల్డ్‌కప్-2026 టోర్నీని విజయంతో ఆరంభించింది టీమిండియా. ముంబై వేదికగా శనివారం అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో గెలిచి బోణీ కొట్టింది. తదుపరి.. గురువారం నాటి మ్యాచ్‌లో నమీబియాతో భారత్ మ్యాచ్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానం ఇందుకు వేదిక.
సతీసమేతంగా
ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) భారత జట్టును తమ ఇంటికి ఆహ్వానించాడు. తొలుత కారులో గంభీర్ తమ ఇంటికి చేరుకున్నాడు. అనంతరం భార్య నటాషా, పిల్లలతో కలిసి టీమిండియాను తమ నివాసానికి సాదరంగా ఆహ్వానించాడు.
ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆటగాళ్లతో పాటు కోచ్‌లు, సహాయక సిబ్బంది, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తదితరులు ఓల్డ్ రాజేంద్రనగర్‌లో ఉన్న గంభీర్ నాలుగు అంతస్థుల విలాస భవనానికి విచ్చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#WATCH | Members of the Indian T20 cricket team arrive at the residence of Indian Cricket Team Head Coach Gautam Gambhir in Delhi.
Gautam Gambhir is hosting a special dinner for the team https://t.co/VQ2symRZ2M pic.twitter.com/tXgiuAwN6D— ANI (@ANI) February 8, 2026
అందుకే డిన్నర్ పార్టీలు
కాగా టీమిండియాకు ఆటవిడుపు కలిగించేందుకు, జట్టు సభ్యుల మధ్య స్నేహ భావం మరింత పెంపొందేలా గంభీర్ డిన్నర్ పార్టీలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ సందర్భంగానూ ఇలాగే ఆటగాళ్లకు పార్టీ ఇచ్చాడు.
ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు ఆటగాళ్ల మధ్య ఏవైనా చిన్న చిన్న విభేదాలు ఉన్నా వాటికి పరిష్కారం చూపేలా హెడ్‌కోచ్ ఇలాంటి వేదికను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
టీ20 ప్రపంచకప్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్.. గ్రూప్-ఎలో పాకిస్తాన్, నమీబియా, అమెరికా, నెదర్లాండ్స్ దేశాలతో కలిసి ఉంది. తొలుత అమెరికాతో మ్యాచ్ ఆడిన టీమిండియా.. ఆ తర్వాత గురువారం నమీబియా (ఫిబ్రవరి 12), ఆదివారం పాకిస్తాన్ (ఫిబ్రవరి 15).. లీగ్ దశలో చివరగా వచ్చే బుధవారం (ఫిబ్రవరి 18) నెదర్లాండ్స్‌తో తలపడేలా షెడ్యూల్ ఖరారైంది.
టీ20 ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, మొహమ్మద్ సిరాజ్.
చదవండి: T20 WC 2026: టీమిండియాతో ఆడతాం కానీ..: బుద్ధి చూపించిన పాకిస్తాన్!
#WATCH | Indian Cricket Team Head Coach Gautam Gambhir arrives at his residence in Delhi pic.twitter.com/Y3yg3yvgVy
— ANI (@ANI) February 8, 2026


