టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో భారత్‌తో ఆడేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇందుకోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ముందు పాక్ క్రికెట్ బోర్డు (PCB) మూడు షరతులు ఉంచినట్లు సమాచారం. కాగా బంగ్లాదేశ్‌కు మద్దతగా తాము టీమిండియాతో మ్యాచ్ బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్ కోసమంటూ..
భారత్‌లో తమకు భద్రత లేదంటూ బంగ్లాదేశ్ తమ వేదికను శ్రీలంకకు మార్చాలని కోరగా.. ఇందులో నిజం లేదంటూ ఐసీసీ స్పష్టం చేసింది. అయినప్పటికీ బంగ్లా పంతం వీడకపోవడంతో ఐసీసీ ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలో తమకు తటస్థ వేదికగా శ్రీలంక ఉన్నప్పటికీ బంగ్లాదేశ్ కోసమంటూ.. తామూ టోర్నీ ఆడమని పాక్ కొత్త నాటకానికి తెరతీసింది.
మరో డ్రామా
అయితే, ఈ విషయంలో ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకుంటుందనే భయంతో మాట మార్చి తాము భారత్‌తో మాత్రమే మ్యాచ్ ఆడమని మరో డ్రామాకు తెరలేపింది. క్రికెట్ ప్రపంచంలో అత్యధిక క్రేజ్ ఉన్న భారత్- పాక్ మ్యాచ్ జరుగకపోతే.. ఐసీసీతో పాటు సభ్య దేశాలు భారీ ఎత్తున నష్టపోవాల్సి ఉంటుంది. పాక్ క్రికెట్ బోర్డు మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.
ఘాటుగా స్పందించిన శ్రీలంక
ఇక ఈ విషయంపై శ్రీలంక సైతం ఘాటుగానే స్పందించింది. పాక్‌లో తమపై ఉగ్రదాడి జరిగినా మళ్లీ ఆ దేశంలో పర్యటించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. భారత్‌తో మ్యాచ్‌పై పునరాలోచన చేయాలని పీసీబీకి విజ్ఞప్తి చేసింది. ఇతర సభ్య దేశాల బోర్డులు సైతం పాక్ వైఖరిపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
మూడు ప్రధాన షరతులు
ఈ నేపథ్యంలో మొదటికే మోసం వస్తుందని భావించిన పాక్.. పంతం వీడేందుకు సిద్ధపడినా.. మూడు ప్రధాన షరతులతో ఐసీసీని లాక్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తాజా సమాచారం. జాతీయ మీడియా కథనాల ప్రకారం..
ఎక్కువ డబ్బు కావాలి!
ఐసీసీ నుంచి తమకు అదనంగా నిధులు సమకూర్చాలని కోరింది. ప్రస్తుతం ఐసీసీ రెవెన్యూ నుంచి నుంచి పీసీబీ 5.75 శాతం ఆదాయం పొందుతోంది. మరోవైపు.. ఇందులో బీసీసీఐ వాటా 39 శాతం.
ఇక భారత్‌తో తమ క్రికెట్ సంబంధాలను తిరిగి పునరుద్ధరించాలని పీసీబీ ఐసీసీకి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. కాగా 2012 నుంచి భారత్- పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఆగిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆసియా కప్, వరల్డ్‌కప్ వంటి టోర్నీలలో మాత్రమే దాయాదులు ముఖాముఖి తలపడుతున్నాయి.
కరచాలనం చేయాలి
అదే విధంగా.. టీ20 ప్రపంచకప్-2026 మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు తమ జట్టుతో కరచాలనం చేయాలని పీసీబీ ఐసీసీకి కండిషన్ పెట్టినట్లు సమాచారం. కాగా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఆసియా కప్‌లో పాక్ ఆటగాళ్లతో టీమిండియా షేక్‌హ్యాండ్‌కు నిరాకరించిన విషయం తెలిసిందే.
పాక్ బుద్ధి చూపించిందంటూ ట్రోల్స్!
ఈ మూడు షరతులకు అంగీకరిస్తేనే తాము టీమిండియాతో మ్యాచ్ ఆడతామని పీసీబీ తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయం నెట్టింట వైరల్‌గా మారగా.. ‘‘పాక్ బుద్ధి చూపించింది. డబ్బు కోసం బంగ్లాదేశ్‌ను అడ్డుపెట్టుకుని నాటకాలు ఆడుతోంది. నిజంగా బంగ్లాపై అంత ప్రేమ ఉంటే టోర్నీ నుంచి వైదొలగాల్సింది.
అలా కాకుండా తటస్థ వేదిక ఏర్పాటు చేసినా బ్లాక్‌మెయిలింగ్‌కు దిగి.. క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. ఇంతకంటే చెత్త విషయం మరొకటి ఉండదు’’ అని టీమిండియా అభిమానులు పీసీబీ తీరుపై మండిపడుతున్నారు. కాగా శనివారం (ఫిబ్రవరి 7) నుంచి భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్ మొదలైన సంగతి తెలిసిందే.
వద్దు.. అలా చేయొద్దు
అయితే, పాక్ మీడియా డాన్ కథనం ప్రకారం.. బంగ్లాదేశ్‌కు పరిహారం చెల్లించాలని పాక్ కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు నిరాకరించిన ఐసీసీ.. మొత్తం ఆదాయంలో మాత్రం బంగ్లాదేశ్‌కు ఇవ్వాల్సిన వాటా ఇస్తామని తెలిపినట్లు సమాచారం. అంతేకాదు.. పాక్ బోర్డు భారత్‌తో మ్యాచ్ విషయంలో పునరాలోచన చేయాలని.. ఇలా బహిష్కరిస్తామని చెప్పడం క్రికెట్‌కు ఎంతమాత్రం సరికాదని గట్టిగానే హెచ్చరించినట్లు తెలుస్తోంది.
చదవండి: చరిత్ర సృష్టించిన నేపాల్ బౌలర్


