క్రికెట్ అభిమానులకు శుభవార్త. టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్తాన్ గ్రూప్ స్టేజీ మ్యాచ్‌పై అనిశ్చితి తొలిగిపోయేలా ఉంది. తొలుత పాక్ ప్రభుత్వం ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఐసీసీ జోక్యంతో పాక్ క్రికెట్ బోర్డు ఈ మ్యాచ్ ఆడేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఐసీసీ ప్రతినిధులు ఇమ్రాన్ ఖవాజా, ముబషిర్ ఉస్మానీ పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీతో లాహోర్‌లో చర్చలు జరిపారు. ఈ చర్చల తర్వాత పీసీబీ కొన్ని షరతులపై భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరించినట్లు సమాచారం.
కాగా, గత కొద్ది రోజులుగా భారత్-పాక్ ప్రపంచకప్ గ్రూప్ స్టేజీ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ బహిష్కరణకు నిరసనగా పాక్ ప్రభుత్వం భారత్‌తో గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించుకుంది. ఈ మ్యాచ్ రద్దైతే ఐసీసీ సహా ప్రపంచకప్ బ్రాడ్‌కాస్టర్లు తీవ్రంగా నష్టపోయేవారు. ఇందుకు ప్రతిగా ఐసీసీ పీసీబీపై కఠిన చర్యలు తీసుకునేందుకు అవకాశాలు ఉండేవి. చివరికి ఐసీసీ ప్రతినిధుల మధ్యవర్తిత్వంతో ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లు తెలుస్తుంది. భారత్-పాక్ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలొంబో వేదికగా జరగాల్సి ఉంది.
ఇదిలా ఉంటే, ప్రపంచకప్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో భారత్, పాక్, వెస్టిండీస్, న్యూజిలాండ్ తలో మ్యాచ్ గెలిచాయి. భారత్ యూఎస్‌ఏపై, పాక్ నెదర్లాండ్స్‌పై, వెస్టిండీస్ స్కాట్లాండ్‌పై, న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్‌పై విజయాలు సాధించాయి.


