మన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్ వాసే..
జార్జి ప్రతిభతో హర్షాతిరేకాలు.. నేడు నగరానికి రాక
మల్లాపూర్/కాప్రా: హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌కు ప్రత్యేకమైన మణికట్టు మాయాజాలంతో పరుగులు సాధించి.. భారత జట్టు అండర్ 19 ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు నగరానికి చెందిన కుర్రాడు అరోన్ జార్జి. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా డ్రైవ్‌లు కొడుతూ.. అంతకుమించిన స్ట్రోక్ ప్లేతో అలరిస్తూ.. టైమింగ్‌లో మైమరిపిస్తూ.. ఫ్లిక్‌లతో కట్టిపడేస్తూ.. హైదరాబాద్ క్రికెట్ స్టయిల్‌ను ప్రపంచానికి చాటాడు. బిహార్‌కు చెందిన మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీతో కలిసి టీమ్‌ఇండియా జగజ్జేతగా నిలవడంలో తనవంతు బాధ్యత నెరవేర్చాడు. బంతిని అడ్డంగా బాదేసే ఈ టి20ల కాలంలో.. క్లాస్ బ్యాటింగ్‌తో అరోన్ అదరహో అనిపించాడు.
మన మల్లాపూర్ వాడే.. అరుదైన రికార్డు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్‌లో నివసిస్తోంది అరోన్ జార్జి కుటుంబం. తల్లిదండ్రులు ఇసో వర్గీస్, ప్రీతీ వర్గీస్. కేరళకు చెందినవారైనా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అరోన్ అండర్–19 హైదరాబాద్ జట్టు కెప్టెన్ కూడా. ప్రపంచ కప్‌లో అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్‌లో క్లిష్ట పరిస్థితుల్లో అరోన్ సెంచరీ (115) బాది జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా (118)పైనా సెంచరీ కొట్టాడు. స్కాట్లాండ్‌పై 61 పరుగుల చక్కని ఇన్నింగ్స్ ఆడాడు.
నగరం నుంచి అంబటి రాయుడు, తిలక్ వర్మ వంటి మేటి బ్యాటర్లు అండర్–19 క్రికెట్‌లో సెంచరీలు కొట్టినా.. ప్రపంచకప్‌లో మాత్రం ఆ ఘనతను అందుకోలేదు. ఇప్పుడు అరోన్ ఏకంగా రెండు సెంచరీలు కొట్టి.. టి20 ప్రపంచకప్‌లో సెంచరీలు బాదిన తొలి హైదరాబాదీగా రికార్డులకెక్కాడు. అరోన్ ప్రస్తుతం సైనిక్‌పురి భవన్స్ కాలేజీలో బీకాం (ఫైనాన్స్) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో 2014–17 వరకు ఉచిత శిక్షణ పొందాడు. తార్నాకలోని అకాడమీలో ఆ తర్వాత మూడేళ్లు శిక్షణ తీసుకున్నాడు. సంగీత్ చౌరస్తాలోని అకాడమీలో గత ఏడాది వరకు ప్రాక్టీస్ చేశాడు. టీమ్‌ఇండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ పర్యవేక్షణలో కోచింగ్ తీసుకున్నాడు.
‘సాక్షి’తో తల్లిదండ్రుల సంతోషం
తండ్రి ఈసో వర్గీస్ రిటైర్డ్ పోలీస్ అధికారి. తల్లి ప్రీతి.. తమ కుమారుడు సాధించిన ఘనతను ‘సాక్షి’తో పంచుకున్నారు. అఫ్ఘాన్‌పై తమ కుమారుడి సెంచరీని చూసి అంతులేని సంతోషం కలిగిందని తెలిపారు. భవిష్యత్‌లో జాతీయ జట్టుకు ఆడాలనేది అరోన్ లక్ష్యంగా వివరించారు. కాగా, ఆదివారం సాయంత్రం శంషాబాద్ రానున్న అరోన్‌కు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్వాగతం పలకనున్నారు.


