హుసాముద్దీన్‌కు కాంస్యం | Boxer Mohammed Hussamuddin won a bronze medal at the Boxam Elite International Boxing Tournament | Sakshi
Sakshi News home page

హుసాముద్దీన్‌కు కాంస్యం

Feb 8 2026 2:37 AM | Updated on Feb 8 2026 11:55 AM

Boxer Mohammed Hussamuddin won a bronze medal at the Boxam Elite International Boxing Tournament

లా నూసియా (స్పెయిన్‌): బాక్సమ్‌ ఎలైట్‌ ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ బాక్సర్‌ మొహమ్మద్‌ హుసాముద్దీన్‌కు కాంస్య పతకం దక్కింది. పురుషుల 60 కేజీల వెయిట్‌ కేటగిరీలో అతను సెమీఫైనల్లో ఓడిపోయాడు. టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్, ప్రపంచకప్‌ చాంపియన్‌ సచిన్‌ సివాచ్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. వీరితో కలుపుకొని మొత్తం 12 మంది బాక్సర్లు స్వర్ణం వేటలో పడ్డారు. 

ఇందులో 8 మంది మహిళా బాక్సర్లున్నారు. దీంతో భారత్‌కు కనీసం 12 రజతాలు ఖాయమైనట్లే! దీనికి అదనంగా మరో స్వర్ణం కూడా కచి్చతంగా భారత్‌ ఖాతాలో పడనుంది. ఎందుకంటే మహిళల 54 కేజీల కేటగిరీలో ఆసియా క్రీడల కాంస్య విజేత ప్రీతి పవార్, పూనమ్‌ ఇద్దరు భారత బాక్సర్లే తుదిపోరుకు అర్హత సాధించారు. సెమీస్‌లో పూనమ్‌ 4–1తో ఇవి జేన్‌ స్మిత్‌ (ఇంగ్లండ్‌)పై, ప్రీతి 5–0తో అయ హమ్ది (ఫ్రాన్స్‌)పై గెలుపొందారు. 

మహిళల 75 కేజీల కేటగిరీ సెమీస్‌లో లవ్లీనా 5–0తో వేల్స్‌కు చెందిన రోజీ ఎక్‌లెస్‌పై ఏకపక్షమైన విజయాన్ని సాధించింది. మంజు రాణి (48 కేజీలు), నీతూ (51 కేజీలు), ప్రియా (60 కేజీలు) అరుంధతి (70 కేజీలు), నైనా (80 కేజీలు) కూడా సెమీఫైనల్లో గెలిచి పసిడి పతక రేసులో నిలిచారు. పురుషుల 60 కేజీల సెమీఫైనల్లో సచిన్‌ సివాచ్‌ 5–0తో జాక్‌ డ్రైడెన్‌ (ఇంగ్లండ్‌)పై గెలుపొందారు. సచిన్‌తో పాటు దీపక్‌ (70 కేజీలు), ఆకాశ్‌ (75 కేజీలు), అంకుశ్‌ (80 కేజీలు)లు కూడా స్వర్ణ పతక బౌట్‌కు అర్హత సంపాదించారు.   

Advertisement
 
Advertisement
Advertisement