తెలంగాణ షూటర్ ఇషా సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో ఆమె అద్భుత ప్రతిభ కనబరిచారని ప్రశంసించారు. షూటింగ్‌లో పట్టుదలతో సాధన చేస్తున్న ఇషా సింగ్ ఎంతోమంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని.. భవిష్యత్తులో మరింతగా రాణించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
కాగా ఈజిప్టులోని కైరో వేదికగా ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో తెలంగాణ స్టార్ ఇషా సింగ్ పతకంతో మెరిసింది. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో ఈ హైదరాబాద్ అమ్మాయి కాంస్య పతకం సాధించింది.
ఇదిలా ఉంటే.. ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో శనివారం భారత షూటర్లు తడబడ్డారు. పురుషుల, మహిళల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్‌లో భారత షూటర్లలో ఒక్కరు కూడా ఫైనల్ చేరలేకపోయారు. పురుషుల విభాగంలో గుర్‌ప్రీత్ సింగ్ 571 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచి త్రుటిలో ఫైనల్ బెర్త్‌ను కోల్పోయాడు.
భారత్‌కే చెందిన ఉదయ్‌వీర్ సిద్ధూ 561 పాయింట్లతో 23వ స్థానంలో, రాజ్‌కన్వర్ సింగ్ సంధూ 559 పాయింట్లతో 24వ స్థానంలో నిలిచారు. మహిళల విభాగంలో పరీషా గుప్తా 556 పాయింట్లతో పదో స్థానంలో నిలువగా.. శిఖా చౌధరీ 555 పాయింట్లతో 12వ స్థానాన్ని, ఆగమ్ గ్రెవాల్ 547 పాయింట్లతో 10వ స్థానాన్ని దక్కించుకున్నారు.


