‘వందే భారత్ స్లీపర్’ స్పీడ్‌ టెస్ట్‌.. 180లోనూ తొణకని నీరు! | Vande Bharat Sleeper train clocks 180 kmph Ashwini Vaishnaw shares video | Sakshi
Sakshi News home page

‘వందే భారత్ స్లీపర్’ స్పీడ్‌ టెస్ట్‌.. 180లోనూ తొణకని నీరు!

Dec 31 2025 7:50 AM | Updated on Dec 31 2025 7:55 AM

Vande Bharat Sleeper train clocks 180 kmph Ashwini Vaishnaw shares video

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే చరిత్రలో మరో మైలురాయి ఆవిష్కృతమయ్యింది. రైల్వే రంగంలో సరికొత్త విప్లవం ఉద్భవించింది. ఎంతో కాలంగా దేశంలోని ప్రయాణికులంతా ఎదురుచూస్తున్న ‘వందే భారత్ స్లీపర్’ ఎక్స్‌ప్రెస్‌ రైలు వందశాతం మేరకు తన సత్తా చాటింది. రాజస్థాన్‌లోని కోటా - నాగ్‌డా సెక్షన్ మధ్య నిర్వహించిన హై-స్పీడ్ ట్రయల్ రన్ సంపూర్ణంగా విజయవంతమైంది. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పట్టాలపై పరుగులు తీసింది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ అద్భుతమైన ఘట్టానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్‌ చేశారు. భారతీయ సాంకేతిక పరిజ్ఞానం ఎంతటి ఉన్నత స్థాయికి చేరుకుందో ఆ వీడియోలో వివరించారు.

స్థిరత్వానికి పరీక్ష.. ‘వాటర్ టెస్ట్’
ఈ నూతన ‘వందే భారత్‌ స్లీపర్‌’ ఎక్స్‌ప్రెస్‌ రైలు ట్రయల్ రన్ కేవలం వేగానికి మాత్రమే పరిమితం కాలేదు. రైలు ప్రయాణంలో ఉండే స్థిరత్వాన్ని (Stability) కూడా పరీక్షించారు. 180 కిలోమీటర్ల వేగంతో రైలు దూసుకెళ్తున్న సమయంలో అదే రైలు లో ఉంచిన నీటి గ్లాసులు ఏమాత్రం కదలకుండా ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. మంత్రి షేర్ చేసిన వీడియోలో, స్పీడోమీటర్ 180 కి.మీ వేగాన్ని చూపిస్తున్నా, టేబుల్ పై ఉన్న నీటి గ్లాసుల నుండి ఒక్క చుక్క నీరు కూడా కిందకు పడలేదు. ఇది రైలులోని అధునాతన సస్పెన్షన్ వ్యవస్థ,  వైబ్రేషన్ నియంత్రణకు నిదర్శనంగా నిలిచింది.
 

సుదీర్ఘ ప్రయాణాల్లో సరికొత్త అనుభూతి 
ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ రైళ్లు కేవలం కూర్చునే సదుపాయం (Chair Car) మాత్రమే కలిగి ఉన్నాయి.అయితే కొత్తగా రాబోతున్నఈ స్లీపర్ వెర్షన్  వందే భారత్‌.. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు వరంగా మారనుంది. రాత్రిపూట ప్రయాణించే ఈ రైలు ప్రయాణికులకు విమాన స్థాయి సౌకర్యాలను ఈ రైలు అందించనుంది. రైలులో మెరుగైన కుషన్ సీట్లు, అధునాతన ఏసీ వ్యవస్థ, శబ్దం తక్కువగా ఉండేలా రూపొందించిన కోచ్‌లు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం  చేయనున్నాయి. ముఖ్యంగా పెద్ద నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.

‘కవచ్’ రక్షణతో సురక్షిత ప్రయాణం 
ఈ రైలు విషయంలో వేగంతో పాటు భద్రతకు కూడా రైల్వే శాఖ పెద్దపీట వేసింది. ఈ స్లీపర్ రైలులో స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ‘కవచ్’ (Kavach) యాంటీ కొలిజన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది ప్రమాదాలను నివారించడంలో కీలకంగా మారనుంది. దీనికితోడు అగ్నిప్రమాదాలను గుర్తించే సెన్సార్లు, ఆటోమేటిక్ డోర్లు, అత్యవసర సమయాల్లో సిబ్బందితో మాట్లాడేందుకు టాక్-బ్యాక్ సదుపాయం లాంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. త్వరలోనే ఈ రైళ్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని, ఇది భారత రైల్వే రూపురేఖలను మార్చనున్నదని రైల్వే అధికారులు చెబుతున్నారు.  

ఇది కూడా చదవండి: చొరబాట్లకు మమత మద్దతు: అమిత్ షా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement