పార్లమెంట్‌లో రభస: మహిళా ఎంపీల వీడియో విడుదల | Kiren Rijiju shares video of Feb 4 Parliament | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లో రభస: మహిళా ఎంపీల వీడియో విడుదల

Feb 10 2026 1:03 PM | Updated on Feb 10 2026 3:22 PM

Kiren Rijiju shares video of Feb 4 Parliament

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో మంగళవారం అధికార, ప్రతిపక్ష సభ్యుల పరస్పర వాదప్రతివాదనలు తారాస్థాయికి చేరాయి. మరోవైపు ఫిబ్రవరి 4న లోక్‌సభలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తాజాగా సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగానికి మరికొద్ది నిమిషాల ముందు, కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎంపీలు ప్రధాని కూర్చునే స్థానానికి అత్యంత సమీపంలోకి దూసుకెళ్లడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. సభలో నెలకొన్న గందరగోళం దృష్ట్యా, ప్రతిపక్ష ఎంపీలు దాడికి దిగే అవకాశం ఉందని భావించి, ఆ రోజు ప్రధానిని సభకు రావద్దని స్పీకర్ ఓం బిర్లా ముందే సూచించినట్లు తెలియవచ్చింది.

ఈ ఘటనపై కిరణ్ రిజిజు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ తీరును తప్పుబట్టారు. వారి ఎంపీల దిగజారుడు ప్రవర్తనపై కాంగ్రెస్ గర్వపడుతోందని ఆయన విమర్శించారు. ‘మేము గనుక మా బీజేపీ ఎంపీలను ఆపకుండా, కాంగ్రెస్ ఎంపీలను ఎదుర్కొనేందుకు అనుమతించి ఉంటే, అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. పార్లమెంటు గౌరవాన్ని, పవిత్రతను కాపాడాలన్నదే మా ప్రథమ ప్రాధాన్యత’ అని రిజిజు పేర్కొన్నారు. సభా మర్యాదలను కాపాడటానికే తాము సంయమనం పాటించామని ఆయన స్పష్టం చేశారు.

ఈ నిరసన వెనుక జనరల్ (రిటైర్డ్) ఎం.ఎం. నరవణే రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ అనే ప్రచురితం కాని పుస్తక ప్రస్తావన ఉంది. గత వారం రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఈ పుస్తకంలోని అంశాలను ప్రస్తావించడంతో పార్లమెంటులో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఈ వివాదమే ఫిబ్రవరి 4నాటి గందరగోళానికి దారితీసింది. అప్పట్లో ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభ కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రధాని లక్ష్యంగా ప్రతిపక్ష ఎంపీలు వ్యూహరచన చేస్తున్నారని స్పీకర్ ఓం బిర్లా హెచ్చరించడంతో, ఆ రోజు సభ అర్థంతరంగా వాయిదా పడింది.

	ప్రధానిపై దాడికి యత్నం.. మోదీ సీటును ముట్టడించిన మహిళా ఎంపీలు

 

Advertisement
 
Advertisement
Advertisement