‘మాజీ ఆర్మీ చీఫ్ అబద్ధం చెప్పరు’: రాహుల్ గాంధీ | Dont think ex Army Chief will lie Rahul | Sakshi
Sakshi News home page

‘మాజీ ఆర్మీ చీఫ్ అబద్ధం చెప్పరు’: రాహుల్ గాంధీ

Feb 10 2026 12:41 PM | Updated on Feb 10 2026 12:57 PM

Dont think ex Army Chief will lie Rahul

న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన ‘అన్‌పబ్లిష్డ్ మెమోయిర్’ పుస్తకం చుట్టూ నెలకొన్న వివాదంపై తీవ్రంగా స్పందించారు. ఈ పుస్తక ప్రచురణ కర్త పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ఇచ్చిన వివరణను ఆయన తప్పుబట్టారు. ఢిల్లీ పోలీసులు ఈ పుస్తక ప్రతుల చలామణిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో రాహుల్ విలేకరులతో మాట్లాడుతూ పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదన్న పెంగ్విన్ సంస్థ వాదనలో పరస్పర విరుద్ధ అంశాలు ఉన్నాయని ఆరోపించారు.

జనరల్ నరవణే గతంలో చేసిన ఒక ట్వీట్‌ను ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రదర్శించారు. ‘తన పుస్తకాన్ని కొనుగోలు చేయడానికి ఈ లింక్‌ను అనుసరించండి’ అని నరవణే స్వయంగా ట్వీట్ చేశారని ఆయన గుర్తు చేశారు. తాను చెప్పదలుచుకున్న పాయింట్ ఒక్కటేనని, అయితే నరవణే అబద్ధం చెబుతున్నారు లేదా పెంగ్విన్ సంస్థ అబద్ధం చెబుతోంది.. అయితే దేశ మాజీ ఆర్మీ చీఫ్ అబద్ధం చెబుతారని తాను అనుకోవడం లేదన్నారు. నరవణే మాటలకే తాను ప్రాధాన్యత ఇస్తానని  రాహుల్‌ స్పష్టం చేశారు.

ఈ పుస్తకం గతంలో ‘అమెజాన్’లో అందుబాటులో ఉందని, 2023లోనే దీనిని కొనమని నరవణే కోరారని రాహుల్ పేర్కొన్నారు. ఈ మెమోయిర్‌లో ఉన్న కొన్ని అంశాలు భారత ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధానమంత్రికి ఇబ్బందికరంగా మారాయని, అందుకే  వివాదాన్ని సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు, పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా దీనిపై స్పందిస్తూ.. 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తక ప్రచురణ హక్కులు తమకే ఉన్నాయని, అయితే దానిని తాము ఇంకా మార్కెట్లోకి విడుదల చేయలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం సర్క్యులేషన్‌లో ఉన్న ఏవైనా డిజిటల్ లేదా ప్రింట్ కాపీలు కాపీరైట్ ఉల్లంఘన కిందకే వస్తాయని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: విద్యార్థులకు శుభవార్త.. ఇకపై మార్కుల్లో పొరపాట్లకు చెల్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement