breaking news
ex army chief
-
మౌనం వీడిన జనరల్ నరవణే.. ఏమన్నారంటే..
న్యూఢిల్లీ: తన ఆత్మకథ ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ ప్రచురణకు సంబంధించి గత కొద్దిరోజులుగా సాగుతున్న వివాదంపై మాజీ సైన్యాధిపతి జనరల్ (రిటైర్డ్) ఎంఎం నరవణే ఎట్టకేలకు స్పందించారు. ఈ పుస్తకం ఇంకా అధికారికంగా విడుదల కాలేదని ప్రచురణ సంస్థ ‘పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా’ ఇచ్చిన వివరణను ఆయన సమర్థించారు. ఒక పుస్తకాన్ని ప్రకటించడం లేదా ముందస్తు ఆర్డర్ కోసం అందుబాటులో ఉంచడం అంటే అది పబ్లిక్ రిలీజ్ అయినట్టు కాదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ప్రచురణకర్త సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌ను ఆయన షేర్ చేస్తూ, వాస్తవ పరిస్థితులను మీడియాకు వివరించారు.కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇటీవల పార్లమెంటు ఆవరణలో ఈ పుస్తకానికి సంబంధించిన కాపీని ప్రదర్శించడమే కాకుండా, 2023లో నరవణే చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్‌ను ప్రస్తావించడంతో ఈ వివాదం మొదలైంది. దీనిపై స్పందించిన ప్రచురణ సంస్థ, పుస్తక ప్రచురణ ప్రక్రియ గురించి వివరించింది. ఒక పుస్తకాన్ని ప్రకటించడం అంటే భవిష్యత్తులో దానిని తీసుకురాబోతున్నామని చెప్పడమే తప్ప, అది అమ్మకానికి సిద్ధంగా ఉందని కాదని స్పష్టం చేసింది. రిటైలర్లు, పాఠకుల సౌకర్యార్థం ముందస్తు ఆర్డర్లు తీసుకోవడం అనేది ప్రచురణ రంగంలో సాధారణ పద్ధతి మాత్రమేనని తెలిపింది. This is the status of the book. https://t.co/atLtwhJvl0— Manoj Naravane (@ManojNaravane) February 10, 2026ఈ పుస్తకం ఇంకా అధికారికంగా మార్కెట్లోకి రాకముందే దాని మాన్యుస్క్రిప్ట్ డిజిటల్, ఇతర రూపాల్లో అక్రమంగా చలామణి అవుతుండటంపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై విచారణ వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ పుస్తకానికి సంబంధించి తమకు మాత్రమే ప్రచురణ హక్కులు ఉన్నాయని, అనుమతి లేకుండా పిడిఎఫ్ లేదా ముద్రిత రూపంలో పంపిణీ చేయడం కాపీరైట్ చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుందని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రచురణకర్త హెచ్చరించారు.గత వారం పార్లమెంటులో రాహుల్ గాంధీ ఈ పుస్తక ప్రతిని చూపిస్తూ, చర్చకు ప్రయత్నించారు. ఫిబ్రవరి 2 నుంచి లోక్‌సభలో ఈ ఆత్మకథలోని అంశాలను ప్రస్తావించాలని ఆయన భావించినప్పటికీ, పుస్తకం ఇంకా అధికారికంగా ప్రచురితం కాలేదనే కారణంతో ఆయనను అడ్డుకున్నారు. పుస్తకం రిటైల్ ఛానళ్లలో అందుబాటులోకి వచ్చినప్పుడే అది ప్రచురితమైనట్లు పరిగణించాలని ప్రచురణ సంస్థ స్పష్టం చేయడంతో, రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది.ఇది కూడా చదవండి: ‘మాజీ ఆర్మీ చీఫ్ అబద్ధం చెప్పరు’: రాహుల్ గాంధీ -
‘మాజీ ఆర్మీ చీఫ్ అబద్ధం చెప్పరు’: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన ‘అన్పబ్లిష్డ్ మెమోయిర్’ పుస్తకం చుట్టూ నెలకొన్న వివాదంపై తీవ్రంగా స్పందించారు. ఈ పుస్తక ప్రచురణ కర్త పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ఇచ్చిన వివరణను ఆయన తప్పుబట్టారు. ఢిల్లీ పోలీసులు ఈ పుస్తక ప్రతుల చలామణిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో రాహుల్ విలేకరులతో మాట్లాడుతూ పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదన్న పెంగ్విన్ సంస్థ వాదనలో పరస్పర విరుద్ధ అంశాలు ఉన్నాయని ఆరోపించారు.జనరల్ నరవణే గతంలో చేసిన ఒక ట్వీట్‌ను ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రదర్శించారు. ‘తన పుస్తకాన్ని కొనుగోలు చేయడానికి ఈ లింక్‌ను అనుసరించండి’ అని నరవణే స్వయంగా ట్వీట్ చేశారని ఆయన గుర్తు చేశారు. తాను చెప్పదలుచుకున్న పాయింట్ ఒక్కటేనని, అయితే నరవణే అబద్ధం చెబుతున్నారు లేదా పెంగ్విన్ సంస్థ అబద్ధం చెబుతోంది.. అయితే దేశ మాజీ ఆర్మీ చీఫ్ అబద్ధం చెబుతారని తాను అనుకోవడం లేదన్నారు. నరవణే మాటలకే తాను ప్రాధాన్యత ఇస్తానని రాహుల్ స్పష్టం చేశారు.ఈ పుస్తకం గతంలో ‘అమెజాన్’లో అందుబాటులో ఉందని, 2023లోనే దీనిని కొనమని నరవణే కోరారని రాహుల్ పేర్కొన్నారు. ఈ మెమోయిర్‌లో ఉన్న కొన్ని అంశాలు భారత ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధానమంత్రికి ఇబ్బందికరంగా మారాయని, అందుకే వివాదాన్ని సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు, పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా దీనిపై స్పందిస్తూ.. 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తక ప్రచురణ హక్కులు తమకే ఉన్నాయని, అయితే దానిని తాము ఇంకా మార్కెట్లోకి విడుదల చేయలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం సర్క్యులేషన్లో ఉన్న ఏవైనా డిజిటల్ లేదా ప్రింట్ కాపీలు కాపీరైట్ ఉల్లంఘన కిందకే వస్తాయని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.ఇది కూడా చదవండి: విద్యార్థులకు శుభవార్త.. ఇకపై మార్కుల్లో పొరపాట్లకు చెల్లు! -
లోక్‌సభలో అదే రగడ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఆర్మీ మాజీ చీఫ్ ఎం.ఎం.నరవణె పుస్తకం ఉదంతంపై సోమవారం సభలో రేగిన వివాదం మంగళవారం కూడా కొనసాగింది. దానిపై తనను మాట్లాడనివ్వాలంటూ విపక్ష నేత రాహుల్‌గాంధీ పట్టుబట్టారు. అందుకు సభాపతి అనుమతించకపోవడంతో కాంగ్రెస్‌తో పాటు ఇతర విపక్ష సభ్యులు నిరసనలకు దిగారు. నినాదాలతో సభను హోరెత్తించారు. కాగితాలను చించి స్పీకర్ కేసి విసిరారు. పోడియంపైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. ఈ ఉదంతం చివరికి ఎనిమిది మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్‌కు దారితీసింది. ఉదయం నుంచే... మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగా నే రాహుల్‌గాంధీ మాట్లాడారు. 2020 నాటి భారత్, చైనా ఘర్షణకు సంబంధించి నాటి ఆర్మీ చీఫ్ నరవణె తన పుస్తకంలో పేర్కొన్న అంశాలకు సంబంధించి ఓ మేగజైన్లో వచి్చన వ్యాసాన్ని సోమవారం ఆయన సభలో ఉటంకించడం, అందుకు స్పీకర్ బిర్లా అభ్యంతరం తెలపడం తెలిసిందే. స్పీకర్ సూచించిన మేరకు సదరు వ్యాసాన్ని తాను ధ్రువీకరిస్తున్నట్టు మంగళవారం రాహుల్ సభలో ప్రకటించారు. ఈ మేరకు దానిపై తాను సంతకం చేసిన కాపీని సమరి్పంచారు. దాన్ని పరిశీలించాక స్పందిస్తానని సభాపతి స్థానంలో ఉన్న ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రకటించారు.అయినా నరవణె అంశంపై మాట్లాడేందుకు రాహుల్ తిరిగి ప్రయత్నించారు. దాంతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు అభ్యంతరం తెలిపారు. స్పీకర్ ఒకసారి రూలింగ్ ఇచ్చాక అదే అంశాన్ని పదేపదే లేవనెత్తకుండా అక్కడితో వదిలేయాలని సూచించారు. తాను విపక్ష నేతనని, మాట్లాడేందుకు అనుమతి కోరాల్సిన అవసరం లేదని రాహుల్ బదులిచ్చారు. మేగజైన్లోని అంశంపై మాట్లాడి తీరతానని పట్టుబట్టారు. ప్యానెల్ స్పీకర్ మాత్రం ఇతర విపక్ష సభ్యులను మాట్లాడాల్సిందిగా కోరారు. కానీ వరుసగా ముగ్గురు సభ్యులు మాట్లాడేందుకు నిరాకరించారు. తద్వారా రాహుల్‌కు సంఘీభావం ప్రకటించారు. దాంతో ఎన్డీఏ భాగస్వామి టీడీపీకి చెందిన హరీశ్ బాలయోగిని మాట్లాడాల్సిందిగా ప్యానెల్ స్పీకర్ కోరారు.ఆయన మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దాంతో సభ పదేపదే వాయిదా పడింది. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోగా విపక్ష సభ్యులు కాగితాలు చించి స్పీకర్ కేసి విసిరారు. పోడియంపైకి, లోక్‌సభ సెక్రెటరీ జనరల్ టేబుల్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. దాంతో తీవ్ర గందరగోళం నడుమ సభ మరోసారి వాయిదా పడింది. మధ్యాహ్నం మూడింటికి సభ తిరిగి సమావేశం కాగానే సభాపతి స్థానంలో ఉన్న దిలీప్ సైకియా నేరుగా ఎనిమిది మంది విపక్ష సభ్యులు గుర్జీత్‌సింగ్ ఔజ్లా, హబీ ఈడెన్, సి.కిరణ్‌కుమార్‌రెడ్డి, అమరీందర్‌సింగ్ రజా వారింగ్, మాణిక్కం ఠాగూర్, ప్రశాంత్ పడోలే, డీన్ కురియకోసే (కాంగ్రెస్), ఎస్.వెంకటేశన్ (సీపీ ఎం) పేర్లు చదివి విని్పంచారు. వారిని సస్పెండ్ చేయాల్సిందిగా రిజిజు తీర్మానం ప్రవేశపెట్టారు. సభ్యులు సభ పట్ల, సభాపతి అధికారాల పట్ల అమర్యాదగా ప్రవర్తించారని ఆక్షేపించారు. తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. 8 మంది సభ్యులను ఏప్రిల్ 2న బడ్జెట్ సమావేశాలు ముగిసేదాకా సస్పెండ్ చేస్తున్నట్టు సభాపతి ప్రకటించారు. విపక్ష ఎంపీలు రాహుల్ నేతృత్వంలో పార్లమెంటు ఆవరణలో ధర్నాకు దిగారు.ప్రజాస్వామ్యానికి తీరని మచ్చస్పీకర్ ఓం బిర్లాకు రాహుల్ లేఖజాతీయ భద్రతకు సంబంధించిన అంశంపై విపక్ష నేతను లోక్‌సభలో మాట్లాడకుండా అడ్డుకోవ డం ప్రజాస్వామ్యానికే తీరని మచ్చ అని రాహుల్‌గాంధీ మండిపడ్డారు. సభాపతి స్థానంలో ఉన్నవారు సోమ, మంగళవారాల్లో తనతో ప్రవర్తించిన తీరును తీవ్రంగా నిరసిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆయన లేఖ రాశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై విపక్ష నేతను మాట్లాడకుండా అడ్డుకోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని రాహుల్ అన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వ సూచన మేరకే స్పీకర్ నన్ను మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారు. ఇలా జరగడం మన పార్లమెంటరీ చరిత్రలోనే తొలిసారి!’’ అంటూ మండిపడ్డారు. -
భారత ఆర్మీతో పోలికా! అంత సీన్ లేదు.. కుండ బద్దలు కొట్టిన పాక్ ఆర్మీ మాజీ చీఫ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్మీ మాజీ చీఫ్ కమర్ జావెద్ బద్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత సైన్యం సత్తాపైనే అనుమానాలు వ్యక్తం చేశారు. భారత్ సైన్యంతో పారాడే శక్తి సామర్థ్యాలు, ఆయుధ సంపత్తి పాకిస్తాన్ ఆర్మీకి లేదని కుండబద్దలు కొట్టారు. బ్రిటన్‌లోని పాకిస్తాన్ మీడియా జర్నలిస్టులు హమీద్ మీర్, నజీం జెహ్రాలకు ఇచ్చిన ఇంటర్వూలో జావెద్ ఈ వాఖ్యలు చేశారు. 'భారత ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీ సరితూగలేదు. భారత్‌తో పాక్ యుద్ధం చేసే పరిస్థితి లేదు. ట్యాంకులు కూడా పనిచేయడం లేదు. ఫిరంగులను తరలించడానికి డీజిల్ కూడా లేదు' అని బజ్వా తెలిపారు. పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు ఆ దేశ సైనిక సామర్థ్యాలపై ప్రశ్నలు లేవెనత్తేలా, సైన్యం నైతికతను దెబ్బతీసేలా ఉన్నాయి. ఏదేమైనా ఆయన చెప్పిన దాంట్లో మాత్రం వాస్తవం ఉంది. భారత సైన్యం వీరపరక్రమాల ముందు పాక్ సైన్యం సరితూగదని జగమెరిగిన సత్యం. పాకిస్తాన్ కమాండర్స్ సదస్సులోనే బజ్వా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. భారత్‌తో పాకిస్తాన్ శుత్రుత్వం పెంచుకోకుండా స్నేహపూర్వక సంబంధాలు మెరుగుపరుచుకుంటేనే మంచిదని ఆయన అన్నారు. భారత్‌తో సుదీర్ఘ విరోధం పాకిస్తాన్‌ను హరించివేస్తుందని పేర్కొన్నారు. భారత్‌తో పోరాడేందుకు అవసరమైన ఆయుద సంపద, ఆర్థిక బలం పాకిస్తాన్‌కు లేవని, అందుకే కశ్మీర్ సమస్యపై ఇరుదేశాలు శాశ్వత పరిష్కారానికి వచ్చే విషయంపై ఆలోచిస్తున్నట్లు కూడా బజ్వా పేర్కొన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్న విషయం తెలిసిందే. ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు రాజకీయ సంక్షోభంతో ప్రజల జీవితాలు దుర్బరంగా మారాయి. నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చి, ఉద్యోగాలు పోయి అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. చదవండి: సూడాన్ ఆర్మీ-పారామిలిటరీ బలగాల పోరు.. 72 గంటలపాటు కాల్పుల విరమణ! -
బీజేపీలో చేరిన మాజీ ఆర్మీ చీఫ్ జేజే సింగ్
చండీగఢ్: పంజాబ్ ఎన్నికల వేళ మాజీ సైనికాధిపతి జనరల్ జోగీందర్ జస్వంత్ సింగ్ మంగళవారం బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, పంజాబ్ బీజేపీ చీఫ్ అశ్వని శర్మ తదితర పార్టీ నేతలు జేజే సింగ్‌ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ ఆర్మీచీఫ్ వీకే సింగ్ అనంతరం బీజేపీలో చేరిన రెండో మాజీ ఆర్మీ చీఫ్ జేజే సింగ్ కావడం విశేషం. గతంలో సింగ్ శిరోమణి అకాలీదళ్‌లో ఉన్నారు. 2017ఎన్నికల్లో పాటీయాలా నుంచి అమరీందర్‌పై అకాలీ అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆయనకు మూడో స్థానం దక్కింది. అనంతరం సింగ్ 2018లో అకాలీదళ్ నుంచి బయటకు వచ్చారు.అంతకుముందు ఆయన అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా సేవలనందించారు. 2005లో ఆయన ఆర్మీచీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవి చేపట్టిన తొలి సిక్కు ఆయనే! సింగ్‌తో పాటు మాజీ డీజీపీ ఎస్ఎస్ సంధు, అజ్మీర్ సింగ్ తదితరులు బీజేపీలో చేరారు. రాష్ట్రంలో అమరీందర్ పార్టీ, అకాలీదళ్(సంయుక్త్)తో కలిసి బీజేపీ పోటీ చేస్తోంది. -
మాజీ దళపతి కేవీ కన్నుమూత
గుండెపోటుతో జనరల్ కృష్ణారావు మృతి ♦ విజయవాడలో జన్మించిన కేవీ ♦ సిపాయిగా చేరి సైన్యం చీఫ్ దాకా.. ♦ సైన్యం ఆధునీకరణకు కృషి.. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో కీలక పాత్ర ♦ జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల గవర్నర్‌గా సేవలు సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో కీలకపాత్ర పోషించిన ఆర్మీ మాజీ చీఫ్, జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్.. జనరల్ కేవీ కృష్ణారావు(92) శనివారం కన్నుమూశారు. ఢిల్లీలోని ఓ సైనిక ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించారు. కొటికలపూడి వెంకటకృష్ణారావు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా విజయవాడలో 1923 జనవరి 16న జన్మించారు. నారాయణరావు, లక్ష్మి ఆయన తల్లిదండ్రులు. సైన్యంలో సాధారణ సిపాయిగా చేరిన కేవీ అంచెలంచెలుగా ఎదిగారు. 1981-83 మధ్య ఆర్మీ 14వ చీఫ్‌గా పనిచేశారు. నాలుగు దశాబ్దాలపాటు సేవలు.. నాలుగు దశాబ్దాల పాటు ఆర్మీకి సేవలందించిన కేవీ స్వాతంత్య్రానికి ముందే 1942 ఆగస్టు 9న సైన్యంలో చేరారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బర్మా, బెలూచిస్తాన్లలో పనిచేశారు. దేశ విభజన సమయంలో తూర్పు, పశ్చిమ పంజాబ్‌ల్లో విధులు నిర్వర్తించారు. 1947-48లో జరిగిన భారత్-పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ వ్యవస్థాపక శిక్షకులలో కృష్ణారావు ఒకరు. 1949-51 మధ్య ఆయన డిఫెన్స్ అకాడమీలో పనిచేశారు. 1965-66లో లడఖ్‌లో ఒక దళానికి, 1969-70లో జమ్మూ ప్రాంతంలో ఇన్ఫాంట్రీ విభాగానికి కమాండర్‌గా వ్యవహరించారు. 1970-72 మధ్య నాగాలాండ్, మణిపూర్లలో తిరుగుబాట్ల అణచివేత దళాలకు నేతృత్వం వహించారు. 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించారు. బంగ్లాదేశ్‌లోని సిల్హెట్, ఈశాన్య బంగ్లాదేశ్ ప్రాంతాలకు విముక్తి కల్పించడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ యుద్ధంలో కృష్ణారావు చూపిన ధైర్యం, సాహసోపేత నిర్ణయాలు, నాయకత్వ ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం పరమ విశిష్ట సేవా పతకంతో సత్కరించింది. గవర్నర్‌గా విశిష్ట సేవలు.. కృష్ణారావు సేవలను గుర్తించిన కేంద్రం ఆర్మీ చీఫ్‌గా రిటైరైన అనంతరం ఆయనకు గవర్నర్‌గా అవకాశం కల్పించింది. 1984-89 మధ్య నాగాలాండ్, మణిపూర్, త్రిపుర గవర్నర్‌గా ఆయన పనిచేశారు. మధ్యలో 1988లో కొంతకాలం పాటు మిజోరం గవర్నర్‌గా అదనపు బాధ్యతలను నిర్వర్తించారు. 1989-90 మధ్య, 1993-1998 మధ్య జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా పనిచేశారు. ఉగ్రవాదం, తిరుగుబాట్లతో అట్టుడికిన కశ్మీర్లో తిరిగి శాంతి నెలకొనేందుకు కృషి చేశారు. ప్రముఖుల సంతాపం..కేవీ మృతి పట్ల గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్‌సింగ్, ఏపీ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. సైన్యాధిపతిగా కేవీ సేవలు చిరస్మరణీయమని గవర్నర్ పేర్కొన్నారు. కేవీ సైన్యంలోఎందరికో మార్గదర్శకంగా నిలిచారని రక్షణమంత్రి పరీకర్ అన్నారు. వైఎస్ జగన్ సంతాపం కృష్ణారావు మృతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సైన్యాధిపతిగా కృష్ణారావు ఎనలేని సేవలందించారని, పదవీ విరమణ తర్వాతా గవర్నర్‌గా మెప్పించారని ఒక ప్రకటనలో గుర్తు చేసుకున్నారు. కృష్ణారావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భారతమాత గొప్ప ముద్దుబిడ్డను కోల్పోయిందన్నారు. బలగాల ఆధునీకరణలో.. భారత సైన్య ఆధునీకరణలో కేవీది ప్రధాన పాత్ర. 1975లో ప్రభుత్వం కేవీ అధ్యక్షతనే సైన్యం పునర్వ్యవస్థీకరణ, ఆధునీకరణకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. దీని సిఫార్సుల ను కేంద్రం అమలు చేసింది కూడా. 1978-79 మధ్య ఆర్మీ ప్రధాన కార్యాలయం సిబ్బందికి డిప్యూటీ చీఫ్‌గా, 1979-81 మధ్య పశ్చిమ కమాండ్‌కు అధిపతిగా పనిచేశారు. 1981 జూన్ 1న 14వ ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు. 1983 జూలై దాకా ఆ పదవిలో ఉన్నారు. -
కాశ్మీర్ సర్కారును పడగొట్టాలనుకోలేదు: వీకే సింగ్
అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేలా యువతను ప్రోత్సహించేందుకే ఓ స్వచ్ఛంద సంస్థకు భారత సైన్యం నుంచి నిధులు మంజూరుచేశాం తప్ప.. జమ్ము కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఏమీ ఇవ్వలేదని ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ స్పష్టం చేశారు. గులాం హసన్ మీర్ అనే కాశ్మీరీ మంత్రికి ఆర్మీ నుంచి రహస్యంగా నిధులు వెళ్లాయన్న ఆరోపణలపై మీడియా అడిగిన ప్రశ్నకు వీకే సింగ్ సమాధానమిచ్చారు. యువతను అభివృద్ధి కార్యక్రమాల వైపు ఆకర్షితులు చేయడానికి డబ్బులు అవసరమైతే ఇవ్వడం తప్పేమీ కాదని ఆయన అన్నారు. కోటి రూపాయలతోనే మన లాంటి గొప్ప దేశంలో ప్రభుత్వాలు పడిపోయేటట్లయితే రోజుకో ప్రభుత్వం పడిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. రక్తదాన శిబిరాల నిర్వహణ, మహిళలకు శిక్షణ, పిల్లలను రాళ్లు విసిరే కార్యక్రమాల నుంచి దూరంగా తేవడం లాంటి కార్యక్రమాలు చేయడానికే ఓ స్వచ్ఛంద సంస్థకు నిధులు ఇచ్చినట్లు సింగ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరత పాలు చేయడానికి మంత్రి మీర్‌కు రూ. 1.19 కోట్ల ఆర్మీ నిధులు వెళ్లినట్లు తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.


