8 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్
సమావేశాలు ముగిసేదాకా వేటు
నరవణె పుస్తకంపై కొనసాగిన వివాదం
దానిపై మాట్లాడనివ్వాలన్న రాహుల్
పోడియంపైకెక్కి సభ్యుల నిరసనలు
కాగితాలు చించి స్పీకర్‌పైకి విసిరివేత
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఆర్మీ మాజీ చీఫ్ ఎం.ఎం.నరవణె పుస్తకం ఉదంతంపై సోమవారం సభలో రేగిన వివాదం మంగళవారం కూడా కొనసాగింది. దానిపై తనను మాట్లాడనివ్వాలంటూ విపక్ష నేత రాహుల్‌గాంధీ పట్టుబట్టారు. అందుకు సభాపతి అనుమతించకపోవడంతో కాంగ్రెస్‌తో పాటు ఇతర విపక్ష సభ్యులు నిరసనలకు దిగారు. నినాదాలతో సభను హోరెత్తించారు. కాగితాలను చించి స్పీకర్ కేసి విసిరారు. పోడియంపైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. ఈ ఉదంతం చివరికి ఎనిమిది మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్‌కు దారితీసింది.
ఉదయం నుంచే...
మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగా నే రాహుల్‌గాంధీ మాట్లాడారు. 2020 నాటి భారత్, చైనా ఘర్షణకు సంబంధించి నాటి ఆర్మీ చీఫ్ నరవణె తన పుస్తకంలో పేర్కొన్న అంశాలకు సంబంధించి ఓ మేగజైన్లో వచి్చన వ్యాసాన్ని సోమవారం ఆయన సభలో ఉటంకించడం, అందుకు స్పీకర్ బిర్లా అభ్యంతరం తెలపడం తెలిసిందే. స్పీకర్ సూచించిన మేరకు సదరు వ్యాసాన్ని తాను ధ్రువీకరిస్తున్నట్టు మంగళవారం రాహుల్ సభలో ప్రకటించారు. ఈ మేరకు దానిపై తాను సంతకం చేసిన కాపీని సమరి్పంచారు. దాన్ని పరిశీలించాక స్పందిస్తానని సభాపతి స్థానంలో ఉన్న ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రకటించారు.
అయినా నరవణె అంశంపై మాట్లాడేందుకు రాహుల్ తిరిగి ప్రయత్నించారు. దాంతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు అభ్యంతరం తెలిపారు. స్పీకర్ ఒకసారి రూలింగ్ ఇచ్చాక అదే అంశాన్ని పదేపదే లేవనెత్తకుండా అక్కడితో వదిలేయాలని సూచించారు. తాను విపక్ష నేతనని, మాట్లాడేందుకు అనుమతి కోరాల్సిన అవసరం లేదని రాహుల్ బదులిచ్చారు. మేగజైన్‌లోని అంశంపై మాట్లాడి తీరతానని పట్టుబట్టారు. ప్యానెల్ స్పీకర్ మాత్రం ఇతర విపక్ష సభ్యులను మాట్లాడాల్సిందిగా కోరారు. కానీ వరుసగా ముగ్గురు సభ్యులు మాట్లాడేందుకు నిరాకరించారు. తద్వారా రాహుల్‌కు సంఘీభావం ప్రకటించారు. దాంతో ఎన్డీఏ భాగస్వామి టీడీపీకి చెందిన హరీశ్ బాలయోగిని మాట్లాడాల్సిందిగా ప్యానెల్ స్పీకర్ కోరారు.
ఆయన మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దాంతో సభ పదేపదే వాయిదా పడింది. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోగా విపక్ష సభ్యులు కాగితాలు చించి స్పీకర్ కేసి విసిరారు. పోడియంపైకి, లోక్‌సభ సెక్రెటరీ జనరల్ టేబుల్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. దాంతో తీవ్ర గందరగోళం నడుమ సభ మరోసారి వాయిదా పడింది. మధ్యాహ్నం మూడింటికి సభ తిరిగి సమావేశం కాగానే సభాపతి స్థానంలో ఉన్న దిలీప్ సైకియా నేరుగా ఎనిమిది మంది విపక్ష సభ్యులు గుర్జీత్‌సింగ్ ఔజ్లా, హబీ ఈడెన్, సి.కిరణ్‌కుమార్‌రెడ్డి, అమరీందర్‌సింగ్ రజా వారింగ్, మాణిక్కం ఠాగూర్, ప్రశాంత్ పడోలే, డీన్ కురియకోసే (కాంగ్రెస్), ఎస్.వెంకటేశన్ (సీపీ ఎం) పేర్లు చదివి విని్పంచారు.
వారిని సస్పెండ్ చేయాల్సిందిగా రిజిజు తీర్మానం ప్రవేశపెట్టారు. సభ్యులు సభ పట్ల, సభాపతి అధికారాల పట్ల అమర్యాదగా ప్రవర్తించారని ఆక్షేపించారు. తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. 8 మంది సభ్యులను ఏప్రిల్ 2న బడ్జెట్ సమావేశాలు ముగిసేదాకా సస్పెండ్ చేస్తున్నట్టు సభాపతి ప్రకటించారు. విపక్ష ఎంపీలు రాహుల్ నేతృత్వంలో పార్లమెంటు ఆవరణలో ధర్నాకు దిగారు.
ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ
స్పీకర్ ఓం బిర్లాకు రాహుల్ లేఖ
జాతీయ భద్రతకు సంబంధించిన అంశంపై విపక్ష నేతను లోక్‌సభలో మాట్లాడకుండా అడ్డుకోవ డం ప్రజాస్వామ్యానికే తీరని మచ్చ అని రాహుల్‌గాంధీ మండిపడ్డారు. సభాపతి స్థానంలో ఉన్నవారు సోమ, మంగళవారాల్లో తనతో ప్రవర్తించిన తీరును తీవ్రంగా నిరసిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆయన లేఖ రాశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై విపక్ష నేతను మాట్లాడకుండా అడ్డుకోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని రాహుల్ అన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వ సూచన మేరకే స్పీకర్ నన్ను మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారు. ఇలా జరగడం మన పార్లమెంటరీ చరిత్రలోనే తొలిసారి!’’ అంటూ మండిపడ్డారు.


