బీజేపీతో జాగ్రత్త! | CM Revanth Reddy to meet with Parliament in-charge ministers on february 03: Telangana | Sakshi
Sakshi News home page

బీజేపీతో జాగ్రత్త!

Feb 3 2026 2:07 AM | Updated on Feb 3 2026 2:07 AM

CM Revanth Reddy to meet with Parliament in-charge ministers on february 03: Telangana

ఉత్తర తెలంగాణలో గట్టి పోటీ ఇస్తోందని సర్వేలు చెబుతున్నాయి

నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి 

బీజేపీ, బీఆర్‌ఎస్‌ సర్దుబాట్లపై  అప్రమత్తంగా ఉండాలి 

టీపీఈసీ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

రెబల్స్‌ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి 

ఎట్టి పరిస్థితుల్లోనూ మెజారిటీ స్థానాలు గెలవాలన్న సీఎం 

నేడు పార్లమెంటు ఇన్‌చార్జి మంత్రులతో ముఖ్యమంత్రి భేటీ

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, బీజేపీతో కొంత జాగ్రత్తగా ఉండాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఉత్తర తెలంగాణలో బీజేపీ గట్టి పోటీ ఇస్తోందని సర్వేలు చెబుతున్నాయని, ఈ నేపథ్యంలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో గెలుపు కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టి పని చేయాలని సూచించినట్టు తెలిసింది. పంచాయతీ ఎన్నికల్లో కలిసి పని చేసిన బీజేపీ, బీఆర్‌ఎస్‌ స్థానిక నాయకత్వాలు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ సర్దుబాట్లు చేసుకోవడంపై అప్రమత్తంగా ఉండాలన్నారు.

మున్సిపల్‌ ఎన్నికలకు పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు సోమవారం తెలంగాణ ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ (పీఈసీ) సమావేశమయ్యింది. టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఈ భేటీకి అధ్యక్షత వహించారు. జూమ్‌ ద్వారా జరిగిన ఈ సమావేశంలో సీఎం, పీసీసీ చీఫ్‌లతో పాటు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్‌ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా పలువురు మంత్రులు, పీఈసీ సభ్యులు డాక్టర్‌ చల్లా వంశీచందర్‌రెడ్డి, వి. హన్మంతరావు, కె.జానారెడ్డి, కె.కేశవరావు, మధుయాష్కీ గౌడ్, జెట్టి కుసుమకుమార్, సంపత్‌కుమార్, రాములు నాయక్, ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదళ్‌ అధ్యక్షులు, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.

పలు సర్వేల ద్వారా లభించిన సమాచారం ఆధారంగా ఏ మున్సిపాలిటీలో ఎలాంటి కసరత్తు చేయాలన్న దానిపై పలు సూచనలు చేశారు. మున్సిపాలిటీల వారీగా పరిస్థితిని మంత్రులు, పీఈసీ సభ్యులకు వివరించిన సీఎం.. ఎక్కడ ఏం చేయాలన్నది తాను వ్యక్తిగతంగా మంత్రులు, పార్టీ నేతలతో మాట్లాడతానని చెప్పారు. పార్టీ అభ్యర్థుల ఖరారు విషయంలో సమన్వయం చేసుకోవాలని, రెబల్స్‌ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  

కాంగ్రెస్‌ సత్తా చాటాలి 
రాష్ట్రంలోని మెజార్టీ మున్సిపాలిటీలు గెలుచుకుంటామని సర్వేలు చెపుతున్నాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా 80–90 శాతం స్థానాల్లో కాంగ్రెస్‌ పారీ్టదే విజయం. గతంలో జరిగిన అన్ని ఎన్నికల తరహాలోనే మున్సిపల్‌ ఎన్నికలను కూడా చాలెంజ్‌గా తీసుకోవాలి. చాలాచోట్ల నాయకత్వం మధ్య పోటీ కనిపిస్తోంది. మాకంటే మాకు బీఫామ్‌లు కావాలని అడుగుతున్నారు. ఇలాంటి స్థానాల్లో అందరినీ కూర్చోబెట్టి ఏకాభిప్రాయం సాధించి ఒకరికి బీఫామ్‌ ఇచ్చేలా పార్లమెంటు ఇన్‌చార్జి మంత్రులు చొరవ తీసుకోవాలి.

టికెట్లు రాని బలమైన నాయకులకు కార్పొరేషన్లు, ఇతర మార్గాల్లో అవకాశం కలి్పస్తామని హామీ ఇవ్వాలి. కొత్త, పాత కాంగ్రెస్‌ అనే సమస్యలు కూడా వస్తున్నాయి. ఈ విషయంలో కూడా రాజీ మార్గం ద్వారా పార్టీ గెలుపునకు ప్రాధాన్యమిచ్చి అభ్యర్థులను ఎంపిక చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మెజార్టీ స్థానాలు గెలుచుకోవడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటాలి..’అని రేవంత్‌ పిలుపునిచ్చారు. సమావేశంలో భాగంగా పార్లమెంటు స్థానాల వారీగా ఏర్పాటు చేసిన మున్సిపల్‌ ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీలు ఇచి్చన అభ్యర్థుల జాబితాను పీఈసీ ఆమోదించింది. 

ఈ మేరకు బీఫామ్‌లు ఇచ్చే అధికారాన్ని డీసీసీ అధ్యక్షులకు పీసీసీ చీఫ్‌ ఇచ్చారు. వీహెచ్‌ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల గురించి ప్రస్తావించారు. సీఎం, పీసీసీ చీఫ్‌లు రాహుల్‌గాం«దీతో మాట్లాడి ఈ అంశంపై పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టేలా ఒప్పించాలని కోరారు.

సీఎంకు అభినందనలు 
సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనపై కూడా జూమ్‌ సమావేశంలో కొంత సేపు చర్చ జరిగింది. దావోస్‌లో తెలంగాణ రైజింగ్‌ వాయిస్‌ను సమర్థవంతంగా వినిపించగలిగామని పీఈసీ అభిప్రాయపడింది. దీంతో పాటు హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో రేవంత్‌ తీసుకున్న శిక్షణ గురించి కూడా పలువురు మంత్రులు, పీఈసీ సభ్యులు ప్రస్తావించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా విద్యార్థిగా పాఠాలు నేర్చుకున్నందుకు అభినందనలు తెలిపారు. ఇలావుండగా..సీఎం మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన కార్యాలయంలో పార్లమెంటు ఇన్‌చార్జి మంత్రులతో సమావేశం కానున్నారు. మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్‌లు హాజరు కానున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement