జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి రావి నారాయణరెడ్డి జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో సీపీఐ నాయకులు పల్లా వెంకట్‌రెడ్డి, కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి, చాడ వెంకట్‌రెడ్డి, వందేమాతరం శ్రీనివాస్, రావి నారాయణరెడ్డి ట్రస్ట్ చైర్మన్ రావి ప్రతిభా భారతి
తెలంగాణ జాతిపిత అని వారికి వారే ఒకరికి టైటిల్ ఇచ్చుకున్నారు
తెలంగాణ సాయుధ పోరాటంలో రావి నారాయణరెడ్డి లాంటి వారు సర్వం కోల్పోయారు
ఇప్పుడు జాతిపితగా చెప్పుకునే వ్యక్తి కుటుంబం మాత్రం వేలకోట్ల ఆస్తులు సంపాదించుకుంది
తెలంగాణ ఆత్మగౌరవాన్నే విచారణ చేస్తారా అంటూ ఎగిరిపడుతున్నారు
జార్ఖండ్ సాధించిన శిబు సోరెన్, సీఎంలుగా పనిచేసిన జయలలిత, యడియూరప్ప, లాలూ వంటి వారు కూడా విచారణ ఎదుర్కొన్నారన్న సీఎం
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డికి పురస్కారం ప్రదానం
సాక్షి, హైదరాబాద్: తప్పు చేసినవారు ఎంత గొప్పవారైనా ప్రజాస్వామ్యంలో విచారణను ఎదుర్కోవాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తప్పు చేసిన వారికి శిక్షలు తప్పవని చెప్పారు. చట్టం ముందు అందరూ సమానులేనని, దీనికి ఎవరూ అతీతులు కారని వ్యాఖ్యానించారు. సోమవారం బంజారాహిల్స్‌లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన రావి నారాయణరెడ్డి జాతీయ పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2025 సంవత్సరానికి గాను ఈ పురస్కారానికి ఎంపికైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డికి అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.
ఇలాంటి వ్యక్తి జాతిపిత ఎలా అవుతారు?
‘కొన్ని రోజులుగా విదేశాల్లో ఉన్నప్పటికీ రాష్ట్రంలోని పరిస్థితులను క్షుణ్ణంగా గమనిస్తున్నా. ఈ మధ్య తెలంగాణ జాతిపిత అని వారికి వారే ఒకరికి టైటిల్ ఇచ్చుకున్నారు. మరికొందరు ఉద్యమకారులం అని చెప్పుకుంటున్నారు. ఓ కేసు విషయంలో పోలీసులు నోటీసు ఇస్తే తెలంగాణ జాతిపితకే నోటీసు ఇస్తారా? తెలంగాణ ఆత్మగౌరవాన్నే విచారణ చేస్తారా అంటూ ఎగిరిపడుతున్నారు. ప్రభుత్వంలో జరిగిన తప్పిదాల్లో ప్రమేయం ఉన్న వారిని ప్రభుత్వం తప్పకుండా విచారిస్తుంది. వయసురీత్యా విచారణకు హాజరు కాలేనంటే తన ఇంట్లోనే విచారిస్తామని పోలీసులు చెప్పారు. అలాకాకుండా ఫాంహౌస్‌లో ఉంటా.. బాత్రూంలో దాక్కుంటానంటే కుదరదు కదా. విచారణ కోసం నోటీసు మాత్రమే ఇచ్చారు.. తలుపులు బద్ధలు కొట్టి ఈడ్చుకెళ్లలేదు.
తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి ప్రొఫెసర్ కోదండరాం. అలాంటి వ్యక్తి ఇంటి తలుపులు బద్ధలు కొట్టి ఈడ్చుకెళ్లి అరెస్టు చేసింది ఎవరి పాలనలో? తెలంగాణ సాయుధ పోరాటంలో రావి నారాయణరెడ్డి లాంటి వారు సర్వం కోల్పోయారు. 500 ఎకరాల భూమిని పేదలకు దానం చేశారు. ఆస్తులను కూడా ప్రజల కోసం త్యాగం చేశారు. కానీ ఇప్పుడు జాతిపితగా చెప్పుకునే వ్యక్తి కుటుంబం మాత్రం వేలకోట్ల ఆస్తులు సంపాదించుకుంది. అన్ని పదవులను దక్కించుకుంది. పేపర్లు, టీవీలు, కంపెనీలు, వ్యాపార సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకుంది. ఇలాంటి వ్యక్తి జాతిపిత, ఆయన వారసులు ఉద్యమకారులు ఎలా అవుతారు?
ఇప్పుడు అలాంటి రోజులు కావు..
ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినప్పుడు అర్థం చేసుకోవాలి. హుందాగా తప్పుకుంటే కొంతైనా గౌరవం దక్కేది. అలాకాకుండా ఓట్లు వేయకుండా ప్రజలే తప్పు చేశారని అనడం.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ఇదెక్కడి ఉద్యమకారుడి లక్షణం? ఇదెక్కడి జాతిపిత విధానం? అక్రమ మార్గం ఎంచుకున్న వారు ప్రజాస్వామ్యంలో విచారణ ఎదుర్కోవాల్సిందే అని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ చెప్పారు. జార్ఖండ్ రాష్ట్రం సాధించి ముఖ్యమంత్రిగా పనిచేసిన శిబు సోరెన్, దేశంలో సీఎంలుగా పనిచేసిన జయలలిత, యడ్యూరప్ప, లాలూప్రసాద్ యాదవ్ లాంటి వాళ్లుకూడా విచారణ ఎదర్కొన్నారు. మనమేం దైవాంశ సంభూతులం కాదు. మధ్యయుగం కాలంలో చక్రవర్తి, రాజుకు బాధ వస్తే రాజ్యానికే బాధ వచ్చినట్లు ప్రచారం చేసేవారు. ఇప్పుడు అలాంటి రోజులు కావు. ప్రజాస్వామ్యంలో తప్పు చేసినవారు విచారణ ఎదుర్కోవాల్సిందే..’ అని ముఖ్యమంత్రి అన్నారు.
తెలంగాణకు వన్నె తెచ్చిన వ్యక్తి రావి నారాయణరెడ్డి
‘స్వతంత్ర భారత దేశంలో తొలిసారిగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి తెలంగాణ ఖ్యాతిని దేశం మొత్తానికి చాటిన వ్యక్తి రావి నారాయణరెడ్డి. భారత తొలి ప్రధానిగా ఎన్నికైన జవహర్‌లాల్ నెహ్రూ కంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది. దీంతో పార్లమెంటు భవనాన్ని రావి నారాయణరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. రాచరిక పాలనకు వ్యతిరేకంగా నారాయణరెడ్డి పోరాడారు. బండి యాదగిరి లాంటి నిరక్షరాస్యులను ప్రభావితం చేశారు. అరవై ఏళ్ల వయసులో ప్రజలకు స్ఫూర్తినిస్తూ పార్టీ, రాజకీయ పదవుల నుంచి తప్పుకున్న గొప్ప వ్యక్తి. ఈ కాలంలో ప్రజలు ఓడించినా కొందరు పదవులు వదులుకోవడానికి సిద్ధంగా ఉండటం లేదు. ప్రజా ప్రభుత్వం రావి నారాయణరెడ్డికి సముచిత స్థానం కల్పించేందుకు చర్యలు తీసుకుంటుంది.
మార్పులు గౌరవించిన నేతలు నారాయణరెడ్డి, జైపాల్‌రెడ్డి
రావి నారాయణరెడ్డి జాతీయ పురస్కారం జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డికి దక్కడం గౌరవప్రదం. తొలి తరంలో బూర్గుల రామకృష్ణారావు, రావి నారాయణరెడ్డి స్ఫూర్తినిస్తేం.. మలితరంలో సూదిని జైపాల్‌రెడ్డి, బి.సుదర్శన్‌రెడ్డి లాంటి వాళ్లు తెలంగాణ సమాజానికి ఒక స్ఫూర్తిగా నిలిచారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలని జైపాల్‌రెడ్డిని కోరాను. తరం మారింది.. ప్రత్యక్ష రాజకీయాలకు నేను దూరం. మీలాంటి యువతరం రాజకీయాల్లో ఉండాలంటూ ఆయన నన్ను ప్రోత్సహించారు. సమాజంలో వస్తున్న మార్పులను, ప్రజల ఆలోచనను గౌరవించిన గొప్ప నాయకులు రావి నారాయణరెడ్డి, జైపాల్‌రెడ్డి. దున్నే వాడికే భూమి అని కమ్యూనిస్టులు పోరాడితే పేదలకు భూములు పంచింది కాంగ్రెస్సే..’ అని సీఎం చెప్పారు. రాజ్యాంగాన్ని రద్దు చేయడమే బీజేపీ రహస్య ఎజెండా అని, రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును కాలరాసేందుకే ఎస్‌ఐఆర్‌ను తీసుకువచ్చిందని ధ్వజమెత్తారు. ఓటు హక్కును కాలరాసేందుకు బీజేపీ చేస్తున్న కుట్రపై కమ్యూనిస్టులు గ్రామాల్లో చైతన్యం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
‘తెలంగాణ నగ్నసత్యం’పై పరిశోధన జరగాలి: జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
రావి నారాయణరెడ్డి రచించిన ‘తెలంగాణ నగ్నసత్యం’ పుస్తకంపై పరిశోధన జరగాల్సిన అవసరం ఉందని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఇప్పటివరకు ఆ పుస్తకంపై పీహెచ్‌డీ విద్యార్థులు పరిశోధన చేయలేదని, ఏదైనా యూనివర్సిటీ నుంచి దీనిపై పరిశోధన చేస్తే ఎన్నో విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. రాజ్యాంగానికి తొలిసారి జరిగిన సవరణల్లో రావి నారాయణరెడ్డి కీలకంగా వ్యవహరించారని తెలిపారు. రెచ్చగొట్టే ఉపన్యాసాలు సరికాదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, నెల్లికంటి సత్యం, ఎమ్మెల్యే కుంభం అనిల్, సీపీఐ సీనియర్ నాయకులు కె.నారాయణ, ఆ పార్టీ నేతలు పల్లా వెంకట్‌రెడ్డి, చాడ వెంకట్‌రెడ్డి, రావి నారాయణరెడ్డి ట్రస్ట్ చైర్మన్ రావి ప్రతిభా భారతి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


