కట్టుకున్న భార్యపై ఖాకీ దాష్టీకం | incident in Mancherial: Constable brutally beats wife on road | Sakshi
Sakshi News home page

కట్టుకున్న భార్యపై ఖాకీ దాష్టీకం

Feb 3 2026 12:47 AM | Updated on Feb 3 2026 12:49 AM

incident in Mancherial: Constable brutally beats wife on road

భార్యను చితకబాదిన కానిస్టేబుల్‌ రవిప్రసాద్‌

రోడ్డుపై భార్యను విచక్షణారహితంగా చితకబాదిన కానిస్టేబుల్‌ 

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో 

మంచిర్యాల క్రైం: క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు శాఖలో పని చేస్తున్న ఓ కానిస్టేబుల్‌ ఆ శాఖకు మచ్చతెచ్చాడు. కట్టుకున్న భార్యను రోడ్డుపై విచక్షణారహితంగా చితకబాదాడు. మంచిర్యాల రెడ్డికాలనీలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనపై వీడియో సోమవారం వైరల్‌గా మారింది. స్థానిక పోలీసు స్టేషన్‌లోని కానిస్టేబుల్‌ రవిప్రసాద్‌ ఆదివారం రాత్రి భార్యతో గొడవపడ్డాడు. నాలుగు గోడల నడుమ ఇద్దరి మధ్య జరిగిన గొడవ కాస్తా అర్ధరాత్రి రోడ్డుపైకి చేరింది. అర్ధనగ్నంగా ఉన్న అతడు భార్యతోపాటు కూతురిని కూడా రోడ్డుపై చితకబాదాడు. ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పుకుంటున్న పోలీసు శాఖలోని వ్యక్తి ఇలాంటి ఘటనలకు పాల్పడటం, కట్టుకున్న భార్యపై కాఠిన్యాన్ని ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. రవిప్రసాద్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తుండగా.. ఆయన భార్య పోలీసుశాఖలోని మరో విభాగంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తోంది. మహిళలకు భద్రత కల్పించాల్సిన పోలీసు.. భార్యను రోడ్డుపైకీడ్చిన దాష్టికాన్ని నగరవాసులు చర్చించుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై స్థానిక సీఐ ప్రమోద్‌రావును సంప్రదించగా విషయం తెలిసిందని, కుటుంబ సమస్య అయినందున ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement