10.60 లక్షల ఎకరాల్లో సాగైన మొక్కజొన్న పంట
గత ఐదేళ్లలో యాసంగిలో అత్యధిక సాగు ఈ సీజన్‌లోనే
మరింత పెరిగే అవకాశం ఉందంటున్న వ్యవసాయ శాఖ
ఇప్పటి వరకు 41.50 లక్షల ఎకరాల్లో పూర్తయిన వరి సాగు
60 లక్షల ఎకరాల మార్కును దాటే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మొక్కజొన్న పంట ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో సాగవుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 10.60 లక్షల ఎకరాల్లో రైతులు మక్కలను సాగు చేయగా, అది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ చెపుతోంది. రైతులు పండించిన మక్కలకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర రాకపోయినా, రాష్ట్ర ప్రభుత్వమే కనీస మద్ధతు ధర ఇచ్చి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తుండడం, దిగుబడి కూడా పెరిగిన నేపథ్యంలో రైతులు ఈ పంట వైపు ఆసక్తి చూపుతున్నారు.
సాధారణంగా చాలా జిల్లాల్లో వరి సాగు చేస్తే మార్చి నాటికి సాగునీరు అందదని భావిస్తేనే రైతులు ఆరుతడి పంట కింద మొక్కజొన్నను సాగు చేయడం తెలంగాణలో రివాజు. అయితే సాగునీటి లభ్యత ఉన్న మండలాల్లో కూడా మొక్కజొన్న సాగు పెరగడం రైతుల్లో వస్తున్న మార్పును సూచిస్తోంది. అయితే పండించిన పంటలకు గత సంవత్సరం బహిరంగ మార్కెట్‌లో రూ.2,100 వరకు మాత్రమే పలకగా, మార్క్‌ఫెడ్ రూ. 2,400 చొప్పున మద్ధతు ధర ఇచ్చి కొనుగోలు చేయడంతో రైతులు ఈ పంట వైపు ఆసక్తి చూపుతున్నారు.
10 జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగు
రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 1.55 లక్షల ఎకరాల్లో ఈసారి మక్కలు సాగు చేశారు. ఆ తరువాత స్థానంలో నాగర్‌కర్నూలు (1.10 లక్షల ఎకరాలు), మహబూబాబాద్ (1.02 లక్షలు), నిర్మల్ (99 వేలు), వరంగల్ (96 వేలు)తో పాటు కొత్తగూడెం, గద్వాల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్ వంటి పది జిల్లాలలో 27వేల ఎకరాల నుంచి 70వేల ఎకరాల వరకు సాగైంది. మిగతా జిల్లాల్లో కూడా వేల ఎకరాల్లోనే మొక్కజొన్న సాగు చేసిన నేపథ్యంలో ఈసారి విస్తీర్ణం 10.60 లక్షల ఎకరాల మార్కును దాటింది.
రాబోయే రోజుల్లో మరింత విస్తీర్ణంలో మొక్కజొన్న సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెపుతున్నారు. రాష్ట్రంలో వరి తరువాత అత్యధికంగా మొక్కజొన్న పంట సాగునే చెప్పుకోవచ్చు. ఆ తరువాత స్థానాల్లో జొన్నలను 2.07 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, పచ్చి శనగ 1.78 లక్షల ఎకరాల్లో సాగైంది. మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ఒకప్పుడు అత్యధికంగా సాగయ్యే వేరుశనగ ఈ సీజన్‌లో కేవలం 1.80 లక్షల ఎకరాలకే పరిమితమైంది.
భారీగా పెరగనున్న వరిసాగు విస్తీర్ణం
రాష్ట్రంలో ఇప్పటి వరకు 59 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా, అందులో 10.60 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న కాగా, 41.50 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. వరి యాసంగి సాధారణ సాగు అంచనా 51.48 లక్షల ఎకరాలు కాగా, పెరిగిన నీటి వనరులతో యాసంగిలో 2022–23 నుంచి వరిసాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. 2022–23లో 57.45 లక్షల ఎకరాలు, 2023–34లో 52.03 లక్షల ఎకరాలు, 2024–25లో 60.26 లక్షల ఎకరాల్లో వరిసాగైంది. ఈసారి కూడా మరో 20 లక్షల ఎకరాల్లో వరి సాగైతే, 60 లక్షల ఎకరాల మార్కును దాటే అవకాశం ఉంది.
మెదక్, వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో ఇంకా 20 నుంచి 40 శాతం వరకు వరినాట్లు పూర్తి కావలసి ఉంది. నల్లగొండ, నిజామాబాద్‌తో పాటు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలలో మాత్రమే 80 శాతం నుంచి 100 శాతం వరకు పూర్తయింది. దీంతో ఈ యాసంగి సీజన్‌లో వరి పంట రికార్డు స్థాయిలో ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. కాగా రాష్ట్రంలో పొగాకు సాగు విస్తీర్ణం కూడా రెండు మూడేళ్లుగా పెరుగుతుండడం గమనార్హం. నిజామాబాద్, గద్వాల, జనగామ, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా పొగాకును సాగు చేస్తున్నారు. గత సంవత్సరం 17,552 ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి ఇప్పటికే 10,581 ఎకరాల్లో పోగాకు సాగైనట్లు వ్యవసాయశాఖ తెలిపింది.


