సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సిట్ నోటీసులు, విచారణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చేసిన తప్పులకు నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజానికి నోటీసులు ఇచ్చినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు.
రావి నారాయణరెడ్డి జాతీయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘ఉద్యమకారుడిని అవమానిస్తారా? అని గగ్గోలు పెడుతున్నారు. ఉద్యమకారులు అనే పదాలు వారే రాసుకుంటున్నారు. నిజమైన తెలంగాణ జాతిపిత అయితే దేనికి ఆదర్శం. కోదండరామ్ తెలంగాణ ఉద్యమకారుడు కాదా?. ఉద్యమాలు నడపలేదా?. ఆయనను ఎందుకు అరెస్ట్ చేశారు?. గత బీఆర్‌ఎస్ హయాంలో ఉద్యమకారులను అవమానించలేదా?. మీ ఇంటి తలుపులు బద్దలు కొట్టలేదు.. మిమ్మల్ని ఎవరూ ఈడ్చుకెళ్లలేదు.
రాష్ట్రంలో పదవులన్నీ తీసుకున్నారు. భూములు పంచుకున్నారు. కాంట్రాక్టులు పంచుకుని.. చేయాల్సిన తప్పులన్నీ చేశారు. తప్పు చేస్తే విచారణ తప్పదు.. విచారణ చేయొద్దని ఎక్కడా లేదు. ఇప్పుడు చేసిన తప్పులకే నోటీసులు ఇచ్చారు. శిబూ సోరేన్ విచారణ ఎదుర్కోలేదా? అని ప్రశ్నించారు. రావి నారాయణ రెడ్డి లాంటి వారు తెలంగాణ కోసం సర్వం కోల్పోయారు. అక్రమ మార్గం ఎంచుకున్న వారు ప్రజాస్వామ్యంలో విచారణ ఎదుర్కోవాల్సిందే అని అంబేద్కర్ చెప్పారు అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో బీజేపీ ప్రభుత్వ విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును కాల రాయాలని బీజేపీ SIRను తీసుకువచ్చింది. ఓటు హక్కును కాలరాయాలన్న కుట్రపై కమ్యూనిస్టులు గ్రామాల్లో చైతన్యం తీసుకురావాలి. రాజ్యాంగంపై దాడి జరుగుతోంది.. దీనిపై మనమంతా ప్రజల్లో చైతన్యం కలిగించాలి అని చెప్పుకొచ్చారు.


