రంజాన్ తోఫాకు కార్పొరేట్ సొబగులు
ఆన్‌లైన్ మార్కెట్‌లో అనూహ్య మార్పులు
మతాలకతీతంగా ఇచ్చిపుచ్చుకునే ట్రెండ్
Ramadan 2026 విభిన్న ఆచారాలు, సంస్కృతుల నిలయం మన నగరం.. ఏ మంచి సంప్రదాయమైనా మతాలకు అతీతంగా అందరినీ ఆకట్టుకుంటుంది.. అది హలీమ్, ధమ్‌కా రోట్ వంటి వంటకాలు కావొచ్చు.. రంజాన్ తోఫా వంటి బహుమతులు ఇచ్చి పుచ్చుకునే పద్ధతులు కావొచ్చు.. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందిన వారిని ఒక చోట చేరుస్తున్న కార్పొరేట్ కల్చర్.. భౌగోళిక సరిహద్దులను మాత్రమే కాదు మతాల సరిహద్దులనూ తిరగరాస్తోంది. -సాక్షి, సిటీ బ్యూరో
రంజాన్ నెలలో ఉపవాసాలు పాటించి ఈద్–ఉల్–ఫిత్ర్ పండుగ సందర్భంగా పెద్దలు, పిల్లలకు తోచిన బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ.. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య బహుమతులు ఇచ్చిపుచ్చుకోవ డాన్ని ‘రంజాన్ తోఫా’ లేదా ‘ఈది’ గా పిలుస్తారు. ప్రేమ, కృతజ్ఞత, స్నేహ బంధాలను బలపరిచే ఒక చక్కని సంప్రదాయంగా స్థిరపడింది. నగదు రూపంలోనో దుస్తులు, సుగంధ ద్రవ్యాలు, ఆట వస్తువులు, గాడ్జెట్లు వంటి బహుమతులు ఇవ్వడం ఒకరిని ఒకరు కలుసుకొని ‘ఈద్ ముబారక్’ చెప్పుకుంటూ బహుమతులు పంచుకోవడం జరుగుతుంది. అయితే ఇటీవల ఈ రంజాన్ తోఫా సందడిలో భాగంగా కొత్త గిఫ్ట్ ఐడియాలు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా ఈ–కామర్స్ వృద్ధితో ఈద్ సమయంలో గిఫ్ట్‌ల ఎంపికలో విపరీతమైన మార్పులు చేర్పులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కొన్ని కార్పొరేట్ ఆఫీసులు తమ ఉద్యోగుల కోసం కూడా తోఫాలను అందిస్తుండటంతో మరిన్ని కొత్త సొబగులు సంతరించుకుంటున్నాయి.

ట్రెండింగ్ రంజాన్ గిఫ్ట్‌లు..
చాక్లెట్లు, అత్తర్, ప్రార్థనా మాలలతో తయారు చేసిన ప్రత్యేక గిఫ్ట్ బాక్స్‌లు ఇప్పుడు చాలా ప్రాచుర్యం
పొందుతున్నాయి.పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చే ప్రత్యేక ఖర్జూరాలను అందంగా ప్యాక్ చేసి
బహుమతిగా ఇవ్వడం ట్రెండ్‌గా మారింది.పేరు లేదా ఈద్ ముబారక్ మెసేజ్‌తో ఉన్న కప్పులు, ఫొటోఫ్రేమ్స్, కస్టమ్ గిఫ్ట్ బాక్స్‌లకు నగరంలో బాగా డిమాండ్ ఉంది.
కుర్తాలు, హిజాబ్‌లు, అబాయాలు, షాల్స్ వంటి ఫ్యాషన్ వస్తువులు కూడా బహుమతులుగా ఇచ్చి పుచ్చుకుంటున్నారు.
ఇస్లామిక్ సంప్రదాయంలో సువాసనలు ముఖ్యమైనవి కావడంతో అత్తర్ లేదా అరబిక్ పరిమళాలు కూడా ప్రముఖ గిఫ్ట్ ఎంపికలుగా మారాయి. (Ugadi 2026 ‘పరాభవ’అంటే అవమానం కాదు, ఇదీ అర్థం!)
చంద్రతార డిజైన్లతో ఉన్న లాంతర్లు, వాల్ హ్యాంగింగ్స్, ఖురాన్ ఆయతుల్లా కాలిగ్రఫీ ఫ్రేమ్స్ వంటి డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి.
రంజాన్ తోఫా కేవలం బంధువుల మధ్య బహుమతులు పంచుకోవడం మాత్రమే కాదు. కొన్ని ప్రాంతాల్లో పేద ముస్లిం కుటుంబాలకు ‘రంజాన్ తోఫా’ పేరుతో ఆర్థిక చేయూత అందిస్తుంటారు.

ఈ పండుగ సీజన్‌లో ఆలోచనాత్మకంగా రూపొందించిన గిఫ్ట్ బాక్సులు సిటీలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎంపికలో ఒకటిగా మారుతున్నాయి. నగరవ్యాప్తంగా ఇప్పుడు విభిన్న అభిరుచులు ప్రాధాన్యతకు అనుగుణంగా ఈద్–థీమ్ హ్యాంపర్లను వ్యాపార సంస్థలు ఆన్‌లైన్ వేదికలు రూపొందిస్తున్నాయి. కొన్ని డెజర్ట్‌లు పండుగ ప్రత్యేక వంటకాలతో నిండిన ఆహార–ఆధారిత బహుమతులపై దృష్టి సారిస్తుండగా, మరికొన్ని యాక్సెసరీలు వ్యక్తిగతీకరించిన వస్తువులతో కూడిన ఆహారేతర హ్యాంపర్లను అందిస్తున్నాయి. అందంగా ప్యాక్ చేసిన స్వీట్ల నుంచి సొగసైన మెమెంటో బాక్సుల వరకు, హ్యాంపర్లు ఈ సందర్భాన్ని జరుపు కోవడానికి అందుబాటులో ఉన్నాయి. ప్రేమ, సహానుభూతి, పంచుకునే భావనను ప్రతిబింబించే చిన్న బహుమతి అయినా పెద్ద ఆనందాన్ని పంచుతుంది. రంజాన్ పండుగను మరింత అర్థవంతంగా మారుస్తుంది.
ఇదీ చదవండి: చిలుక జ్యోతిష్యుడిని నమ్మి నిండా మునిగిన ఐటీ అధికారి


