షర్మిల మాటలు హద్దులు దాటుతున్నాయి: రాచమల్లు | Rachamallu Siva Prasad Reddy Comments On Sharmila And Sunitha | Sakshi
Sakshi News home page

షర్మిల మాటలు హద్దులు దాటుతున్నాయి: రాచమల్లు

Mar 19 2026 7:02 PM | Updated on Mar 19 2026 7:04 PM

Rachamallu Siva Prasad Reddy Comments On Sharmila And Sunitha

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: గత మూడు, నాలుగేళ్లుగా షర్మిల, సునీత.. వైఎస్‌ జగన్‌ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్న షర్మిలమ్మ మాట్లాడిన మాటలు హద్దులు దాటాయన్నారు. కనీస ఆలోచన లేకుండా హద్దులు దాటి సొంత అన్నపై వ్యక్తిత్వ దాడి చేసిందని ఆగ్రహం వ్యక్తం  చేశారు.

‘‘వైఎస్సార్‌ కుమార్తె, జగన్‌కు చెల్లెలు కదా అని మేం చాలా వరకూ మిన్నకుండిపోయాం. ఆమె నిన్న మాట్లాడుతూ అన్న అనే పదానికే నువ్వు కలంకం అన్నారు. ఈ మాట మమ్మల్ని చాలా బాధించింది. బట్ట కాల్చి మసి మీ అన్న ముఖాన వేసి తుడుచుకో అంటే ఒప్పుకోరు తల్లీ. అన్న అనే పదానికే ఆయన అనర్హుడు అన్న తర్వాత మీ అన్న మీకు చేసిన అన్యాయం ఏంటో మీరు చెప్పాలి. నువ్వు ఏదేదో మాట్లాడి బురద జల్లి పోతానంటే కుదరదు. నీ పట్ల మీ అన్న చేసిన అన్యాయం ఏంటో స్పష్టంగా తెలుగు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.’’ అని రాచమల్లు పేర్కొన్నారు.

‘‘మీ అన్నపై ఇంతటి విషాన్ని చిమ్మడానికి ఏం కారణం..? ఏమి నీకు అన్యాయం జరిగింది..?. నాలుగు గోడల మధ్య ఏదైనా సమస్యలుంటే పరిష్కరించుకోవాల్సింది. పోయి పులివెందుల పూల అంగళ్ల సర్కిల్‌లో పరిచినారు. మీ ఇంట్లో ఏదైనా చర్చించుకుంటే మరుసటి రోజే ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్‌ ఐటమ్‌గా వస్తుంది. ఇవన్నీ వారికి ఎవరు చెప్తున్నారు. షర్మిల, సునీతల ఫోన్లు పరిశీలిస్తే ఏబీఎన్‌ రాధాకృష్ణ, చంద్రబాబుతో టచ్‌లో ఉన్న విషయం ఇట్లే బయటపడుతుంది.  మీ తండ్రి చనిపోతే సంతోషించిన చంద్రబాబు లాంటి వ్యక్తితో మీరు చెలిమి చేస్తారా?. అన్న అనే పదానికే కళంకం తెచ్చాడంటున్న నీవు నీకు ఏ విషయంలో అన్యాయం చేశాడు..?’’ అంటూ రాచమల్లు ప్రశ్నించారు.

‘‘ఆస్తి విషయంలో చేశాడా..? అధికారం విషయంలో అన్యాయం చేశాడా..?. వైఎస్సార్‌ 2004లో అఫిడవిట్‌లో చూపించిన ఆస్తులు 2009లో లేవు. ఈ మధ్య కాలంలో రాజశేఖరరెడ్డి తన ఆస్తులను నీకు, జగన్‌కు పంచేశారు. మీ తండ్రి చట్ట ప్రకారం మీ అన్నకు, నీకు సమానంగా ఆస్తులు పంచారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2లోని ఇళ్లు షర్మిలమ్మకే ఇచ్చారు. ఇడుపులపాయలో 51 ఎకరా వ్యవసాయ భూమిని షర్మిల పేరుతో రిజిస్టర్‌ చేయించారు. 15 మెగావాట్ల ఎస్సారెస్‌ స్మాల్‌ హైడ్రో ప్రాజెక్టు ఆమెకే ఇచ్చారు. స్వస్తిక్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్టునూ ఆమెకే ఇచ్చాడు.

..విజయవాడ యువరాజ్‌ థియేటర్‌లో 36 శాతం భాగం షర్మిలమ్మకే రాసిచ్చాడు. పులివెందులలో 7 ఎకరాల 60 సెంట్ల స్థలాన్ని ఆమెకే రాసిచ్చారు. విజయలక్ష్మి ట్రేడ్‌ అండ్‌ మినరల్స్‌ వంద శాతం వాటా ఆమెకే ఇచ్చేశారు. రాజారెడ్డి గారి హయాం నుంచి రైల్వే కోడూరులో ఉన్న ఇంటిని కూడా ఆమెకే రాసిచ్చాడు. రైల్వే కోడూరు మండలం శెట్టిగుంటలో 90 ఎకరాల వ్యవసాయ భూమిని ఆమెకే ఇచ్చారు. ఇలా నీకు సగం వాటాను ఇస్తుంటే అంగీకరించడం అనేది జగన్‌ గొప్పతనం. మీరిద్దరూ ఒకే కడుపున పుట్టారు కాబట్టి మీ అన్న ఒప్పుకున్నాడు అంటే సరే.. మీ వదిన ఎలా ఒప్పుకుంది..?

..సమాజంలో ఏ ఇంటి కోడలూ ఆడబిడ్డకు సమాన ఆస్తి ఇస్తే అంగీకరిస్తుందా..?. అయినా భారతమ్మ ఒప్పుకున్నారు అంటే మీ తండ్రి, మీ అన్న కంటే వెయ్యి రెట్లు ఆమె గొప్పది. ఇన్ని ఆస్తులు తీసుకున్నందుకేనా వైఎస్‌ జగన్‌ అన్న అనే పదానికి కళంకం...?. వైఎస్సార్‌ మరణించినప్పటి నుంచీ నువ్వు జగన్‌తో విభేదించే వరకూ తాను సంపాదించుకున్న దాంట్లో జగన్‌ నీకు రూ.236 కోట్లు ఇచ్చారు.

..అయినా మీరు ఆయన వ్యక్తిత్వంపై దాడి చేస్తూ మా అన్న దుర్మార్గుడు అంటున్నారు. మీ అన్న ముఖ్యమంత్రిగా చేసిన పనులకు దేశమంతా పొగుడుతుంటే నువ్వు విమర్శలు చేశావు. అవన్నీ చాలవన్నట్లు వివేకానందరెడ్డి హత్య రక్తపు మరకలను జగన్‌ నెత్తిన వేసి ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేసేందుకు ఇంత నిందలు వేస్తావా..?. ఇవన్నీ చాలవన్నట్లు చంద్రబాబుతో చెలిమి చేస్తూ.. ఏబీఎన్‌ రాధాకృష్ణకు ఉప్పందించి బజారుకీడుస్తావా...?. నీకు ఎక్కడ న్యాయం ఉంది.. ఎక్కడ కృతజ్ఞత ఉందమ్మా నీకు..?. నీ స్థానంలో ఏ చెల్లి ఉన్నా జగన్‌ లాంటి అన్నను గుండెల్లో పెట్టుకుని ఉండేవారు.

..నువ్వు కొంగుపట్టుకుని జగన్‌కి, అవినాష్‌కి ఓటు వేయవద్దని పులివెందుల పూలఅంగళ్ల సర్కిల్లో అర్థించావు. అవినాష్‌ రెడ్డి వివేకాను చంపి ఉంటే నాకు ఓటు వేయండి.. లేదంటే అవినాష్‌కు ఓటు వేయండి అని కొంగుపట్టి మరీ అడిగావు. నువ్వు చెప్పిన మాటలు ప్రజలు నమ్మారా? అవినాష్‌రెడ్డి గెలిచాడు. నువ్వు చెప్పిన తప్పుడు మాటల వల్ల జిల్లాలో మేం ఐదుమంది ఎమ్మెల్యేలం ఓడిపోయాం. నీ లెక్క ప్రకారం వివేకా హత్యలో అవినాష్‌రెడ్డికి సంబంధం లేదని ప్రజలు నమ్మారు కాబట్టే ప్రజలు ఆయన్ను గెలిపించారు.

..అంతటితో ఆగకుండా చంద్రబాబు ఏ కీ ఇస్తే దాన్ని సునీతమ్మ మాట్లాడుతుంది. మూడు నాలుగు రోజుల తర్వాత మీరొచ్చి అవే మాటలు మాట్లాడతారు. జగన్‌ వ్యక్తిత్వాన్ని హననం చేసి ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనేదే మీ లక్ష్యం. నీకు ఆస్తి పంపకానికి ఒప్పుకుని, సొంతంగా డబ్బిచ్చి.. తన సొంత ఆస్తుల నుంచి కూడా నీకు భాగాలిస్తే.. నీకు సంతృప్తి లేదు. సరస్వతి భూముల విషయంలో ఆమె చేసిన వ్యవహారం వింటే చాలా బాధ కలుగుతుంది.

..జగన్‌పై కేసుల కారణంగా ఆ భూములు అటాచ్‌మెంటులో ఉంటే.. దానిలోని విజయమ్మ పేరుపై ఉన్న భూములను తన పేరుపై రాయించుకోవాలని చూశారు. దాని కోసం ఆ షేర్‌ కాగితాలు పోయాయని కేసు పెట్టి.. ఆ తర్వాత విజయమ్మ ఆస్తిని తన పేరుపై బదలాయింపు చేసుకుంది. ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తిని బదలాయింపు చేయకూడదని అందరికీ తెలుసు. అలా చేస్తే వైఎస్‌ జగన్‌ బెయిల్‌ రద్దు అవుతుందని కూడా అందరికీ తెలుసు. అయినా బదలాయింపు చేశావంటే.. మీ అన్న మళ్లీ జైలుకు పోవాలనేగా..?

..పగోడు పదహారు నెలలు జైల్లో పెడితే.. చెల్లెలు 32 నెలలు జైల్‌లో పెట్టాలనుకుంది. వైఎస్‌ జగన్‌ ఆ విషయం తెలుసుకుని ఎన్సీఎల్టీకి వెళ్లి జాగ్రత్త పడ్డాడు. ఆ కేసులో షర్మిలమ్మ ఓడిపోయింది. మళ్లీ విజయమ్మతో చెన్నై కోర్టులో కేసు వేయించింది. ఆ కేసు కాగితాలు చెన్నై కోర్టులో వేయించిన గంటకే చంద్రబాబు చేతిలో ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతి ఒక్క విషయం చంద్రబాబు, ఏబీఎన్‌ రాధాకృష్ణలకు తెలుసు. షర్మిల, సునీతలు జగన్‌కు ఒక్క చెల్లెల్లే. కానీ రాష్ట్రంలో కోటి మంది మహిళలు ఆయనకు ఓటేశారు. వారంతా వైఎస్‌ జగన్‌ మాకు దేవుడిచ్చిన అన్న అంటున్నారు.

..వాళ్లంతా దేవుడిచ్చిన అన్న అంటుంటే రక్త సంబంధం కలిగిన నీకు మాత్రం కళంకితుడా..?. ఈ రాష్ట్రంలో షర్మిలమ్మ, సునీతలను చూసిన తర్వాత చెల్లెల్లు అంటే భయపడే పరిస్థితికి వచ్చింది. నీలాంటి చెల్లెలు కావాలని ఏ అన్నా కోరుకోడు. వారి వారి స్థాయిని బట్టి నువ్వొక్కదానివే కాదు. .మేమంతా పార్టీ కోసం కష్టపడ్డాం. షర్మిలమ్మ జగన్‌తో గొడవ పడకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి పదవినే పంచాలి. అప్పుడే ఆమె శాంతిస్తుంది. ఇప్పుడు జగన్‌ పెట్టుబడులు, ఆస్తులు మొత్తం ఊడ్చి షర్మిలకు ఇస్తే అప్పుడు శాంతిస్తుందేమో..?. ఎక్కడన్నా జగన్‌ వ్యాపారాల్లో నువ్వు పెట్టుబడి పెట్టావా..? ఏమీ లేకపోయినా తన సొంత సంపాదనలో నీకు వాటా ఇచ్చాడు.

..మీరు టీడీపీ కండువా కప్పుకోకపోయినా.. సైకిల్‌ ఎక్కకపోయినా మీరు మాత్రం టీడీపీనే. వైఎస్సార్‌ కూతురు ఇలా టీడీపీకి వెళ్తుందని మేము కలలో కూడా ఊహించలేదు. రాష్ట్రంలో చంద్రబాబు ఇన్ని తప్పులు చేస్తున్నా, లక్షల కోట్ల అప్పులు చేస్తున్నా ఆమె ఒక్క మాట కూడా విమర్శించదు. ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న వ్యక్తిని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా ప్రశ్నించాల్సిన నువ్వు జగన్‌ను టార్గెట్‌ చేస్తున్నావు. ఇక మీదట మీరు జగన్‌ వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఎన్ని సార్లైనా మిమ్మల్ని ప్రశ్నిస్తాను. ఇక మా దృష్టిలో మీరు రాజశేఖరరెడ్డి కూతురు అని కానీ, జగన్‌ చెల్లెలు అని కాని ఉండదు. నాకైతే నువ్వు ఒక చెడ్డ చెల్లెలు అనే అభిప్రాయం మాత్రమే ఉంది. ఇంత మేలు చేసిన అన్నను పట్టుకుని అన్ననే పదానికే కళంకం అంటావా..?

..చంద్రబాబుకు ఒక చెల్లెలు ఉందన్న విషయమే ప్రపంచానికి తెలియదు. అలాంటి చంద్రబాబు వద్దకు మాకు న్యాయం చేయండి అని ఈ చెల్లెల్లు వెళ్లారు. ఇదిగో నా చెల్లెలు షర్మిల.. నేను వదిలిన రామబాణం అని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి జగన్‌. నువ్వు ఇన్ని మాటలు ఆయన్ను మాట్లాడుతున్నా ఒక్క రోజు కూడా జగన్‌ నీపై నోరెత్తలేదు. అది ఆయన సంస్కారం.. నా చెల్లిపై మాట్లాడితే అది నాకే కదా అవమానం అనుకున్నాడు జగన్‌. కానీ మీరు ఒకే సారి వంద ఈటెలు తీసుకుని పొడిచినట్లు చేస్తున్నారు.

..తల్లికి చెల్లికి న్యాయం చేయలేనోడని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. చంద్రబాబూ అసలు నీ చెల్లెలు ఎవరో ఈ సమాజానికి తెలుసునా..?. చంద్రబాబుకు తమ్ముడున్నాడని తెలుసు.. ఆయన ఎలా చనిపోయాడో కూడా ప్రజలకు తెలుసు. చంద్రబాబుకు కుటుంబ వ్యవస్థపై గౌరవం ఉందా..? అలా ఉంటే హరికృష్ణకు, ఆయన పిల్లలకు అన్యాయం చేస్తాడా?. సొంత వారినే మోసం చేసిన చంద్రబాబు.. షర్మిలమ్మ, సునీతమ్మలకు న్యాయం చేస్తాడా..?. మీ ఇద్దరిని నడి ఏట్లోకి తీసుకెళ్లి ముంచేస్తాడు.. గుర్తుంచుకోండి.

..5 కోట్ల మంది ప్రజలను, సొంత కుటుంబ సభ్యులను మోసం చేసిన చంద్రబాబుకు షర్మిల, సునీతలను మోసం చేయడం ఒక లెక్కా?. ఆ చంద్రబాబు చేతిలో మోసం పోయి చిట్టచివరకు మళ్లీ ఆ అన్న వద్దకే మీరిద్దరూ చేరతారు. అన్నా.. తప్పయిందని ప్రాయశ్చిత్తం మీ అన్నా, వదిలనల వద్దకే వచ్చే రోజు ముందుంది. షర్మిలమ్మ.. అన్నతో సమానంగా వైఎస్సార్‌ ఆస్తులు పంచిన విషయంపై సమాధానం చెప్పాలి. నీకు అవసరం అయినప్పుడల్లా రూ.236 కోట్లు ఇచ్చినది నిజమా? కాదా? అనేది షర్మిల చెప్పాలి. జగన్, భారతీలు వివేకాను చంపారని మీరు మీ పిల్లలపై ఒట్టేసి చెప్పగలరా?. చంద్రబాబుకు కష్టం వచ్చినప్పుడల్లా.. డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా సునీత, షర్మిల తెరమీదకు వస్తారు.

..నిజంగా షర్మిలమ్మకు చిత్తశుద్ధి ఉంటే మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మాట్లాడితే నీ సైతాన్‌ సైన్యం అంటున్నారు.. కానీ నువ్వు జగన్‌కు రక్తం పంచుకుపుట్టిన చెల్లివి అయినా.. మేం రక్తం పంచుకోకపోయినా చివరికి వరకూ ఆయన కోసం, ఆయన వెంటే ఉంటాం. ఆస్తులకు మీరు భాగస్థులు.. కానీ మేం అభిమానానికి భాగస్థులం.. సైతాన్‌ సైన్యం కానే కాము. జగన్‌ కోసం ప్రాణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న మమ్మల్ని పట్టుకుని సైతాన్‌ అంటారా..?. మన ఇంటి గుట్టును ఏబీఎన్‌ రాధాకృష్ణకు, చంద్రబాబుకు ఇస్తున్న మీరు తప్పు చేసిన మనుషులు. అన్ననే పదానికి కళంకం అన్నందుకు బాధతో మేం మాట్లాడుతున్నాం. అన్న అనే పదానికి, వదిన అనే పదానికి అర్థం చెప్పిన వాళ్లు జగన్, భారతమ్మలు. షర్మిలమ్మ ప్రెస్‌మీట్‌ పెట్టి వీటన్నిటికీ సమాధానం చెప్పాలి’’ అని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement