ఎలుగుబంటి స్వైరవిహారం.. 100 పాఠశాలలు మూసివేత! | Bear Terror In Japan, Nearly 100 Schools Closed In Utsunomiya After Bear Enters Urban Areas | Sakshi
Sakshi News home page

ఎలుగుబంటి స్వైరవిహారం.. 100 పాఠశాలలు మూసివేత!

Jun 9 2026 9:47 AM | Updated on Jun 9 2026 11:29 AM

Bear Terror in Japan: 100 Schools Shut Down

ఉత్సునోమియా: జపాన్‌లోని ఒక ప్రముఖ నగరంలో ఎలుగుబంటి సంచారం స్థానికులను వణకిస్తోంది. గత మూడు రోజులుగా వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్న ఒక అడవి ఎలుగుబంటి, తీవ్ర భయాందోళనలను సృష్టించింది. ఈ అత్యవసర పరిస్థితి కారణంగా అధికారులు రంగంలోకి దిగి, నగరంలోని దాదాపు 100 పాఠశాలలను తక్షణమే మూసివేయాలని ఆదేశించారు. వందలాది మంది పోలీసులు, వేటగాళ్లు ఆ వన్యప్రాణిని పట్టుకోవడానికి తీవ్రంగా గాలిస్తున్నారు.

జపాన్ నగరంలో హై అలర్ట్ 
టోక్యోకు ఉత్తరాన ఉన్న ఉత్సునోమియా (Utsunomiya) నగరంలో శనివారం నుండి ఎలుగుబంటి సంచారానికి సంబంధించి పలు ఫిర్యాదులు అందాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం సోమవారం నాడు 94 ప్రభుత్వ ప్రాథమిక, జూనియర్ హైస్కూళ్లను మూసివేసింది. ఎలుగుబంటి తిరుగుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక వాహనాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని,  బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

మార్కెట్లు, పాఠశాలల్లో కలకలం 
పట్టణ కేంద్రానికి ఉత్తరాన శనివారం ఉదయం ఎలుగుబంటి మొదటిసారిగా కనిపించింది. ఆ తర్వాత అది నివాస ప్రాంతాలు, ఒక షాపింగ్ ఆర్కేడ్, ఆపై ఒక పార్క్, హైస్కూల్ పరిసరాల్లో సంచరించినట్లు స్థానికులు గుర్తించారు. చివరిగా సోమవారం ఉదయం ఒక హోల్‌సేల్ మార్కెట్ సమీపంలో ఎలుగుబంటి కనిపించడంతో నగరవ్యాప్తంగా ఆందోళన మరింత పెరిగింది. అయితే ఇవన్నీ ఒకే ఎలుగుబంటికి సంబంధించిన ఆనవాళ్లా లేదా  ఇంకా ఉ‍న్నాయా  అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

పెరుగుతున్న ఎలుగుబంట్ల దాడులు 
జపాన్‌లో ఇటీవలి కాలంలో అడవి ఎలుగుబంట్లు జనావాసాల్లోకి రావడం, దాడులకు తెగబడటం గణనీయంగా పెరిగింది. గత ఏడాది దేశవ్యాప్తంగా ఎలుగుబంట్ల దాడుల కారణంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆకలితో ఇవి నగరాలపై పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది మార్చి నాటికి జపాన్ వ్యాప్తంగా 50 వేలకుపైగా ఎలుగుబంట్ల సంచార కేసులు నమోదయ్యాయి. 5.1 లక్షల జనాభా ఉన్న ఉత్సునోమియా నగరం ఎలుగుబంట్లు తిరుగుతుంటం స్థానికులకు ఆందోళనకు గురిచేస్తోంది.

ఇది కూడా చదవండి: టిఫిన్ బాక్స్‌లో గొడ్డు మాంసం.. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశం

Advertisement
 
Advertisement
Advertisement