సియోల్: ఒకటి కాదు.. రెండు కాదు... వంద కూడా కాదు! దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు! ఇదీ దక్షిణ కొరియాకు చెందిన చెయ్–టే–వోన్ తన మాజీ భార్యకు చెల్లించాల్సిన సెటిల్మెంట్ మొత్తం! ఈ మేరకు సియో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి... దక్షిణ కొరియాకు చెందిన భారీ టెక్ కంపెనీ ఎస్‌కే గ్రూపు ఛైర్మన్ ఛేయ్–టే–వోన్. దేశ మాజీ ప్రధాని రో–టే–వూ కూతురు రో–సో–యాంగ్‌ను 1988లో పెళ్లి చేసుకున్నాడు.
వీరికి ముగ్గురు పిల్లలు కూడా. అయితే తనకు ఇంకో మహిళతో సంబంధం ఉందని, బిడ్డ కూడా పుట్టిందని తెలిపిన ఛేయ్ 2017లో విడాకుల కోసం కోర్టుకెక్కాడు. విచారణ తరువాత హైకోర్టు గత ఏడాది తీర్పునిస్తూ రో–సో–యాంగ్‌కు సెటిల్మెంట్ కింద 130 కోట్ల వాన్‌లు (రూ.8563 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. భరణం కింద చెల్లించాల్సిన 200 కోట్ల వోన్‌లు దీనికి అదనం. అయితే సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాలని కోరడంతో మరోసారి విచారణ జరిగింది.
ఛేయ్ చెల్లించాల్సిన సెటిల్మెంట్ మొత్తం సుమారు ఆరువేల కోట్ల రూపాయలకు తగ్గింది. రో–సో–యాంగ్ తండ్రి ప్రధానిగా ఉండగా ఎస్‌కే గ్రూపుకు సుమారు 3000 కోట్ల వాన్‌లు అక్రమంగా చెల్లించాడని హైకోర్టు గుర్తించింది. అయితే ఆ మొత్తాన్ని కంపెనీ వృద్ధికి చట్టబద్ధంగా చెల్లించిన మొత్తంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదైతేనేం... ఛేయ్ – రో–సో–యాంగ్‌ల విడాకుల సెటిల్మెంట్ మొత్తం ఓ రికార్డు సృష్టించింది. ఈ ఏటి మేటిగా దక్షిణ కొరియా మీడియా వర్ణిస్తోంది!


