యుద్ధ ఖైదీలైన కిమ్‌ సైనికులకు కొత్త జీవితం? | Kim Soldiers Who Fought for Russia Get a Lifeline from South Korea | Sakshi
Sakshi News home page

యుద్ధ ఖైదీలైన కిమ్‌ సైనికులకు కొత్త జీవితం?

Jun 23 2026 1:54 PM | Updated on Jun 23 2026 2:15 PM

Kim Soldiers Who Fought for Russia Get a Lifeline from South Korea

వాళ్లంతా నార్త్‌ కొరియా నియాంతాధ్యక్షుడు కిమ్‌కు చెందిన సైనికులు. రష్యా కోసం తుపాకీ పట్టారు.. ఉక్రెయిన్‌కు యుద్ధ ఖైదీలుగా చిక్కారు. ఇప్పుడు వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఒకవైపు యుద్ధ చెర, మరోవైపు స్వదేశానికి తిరిగి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనన్న ఆందోళన. ఇలాంటి సమయంలో వారికి అనూహ్యంగా దాయాది దేశమైన దక్షిణ కొరియా చేయూతనివ్వడానికి ముందుకొచ్చింది. 

స్వచ్ఛందంగా రావాలనుకుంటే ఆశ్రయం కల్పిస్తామని సియోల్‌(దక్షిణ కొరియా రాజధాని) ప్రకటించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. యుద్ధ ఖైదీలను వారి ఇష్టానికి విరుద్ధంగా తిరిగి ఉత్తర కొరియా లేదంటే రష్యాకు పంపడం సరైంది కాదని పేర్కొంది. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలు, యుద్ధ ఖైదీల హక్కులను గౌరవించాల్సిన అవసరం ఉందని కూడా వివరించింది. విదేశాంగ శాఖ జూన్‌ 23న విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ అంశం ప్రస్తుతం సియోల్‌, కీవ్‌ల మధ్య దౌత్య చర్చల్లో కీలకంగా మారింది. 

వచ్చే వారం ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సైబిహా(Andrii Sybiha) సియోల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన, దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యున్‌(Cho Hyun)తో సమావేశం కానున్నారు. ఉక్రెయిన్ సైన్యానికి చిక్కిన ఉత్తర కొరియా సైనికుల భవిష్యత్తు, దక్షిణ కొరియాకు రావాలనుకునే వారి పరిస్థితిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

కొన్నేళ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో.. ఉత్తర కొరియా ప్రమేయం గత కొంతకాలంగా అంతర్జాతీయ చర్చకు దారితీస్తోంది. అమెరికా, దక్షిణ కొరియా, పశ్చిమ దేశాల అంచనాల ప్రకారం.. ఉత్తర కొరియా రష్యాకు ఆయుధాలతో పాటు వేలాది మంది సైనికులను కూడా పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రష్యాలోని కుర్సుక్‌ ఒబ్లాస్ట్‌ (Kursk Oblast) ప్రాంతంలో ఉక్రెయిన్ దాడులను ఎదుర్కొనేందుకు ఉత్తర కొరియా దళాలను వినియోగించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

దక్షిణ కొరియా గూఢచారి సంస్థల అంచనాల ప్రకారం.. ఉత్తర కొరియా సుమారు 10 వేల నుంచి 15 వేల మంది వరకు సైనికులను రష్యాకు పంపినట్లు గతంలో వెల్లడైంది. వీరిలో కొందరు యుద్ధంలో మరణించగా, మరికొందరు గాయపడ్డారని, కొందరు ఉక్రెయిన్ సైన్యానికి ఖైదీలుగా చిక్కినట్లు సమాచారం. ఈ ఖైదీల్లో కొందరు ఉత్తర కొరియాకు తిరిగి వెళ్లాలనే ఆసక్తి చూపడం లేదని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా చేసిన తాజా ప్రకటనకు రాజకీయ, దౌత్యపరంగా ప్రాధాన్యం ఏర్పడింది. ఉత్తర కొరియా నుంచి పారిపోయే వారికి గతంలో కూడా దక్షిణ కొరియా ఆశ్రయం కల్పించింది. ఇప్పుడు యుద్ధ ఖైదీల విషయంలో కూడా అదే విధానాన్ని అనుసరించేందుకు సిద్ధమని సంకేతాలు ఇచ్చింది.

ఒకవేళ ఉక్రెయిన్ చెరలో ఉన్న ఉత్తర కొరియా సైనికులు దక్షిణ కొరియాలో స్థిరపడాలని నిర్ణయించుకుంటే, అది కేవలం మానవతా అంశంగానే కాకుండా ఉత్తర కొరియా-రష్యా సంబంధాలు, కొరియా ద్వీపకల్ప రాజకీయాలపై కూడా ప్రభావం చూపే పరిణామంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement