‘డూప్‌’మైన్‌ ఆన్‌లైన్‌ షాపింగ్‌! | South Korean youth are now taking an innovative approach to online shopping | Sakshi
Sakshi News home page

‘డూప్‌’మైన్‌ ఆన్‌లైన్‌ షాపింగ్‌!

Jun 15 2026 12:59 AM | Updated on Jun 15 2026 1:00 AM

South Korean youth are now taking an innovative approach to online shopping

ఆన్‌లైన్‌ షాపింగ్‌ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? కొత్త వస్తువులను చూడటం, వాటిని వెంటనే కార్ట్‌లో యాడ్‌ చేయడం, పార్శిల్‌ ఎప్పుడు వస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూడటం.. ఇదంతా ఒక తీపి అనుభూతి. అయితే, ఈ అలవాటు జేబుకు బాగానే చిల్లు పెడుతుంటుంది. ఎంత ఖర్చు చేస్తున్నామో కూడా తెలియకుండా షాపింగ్‌ చేసేస్తుంటాం. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా దక్షిణ కొరియా యువత ఇప్పుడు ఒక వినూత్నమైన మార్గాన్ని ఎంచుకుంది. అదే డోపమైన్‌ సైట్లలో షాపింగ్‌ చేయడం. ఆ విశేషాలేంటో చూద్దామా?

నిజానికి ఆన్‌లైన్‌లో వస్తువులు కొనేటప్పుడు.. వాటిని కొనడం వల్ల వచ్చే ఆనందం కంటే.. దానిని వెతికి, కార్ట్‌లో వేసి, ఆర్డర్‌ బటన్‌ నొక్కే ప్రక్రియలోనే మన మెదడులో ‘డోపమైన్‌’(ఆనందాన్నిచ్చే హార్మోన్‌) ఎక్కువగా విడుదలవుతుందని సైకాలజిస్టులు చెబుతుంటారు. కొరియాలో వచ్చిన ఈ ఫేక్‌ డోపమైన్‌ యాప్స్‌ సరిగ్గా ఇదే సూత్రాన్ని వాడుకుంటున్నాయి. ఈ యాప్స్‌ చూడటానికి వంద శాతం అసలైన షాపింగ్‌ సైట్ల లాగే ఉంటాయి.

ఇందులో వందలాది ప్రొడక్ట్స్, వాటి రేటింగ్‌లు, కస్టమర్‌ రివ్యూలు, డిస్కౌంట్‌ ఆఫర్లు అన్నీ ఉంటాయి. మీకు నచ్చిన దుస్తులు లేదా గాడ్జెట్స్‌ను సెలెక్ట్‌ చేసుకుని ‘కార్ట్‌’లో వేసుకోవచ్చు. ఆ తర్వాత మీ అడ్రస్‌ ఎంటర్‌ చేసి ‘ఆర్డర్‌’బటన్‌ కూడా నొక్కవచ్చు. ట్విస్ట్‌ ఏంటంటే మీరు ఆర్డర్‌ నొక్కగానే స్క్రీన్‌ మీద ఒక డెలివరీ బాయ్‌ మీ ఆర్డర్‌ని తీసుకుని, బైక్‌ మీద మీ ఇంటి వైపు వస్తున్నట్లు మ్యాప్‌లో లైవ్‌గా చూపిస్తుంది. వస్తువు మీ ఇంటికి చేరేవరకు ఉండే ఆ ఉత్కంఠ, ఎగ్జైట్‌మెంట్‌ అన్నీ నిజంగానే అనిపిస్తాయి. కానీ చివరకు మీ ఇంటికి ఎలాంటి వస్తువూ రాదు, మీ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి ఒక్క రూపాయి కూడా కట్‌ అవ్వదు! దీంతో షాపింగ్‌ ఖర్చు నుంచి తప్పించుకోవడంతో షాపింగ్‌ చేశామన్న అనుభూతినీ పొందవచ్చు.   

అయితే ఈ పద్ధతి డబ్బును ఆదా చేస్తున్నప్పటికీ, ఇది ఒక రకమైన మానసిక వ్యసనానికి దారితీయవచ్చని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఏ వస్తువు కొనకపోయినా, ఈ సైట్లలో గడపడం వల్ల షాపింగ్‌ చేయాలనే అదే ప్రవర్తనా సరళి మెదడులో బలోపేతం అవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ట్రెండ్‌ దక్షిణ కొరియాకే పరిమితమైంది. 

రెడ్డిట్‌ వంటి సోషల్‌ మీడియా వేదికలపై ఉన్న వ్యాఖ్యలను బట్టి చూస్తే, పాశ్చాత్య దేశాల వారు తమ సమయాన్ని ఇలాంటి నకిలీ పనుల కోసం వె చ్చించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని అర్థమవుతోంది. ఏదేమైనా, షాపింగ్‌ పిచ్చిని వదిలించుకోవడానికి కొరియన్లు కనిపెట్టిన ఈ మార్గం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. పైసా ఖర్చు లేకుండా షాపింగ్‌ మజాను అందించే ఈ ‘ఫేక్‌ స్టోర్స్‌’ఐడియా మాత్రం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.  

(సాక్షి సెంట్రల్‌ డెస్క్)  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement