పాక్‌లో భీకర ఆత్మాహుతి దాడి.. 15 మంది దుర్మరణం | ragic Incident in Pakistan | Sakshi
Sakshi News home page

పాక్‌లో భీకర ఆత్మాహుతి దాడి.. 15 మంది దుర్మరణం

Jul 24 2026 9:18 PM | Updated on Jul 24 2026 9:26 PM

 ragic Incident in Pakistan

ఇస్లామాబాద్: వాయవ్య పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని భద్రతా తనిఖీ కేంద్రం పైకి దూసుకెళ్లారు. ఈ దుర్ఘటనలో 12 మంది సైనికులు, ఇద్దరు పోలీసులు,ఓ అటవీ శాఖ ప్రభుత్వ అధికారి సహా మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భీకర దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన పాక్ సైన్యం జరిపిన ఎదురుకాల్పుల్లో 12 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

ఈ మేరకు శుక్రవారం పాకిస్థాన్ సైన్యం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న వాయవ్య ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లోని టాంక్ జిల్లాలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. ఉగ్రవాదులు భద్రతా వలయాన్ని ఛేదించి లోపలికి చొరబడటానికి ప్రయత్నించారని, అయితే సైనికులు వారిని అడ్డుకోవడంతో.. ఉగ్రవాదులు పేలుడు పదార్థాల వాహనాన్ని చెక్ పోస్ట్ వెలుపలి రక్షణ గోడకు బలంగా ఢీకొట్టారని ఆర్మీ తెలిపింది. ఈ భారీ పేలుడు దాటికి అక్కడి భద్రతా మౌలిక సదుపాయాలు,భవనం తీవ్రంగా దెబ్బతిన్నాయి. 

స్థానిక తాలిబాన్ ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించింది. ఈ ఆపరేషన్‌లో తమ సంస్థకు చెందిన నలుగురు ఆత్మాహుతి బాంబర్లు పాల్గొన్నట్లు వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో వాయవ్య పాకిస్థాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement