పాక్‌ ఆరోపణలను తోసిపుచ్చిన భారత్‌  | India has rejected Pakistan remarks at the UNSC | Sakshi
Sakshi News home page

పాక్‌ ఆరోపణలను తోసిపుచ్చిన భారత్‌ 

Jul 24 2026 5:41 AM | Updated on Jul 24 2026 11:14 AM

India has rejected Pakistan remarks at the UNSC

న్యూయార్క్‌: ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా అనుసరిస్తున్న పాకిస్తాన్‌కు ఒప్పందాల సహకరాన్ని అందించడం సాధ్యంకాదని ఐక్యరాజ్య సమితి(యూఎన్‌ఓ)లో భారత్‌ స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్, సింధు జలాల ఒప్పందం అంశాలపై ఐక్యరాజ్యసమితిలో పాక్‌ చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. జమ్మూ కశ్మీర్‌ భారతదేశంలోనే అంతర్భాగంగా, విడదీయరాని భాగంగా ఉంది, ఉంటుందని స్పష్టం చేసింది.

 ‘సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసి, భారత్‌ జలాలను ఆయుధంగా వాడుకుంటోంది. చట్ట విరుద్ధంగా 24 కోట్ల మందికి పైగా పాకిస్తానీల జీవనోపాధికి ముప్పు గలిగిస్తోంది’అంటూ యూఎన్‌ఓలో పాకిస్తాన్‌ శాశ్వత ప్రతినిధి అసిమ్‌ ఇఫ్తికార్‌ అహ్మద్‌ ఆరోపణల నేపథ్యంలో భారత్‌ తీవ్రంగా స్పందించింది. సహజ వనరులపై భద్రతా మండలిలో బుధవారం జరిగిన ఉన్నత స్థాయి బహిరంగ చర్చలో యూఎన్‌ఓలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్‌ మాట్లాడారు. ‘సింధు జలాల ఒప్పందంపై మా వైఖరి స్పష్టంగా, స్థిరంగా ఉంది. సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా ఉపయోగిస్తున్నప్పుడు, పరస్పర విశ్వాసం, సద్భావనల ఆధారంగా సహకారాన్ని ఆశించలేము’అని అన్నారు.

 ‘జమ్మూ కశ్మీర్‌ ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగంగా, విడదీయరాని భాగంగా ఉంది, ఉంటుంది. ఇది వాస్తవం, దీనిని పాకిస్తాన్‌ ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోంది. భారత సార్వ¿ౌమ భూభాగంపై పాకిస్తాన్‌ చేస్తున్నది దురాక్రమణ మాత్రమే. భారత్‌ను వేలెత్తి చూపడానికి బదులుగా, పాకిస్తాన్‌ తన సొంత వ్యవహారాలను చక్కదిద్దుకుంటూ తన ప్రజలకు మేలు చేసుకుంటే మంచింది’అని ఆయన పేర్కొన్నారు. సింధు పరీవాహక ప్రాంతంలోని ఆరు నదుల జలాలను పంచుకోవడంపై ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్తాన్‌ల మధ్య 1960లో సంతకాలు చేసిన ఒప్పందం సింధు జలాల ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం, తూర్పు నదులను భారతదేశానికి, పశ్చిమ నదులను అధికభాగం పాకిస్తాన్‌కు కేటాయించారు. అయితే 2025 ఏప్రిల్‌ 22 నాటి పహల్గామ్‌ ఉగ్రదాడి తరువాత సరిహద్దు ఉగ్రవాదం నేపథ్యంలో ఒప్పందం కింద సహకారం కొనసాగించలేమని భారత్‌ ఆ సంధిని నిలిపివేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement