ఇంటికి పిలిస్తే రూ .79,000.. దుబాయ్ కొత్త స్కీమ్! | Dubai Invite Scheme UAE Residents Earn Rs 79000 Rewards Worth Invite Family Friends | Sakshi
Sakshi News home page

ఇంటికి పిలిస్తే రూ .79,000.. దుబాయ్ కొత్త స్కీమ్!

Jul 24 2026 11:51 AM | Updated on Jul 24 2026 12:19 PM

Dubai Invite Scheme UAE Residents Earn Rs 79000 Rewards Worth Invite Family Friends

విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు, స్నేహితులను దుబాయ్‌కు ఆహ్వానించే యూఏఈ నివాసితులకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది దుబాయ్ ప్రభుత్వం. దుబాయ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం (DET) తాజాగా 'A Dubai Invite' పేరుతో ప్రత్యేక సిటీ అంబాసిడర్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హత కలిగిన నివాసితులు విదేశాల నుంచి బంధువులు లేదా స్నేహితులను దుబాయ్‌కు తీసుకొస్తే 3,000 దిర్హమ్‌లకు పైగా (సుమారు రూ.79,000) విలువైన హోటల్ బసలు, రెస్టారెంట్ ఆఫర్లు, పర్యాటక ఆకర్షణల టికెట్లు, లైఫ్‌స్టైల్ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.

ఈ కార్యక్రమం ప్రకారం, 2026 జూలై 20 నుంచి అక్టోబర్ 31 మధ్య దుబాయ్‌కు వచ్చే విదేశీ సందర్శకులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. సందర్శకులు చేరుకునే ముందు యూఏఈ నివాసితులు ఆన్‌లైన్‌లో వారి వివరాలను నమోదు చేయాలి. ఒకేసారి గరిష్ఠంగా ఐదుగురిని నామినేట్ చేయవచ్చు. వారు దుబాయ్ చేరుకున్న తర్వాత అధికారిక వ్యవస్థల ద్వారా రాక ఆటోమేటిక్‌గా వేరిఫై అవుతుంది. అనంతరం 72 గంటల్లో రివార్డులను ఎలా వినియోగించుకోవాలో తెలిపే ఈమెయిల్‌ను టూరిజం డిపార్ట్‌మెంట్ పంపిస్తుంది. ఈ రివార్డులు 2026 డిసెంబర్ 31 వరకు చెల్లుబాటులో ఉంటాయి.

అర్హులు ఎవరంటే..

ఈ పథకానికి 18 ఏళ్లు పైబడిన యూఏఈ పౌరులు, చెల్లుబాటు అయ్యే ఎమిరేట్స్ ఐడీ కలిగిన నివాసితులు అర్హులు. ఆహ్వానితులు యూఏఈ నివాసితులు కాకూడదు. వారు చెల్లుబాటు అయ్యే టూరిస్ట్ వీసాతో లేదా వీసా-ఆన్-అరైవల్ అర్హతతో విమానం, సముద్రం లేదా రోడ్డు మార్గంలో దుబాయ్‌కు చేరుకోవాలి. అయితే వీసా ఏర్పాట్లు ఈ పథకంలో భాగం కావని, వాటిని సందర్శకులే స్వయంగా చూసుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

గుర్తుంచుకోవాల్సిన నిబంధనలు

ప్రతి సందర్శకుడిని ఈ కార్యక్రమంలో ఒక్కసారి మాత్రమే నామినేట్ చేయవచ్చు. ఇప్పటికే మరో నివాసితుడు అదే వ్యక్తిని నమోదు చేసి ఉంటే, తదుపరి నామినేషన్‌కు రివార్డు వర్తించదు. అలాగే ప్రచార కాలంలో ప్రతి అర్హుడైన నివాసితుడు గరిష్ఠంగా మూడు రివార్డ్ ప్యాకేజీలు మాత్రమే పొందగలడు. పాల్గొనే బ్రాండ్లలో ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు, కరీమ్, హాలా వంటి సేవలు ఉన్నాయి. ఇటీవలి నెలల్లో అంతర్జాతీయ పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు దుబాయ్ చేపడుతున్న చర్యల్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement