నేను దుబాయ్‌లో ఉంటాను. మా ఆవిడ, పిల్లలు కడపలో ఉంటారు. వాళ్ళని డిపెండెంట్ వీసా మీద దుబాయ్‌కి తీసుకెళ్లాలనుకుంటున్నాను. మాది 2012లో మతాంతర వివాహం కావడంతో ప్రత్యేక వివాహ చట్టం క్రింద నమోదు చేసుకున్నాము. సర్టిఫికేట్‌లో తన పాత పేరే ఉంది. ప్రస్తుతం తన పేరు శ్రీ లక్ష్మి. గెజిట్ ద్వారా పేరు కూడా శ్రీ లక్ష్మి అని మార్పించాము. అయితే వీసా కోసం వెళ్ళినప్పుడు ఇక్కడి అధికారులు పాస్‌పోర్టులో ఉన్న పేరుతోనే పెళ్లి సర్టిఫికెట్ కావాలి – లేకుంటే కుదరదు అంటున్నారు. రిజిస్ట్రార్‌గారిని సంప్రదిస్తే పెళ్లి సర్టిఫికెట్‌లో మార్పు కుదరదని చెప్పారు. హైదరాబాదులో ఇంకోసారి పెళ్లి రిజిస్టర్ చేసుకోమని ఒక స్నేహితుడు సలహా ఇచ్చాడు. 2012లో జరిగిన పెళ్లిని ఇంకోసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎలాంటి పత్రాలు కావాలి, ఎలా చేర్పించాలి... సలహా ఇవ్వగలరు.
– జగపతి, దుబాయ్
ఒకసారి రిజిస్టర్ చేసుకున్న పెళ్లిని మరో రాష్ట్రంలో ఇంకోసారి రిజిస్టర్ చేసుకోవటం చట్టరీత్యా నేరం. అలా తయారు చేసిన రెండవ పెళ్లి పత్రం చెల్లదు. చెల్లని పత్రాలని విదేశాలలో ఉపయోగిస్తానంటున్నారు కాబట్టి – దొరికితే దుబాయ్‌లో జైలు తప్పదు – మీ ఆవిడతో ΄ాటు మీ వీసా కూడా రద్దయిపోతుంది. గెజిట్ ఉందన్నారు కాబట్టి – అన్ని పత్రాలతో పాటు మీ ఆవిడ చేత పేరు మార్పునకు గల కారణాలు వివరిస్తూ సంబంధిత పత్రాలతో పాటు ఒక అఫిడవిట్‌ను కూడా జతపరిచి దుబాయ్‌లోని భారతీయ హై కమిషన్ ఆఫీసు ద్వారా ధ్రువీకరించుకోండి (అపాస్టిల్ అంటారు). అంతే కాక మీకు – మీ కుటుంబానికి ఉన్న సంబంధం కూడా ధ్రువీకరించవచ్చు. రిజిస్ట్రార్ ఆఫీసునుంచి మీ ఆవిడ పాత పేరు – కొత్త పేరు ఒకరివే అనే ధ్రువీకరణ ఇస్తారేమో అడగండి – లేనిపక్షంలో కోర్టును సంప్రదించి పరిష్కారం కోరటం గురించి ఆలోచించవచ్చు. మీరు పైన చెప్పిన విధంగా యూఏఈ అధికారులకి సరైన పత్రాలు అందజేస్తే పరిష్కారం ఉంటుంది. ఇవ్వన్నీ కాదు – కొన్నాళ్లు జైలుకి పోయినా ఫర్వాలేదులే అనుకుంటే, మీ స్నేహితుడు చెప్పినట్లుగా హైదరాబాదులో రిజిస్ట్రేషన్‌కి అప్లై చెయ్యండి.
– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం
sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు.


