జోరున వర్షం కురుస్తోంది.. చుట్టూ పోలీసులు ఉన్నారు.. ఎదురుగా ఆందోళనకారులను తీసుకెళ్తున్న పోలీస్ వ్యాన్ నెమ్మదిగా ముందుకు కదులుతోంది. లాఠీ దెబ్బలకు భయపడి యువకులంతా చెల్లాచెదురైపోతున్నారు. హఠాత్తుగా దూసుకొచ్చిన ఓ యువతి.. ఆ వ్యాన్‌కు అడ్డుగా నిలబడింది. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా తన నిరసనను వ్యక్తం చేసింది. ఆ ఒక్క క్షణం.. ఆమె ధైర్యం.. ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
నీట్ సహా పోటీ పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు.. ఢిల్లీ నుంచి మిగతా రాష్ట్రాలకు విస్తరించాయి. ఈ క్రమంలో ముంబైలో జరిగిన ఆందోళనల్లో ఓ యువతి చూపించిన తెగువ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. విమర్శకులను పక్కనపెడితే.. ఆమె చూపిన ధైర్యం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. విద్యార్థులను తరలిస్తున్న పోలీస్ వాహనానికి అడ్డుగా నిలిచిన ఆమె వీడియో వైరల్‌గా మారింది.

“వాళ్లు విద్యార్థులు.. వాళ్ల గొంతు వినాలి”
బుధవారం దాదర్‌లోని శివాజీ పార్క్ సమీపంలో జరిగిన నిరసనల్లో రిహియా యాదవ్ పాల్గొన్నారు. విద్యార్థులను అదుపులోకి తీసుకుని తరలిస్తున్న పోలీస్ వ్యాన్‌ను ఆమె వర్షంలో నిలబడి అడ్డుకున్నారు. హూడీ, క్యాప్ ధరించిన ఆమె వ్యాన్ ముందు నిలబడగా.. చుట్టూ ఉన్న పలువురు ఆమెకు మద్దతుగా నినాదాలు చేశారు.
ఈ ఘటనపై రిహియా మాట్లాడుతూ.. ‘‘పోలీసులు తమ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోతే.. ప్రజల బాధ్యతను ప్రజలమే తీసుకోవాల్సి వస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. తాను విద్యార్థిని కాకపోయినా.. విద్యార్థుల పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నానని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్య సరైంది కాదని ఆమె అన్నారు.
Meet Rhiya Ahir [IG: rhiyaahir]👏
One fearless young woman stood in front of a police van during the Mumbai student protests, refusing to back down.
Courage can't be bought. Justice can't be silenced. Salute to her. 🫡🫡 pic.twitter.com/c9oAvhQPeq— زماں (@Delhiite_) July 22, 2026
ఒక్క అడుగు.. ఓ సందేశం
రిహియా చేసిన పని కేవలం ఓ నిరసన చర్యగా మాత్రమే కాకుండా.. మహిళల ధైర్యానికి ప్రతీకగా మారింది. సాధారణంగా ఆందోళనల్లో మహిళల పాత్రపై ఎన్నో చర్చలు జరుగుతుంటాయి. కానీ రిహియా మాత్రం “ప్రశ్నించేందుకు ధైర్యం ఉంటే మార్పు సాధ్యమే” అనే సందేశాన్ని ఇచ్చారు. ఆమె వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పలువురు ఆమెను అభినందించారు. కొందరు ఆమెను “ముంబై హీ(షీ)రో”గా అభివర్ణించారు. ప్రముఖ హాస్యనటుడు రోహన్ జోషి కూడా ముంబై యువత నిరసన తీరును ప్రశంసిస్తూ పోస్టు చేశారు.
ఎవరీ రిహియా యాదవ్?
రిహియా యాదవ్ కేవలం నిరసనకారిణి మాత్రమే కాదు. ఆమె ఓ నటి, మోడల్, వ్యాపారవేత్తగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రకారం.. మ్యూజిక్ వీడియోల్లో నటించారు. అంతేకాకుండా చేతితో తయారు చేసే దుస్తుల కోసం ‘రిహియాసత్’ పేరుతో ఓ వ్యక్తిగత బ్రాండ్‌ను నిర్వహిస్తున్నారు. సృజనాత్మక రంగంలో తనదైన ముద్ర వేస్తూనే.. సామాజిక అంశాలపై కూడా స్పందించడం ఆమె ప్రత్యేకతగా నిలుస్తోంది.
మహిళా సాధికారతకు ఓ ప్రతీకగా..
మహిళా సాధికారత అంటే కేవలం అవకాశాలు పొందడం మాత్రమే కాదు.. అవసరమైన సమయంలో తన అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తం చేయడం కూడా. రిహియా యాదవ్ ఘటన అదే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. ఒక మహిళ ముందుకు వచ్చి నిలబడితే.. అది కేవలం ఒక నిరసన కాదు.. మరెందరికో ధైర్యాన్ని ఇచ్చే సందేశంగా మారుతుందనే దానికి రిహియా ఉదాహరణగా నిలించిందనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.


