సాక్షి, తాడేపల్లి: ప్రజలకు అండగా నిలిచి వారి సమస్యలపై నిరంతరం వైఎస్సార్‌సీపీ పోరాడుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, అక్రమాలపై పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు. అమరావతి దోపిడీ నుంచి డీఎస్సీ అక్రమాల వరకూ అన్నింటినీ ప్రజల ముందు పెట్టి వైఎస్సార్‌సీపీ ప్రశ్నిస్తోంది.
ఈ క్రమంలో మరో పోరాటానికి వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. 28న అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిరసన ప్రదర్శనలు చేపట్టనుంది. పార్టీ యువత, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించనుంది. డీఎస్సీ అక్రమాలు, నీట్ పరీక్షలో జరిగిన తప్పులు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబ్సర్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ నిరసనలు నిర్వహించనుంది.
వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. యువతను చంద్రబాబు తీవ్రంగా మోసం చేశారని మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో కోటిమంది యూత్ ఉన్నారని చంద్రబాబు చెప్తున్నారు. ఉద్యోగం వచ్చేంత వరకు వారికి నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఇప్పటికే రూ.72 వేల కోట్ల బకాయి పడ్డారు. డీఎస్సీలో భారీగా జరిగిన అక్రమాలను సాక్షాలతో బయటపెట్టాం. అయినా చంద్రబాబు పట్టించుకోవటం లేదు. బంగ్లాదేశ్‌లో యువత తిరగపడితే ఏం జరిగిందో చంద్రబాబు గుర్తుంచుకోవాలి’’ అని ఆయన హెచ్చరించారు.
‘‘ఢిల్లీలో యువత చేస్తున్న ఆందోళనలు ఎలా ఉన్నాయో చూడండి. చంద్రబాబు యువత విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి. నీట్ పేపర్ లీక్ తో లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబిఐ విచారణ చేయాలి. నీట్ తప్పులు, ఫీజు రీయింబ్సర్‌మెంట్‌పై పోరాటం చేస్తాం. 28న జిల్లా కేంద్రాల్లో యూత్, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ర్యాలీలు చేస్తాం’’ అని జక్కంపూడి రాజా తెలిపారు.
స్టూడెంట్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మాట్లాడుతూ.. డీఎస్సీలో పారదర్శకత లేదని.. మొదటి ర్యాంకు వచ్చిన వారికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. మెరిట్, రిజర్వేషన్, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయి. స్పోర్ట్స్ కోటా వారు డీఎస్సీ పరీక్షలు రావాల్సిన పనిలేదని జీవో ఇచ్చారు. బంగారు పతకం సాధించిన దుర్గయ్యకు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు?. డీఎస్సీలో అన్నీ అక్రమాలే. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వని కారణంగా విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు. రూ.9 వేల కోట్లపైనే బకాయిలు పడ్డారు’’ అని రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


