నంబర్‌ వన్‌ నుంచి ‘పదిలో ఒకటి’కి! | Guest Column Story On Ease Of Doing Business Latest Rankings For Andhra Pradesh | Sakshi
Sakshi News home page

నంబర్‌ వన్‌ నుంచి ‘పదిలో ఒకటి’కి!

Jul 23 2026 1:55 PM | Updated on Jul 23 2026 2:30 PM

Guest Column Story On Ease Of Doing Business Latest Rankings For Andhra Pradesh

ఇన్‌ బాక్స్‌

పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, సంస్థలు ఒక రాష్ట్రం వైపు అడుగులు వేసేముందు మొట్టమొదట పరిశీలించేది అక్కడి ప్రభుత్వ విధానాలు తమను ప్రోత్సహించడానికి అనువుగా ఉన్నాయా అన్నదే. దానికి దేశవ్యాప్తంగా ఆమోదం పొందిన కొలబద్ద ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ ర్యాంకింగులు. అయితే ఆంధ్రప్రదేశ్‌ తాజా ర్యాంకులను చూస్తే ఆందోళన కలగకమానదు.

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ ర్యాంకుల్లో ఏపీ సాధించిన ఫలితాలు ఇప్పటికీ రికార్డులుగానే నిలిచి ఉన్నాయి. 2020 సెప్టెంబర్‌ 5న డీపీఐఐటీ ప్రకటించిన ఫలితాల్లో 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2022 జూన్‌ 30న ప్రకటించిన బీఆర్‌ఏపీ–2020 ఫలితాల్లో ‘టాప్‌ అచీవర్స్‌’ హోదా పొందిన 7 రాష్ట్రాల్లో ఒకటిగా నిలవడమే కాదు, 97.89 శాతం స్కోరుతో దేశం లోనే అత్యధిక స్కోరు సాధించి గుజరాత్‌(97.77 శాతం) కంటే ముందు నిలిచింది. మరో విశేషం ఏంటంటే, 2024 సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగిన తొలి ‘ఉద్యోగ్‌ సమాగమ్‌’ వేదికపై డీపీఐఐటీ వెల్లడించిన బీఆర్‌ఏపీ ఫలితాల్లో దేశం మొత్తం మీద ‘టాప్‌ పెర్ఫార్మర్‌’ హోదా దక్కింది మూడంటే మూడు రాష్ట్రాలకే. అవి కేరళ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌. ఆ మదింపు నకు ప్రాతిపదిక జగన్‌ ప్రభుత్వ 2022–23 నాటి సంస్కరణల అమలు.

2025 నవంబర్‌లో జరిగిన రెండో ‘ఉద్యోగ్‌ సమాగమ్‌’లో డీపీఐఐటీ ప్రకటించిన బీఆర్‌ఏపీ–2024 ఫలితాలు కళ్లు తెరిపించేలా ఉన్నాయి. ఐదు సంస్కరణ రంగాల్లో ‘టాప్‌ అచీవర్‌’ గుర్తింపును ఉత్తరాఖండ్, పంజాబ్‌ దక్కించుకోగా, ఆంధ్రప్రదేశ్‌ నాలుగు రంగాల గుర్తింపుతో పది రాష్ట్రాల గుంపులో ఒకటిగా మిగిలిపోయింది. ‘ఫాస్ట్‌ మూవర్స్‌’ జాబితాలో ఏపీ పేరు ఒడిశా, పంజాబ్‌ తర్వాతే వినిపించింది. ఈ నెల 17న నీతి ఆయోగ్‌ విడుదల చేసిన ‘ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రెండ్లీనెస్‌ ఇండెక్స్‌’ ఆ దృశ్యాన్ని మరింత స్పష్టం చేసింది. పెట్టుబడులకు అనుకూలమైన దేశంలోని 17 పెద్ద రాష్ట్రాల జాబితాలో ఏపీ స్థానం ఆరు. దేశంలోని అన్ని రాష్ట్రాల లెక్కన ఎనిమిదో స్థానం.

‘స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ అంటూ ప్రస్తుత ప్రభుత్వం వినిపిస్తున్న నినాదాలు, దావోస్‌ వేదికలపై ప్రకటనలు, లక్షల కోట్ల ఒప్పందాల హోరు వార్తా శీర్షికలకే పరిమితమవుతున్నాయి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకొనే ముందు పారిశ్రామికవేత్తలు పరిశీలించేది డీపీఐఐటీ, నీతి ఆయోగ్‌ వంటి సంస్థల తటస్థ గణాంకాలనే తప్ప ప్రచార ఆర్భాటాలను కాదు. ర్యాంకుల భాషను పెట్టుబడిదారులు ఎప్పుడో చదివేశారు; చదవాల్సింది ఏపీ పాలకులే.
– డా. కొత్తపల్లి శ్రీనివాస వర్మ, సీనియర్‌ జర్నలిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement