ఇన్ బాక్స్
నేడు మల్లు దొర వర్ధంతి
అల్లూరి సీతారామరాజు ఆధ్వర్యంలో జరిగిన మన్యం పితూరీలో ఆయనకు ప్రధాన అనుచరులుగా గాం గంటందొర, గాం మల్లుదొర పేరెన్నిక గన్నారు. వీరు గిరిజనులలో భగత తెగకు చెందినవారు. ఇందులో మల్లు దొర స్వాతంత్య్రానంతరం పార్లమెంటుకూ ఎన్నిక య్యాడు. విశాఖపట్నం జిల్లా చింతపల్లి తాలూకాలోని కొయ్యూరు మండలం ‘బట్టపనుకులు’ గ్రామంలో 1900లో జన్మించాడు.
గంటందొర చిన్న తమ్ముడు మల్లుదొర. బ్రిటిష్ తాబేదారుల అక్రమ చర్యలను గాం సోదరులు ప్రతిఘటించారు. ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నాడనే నేపంతో చింతపల్లి తాసిల్దార్ సెబాస్టియన్ గంటందొరను మునసబు పదవి నుంచి తొలగించాడు. అంతేగాదు, గంటందొర భూమితో పాటు మరికొందరి ఆదివాసుల భూములను ప్రభుత్వపరం చేశాడు. గాం సోదరులకు జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించడానికి మన్యం ప్రజలు అల్లూరి సీతారామరాజుకు తెలియుజేశారు.
సీతారామరాజు 1922లో మన్యం పోరాటాన్ని ప్రారంభించాడు. బ్రిటిష్ వారి ఆగడాలను అంత మొందించడానికి 150 మంది సైనికులను సేకరించ డంలో గాం సోదరుల కృషి చెప్పుకోదగినది. వీరికి భగత తెగ గిరిజనులైన సింగన్న, పడాలు, గోవిందు, వీరయ్య దొర, గోకేరు ఎర్రేసు, అగ్గిదొర వంటి వారి సహకారం తోడైంది. సీతారామరాజు నాయకత్వంలో చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల పోలీస్ స్టేషన్లపై దాడిచేసి ఆయుధాలను సేకరించారు. బ్రిటిష్ ప్రభుత్వం అల్లూరిని పట్టిచ్చిన వారికి 10 వేలు, గంటందొర, మల్లుదొరలను పట్టిచ్చిన వారికి ఒక్కొక్కరికి వెయ్యేసి రూపాయల పారితోషికం ప్రకటించింది.
ఉద్యమంలో కాస్త చురుకుదనం కోల్పోయిన సందర్భంలో ఆయుధాలను అల్లూరి సైన్యానికి అప్పగించి మల్లుదొర దళాన్ని విడిచి వెళ్లాడు. 1923 సెప్టెంబర్ 17న గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నడింపాలెం చేరుకున్నాడు. ఒక రహస్య ప్రదేశంలో బ్రిటిష్ వారికి పట్టుబడ్డాడు. అల్లూరి ఆచూకీ తెలుప మని మల్లుదొరను చిత్రహింసలు పెట్టినా ఏమీ చెప్పలేదు. 1924 మే 7న పట్టు బడిన అల్లూరి వీరమరణం పొందాడు. వాల్తేరు ఏజెన్సీ న్యాయమూర్తి మల్లు దొరకు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పాడు. మల్లుదొర అప్పీలు చేయగా మరణ శిక్షణను ద్వీపాంతరవాస శిక్షగా మార్చారు. 1937లో అండమాన్ జైలు నుంచి విడుదౖలñ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1952లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో విశాఖపట్నం ఏజెన్సీ నుంచి గెలుపొంది ఆదివాసీలలో తొలి పార్లమెంటు సభ్యుడిగా వ్యవహరించారు. 1969 జూలై 21న తుదిశ్వాస విడిచారు.
– గుమ్మడి లక్ష్మీనారాయణ, ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపకుడు


