రేపటిని సొంతం చేసుకోవడానికి... | Sakshi Guest Column Special Story On Future Ready Courses | Sakshi
Sakshi News home page

రేపటిని సొంతం చేసుకోవడానికి...

Jul 20 2026 2:04 PM | Updated on Jul 20 2026 2:04 PM

Sakshi Guest Column Special Story On Future Ready Courses

‘విద్య సమాజ భవిష్యత్తుకు పాస్‌పోర్ట్‌ లాంటిది. రేపు అనేది, ఈ రోజే దానికోసం సిద్ధపడే వాళ్లకే సొంతం’ అంటాడు అమెరికన్‌ పౌర హక్కుల ఉద్యమకారుడు మాల్కం ఎక్స్‌. ప్రపంచంలో మున్ముందు సంభవించగల సాంకేతిక మార్పులకు, ఉద్యోగ మార్కెట్‌ అవలంబించే కొత్త రిక్రూట్‌మెంట్‌ విధానాలకు అనుగుణంగా విద్యా నిపుణులు రూపొందించిన ‘ఫ్యూచర్‌ రెడీ కోర్సులు’ విద్యార్థులను రేపటిని సొంతం చేసుకోవడానికి సిద్ధం చేస్తాయి.

మెరుగైన ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేందుకు డేటా సైన్స్‌, కృత్రిమ మేధ (ఏఐ), సైబర్‌ సెక్యూరిటీ వంటి ఫ్యూచర్‌ రెడీ కోర్సులు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అందుబాటులో ఉన్నాయి.  ముఖ్యంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనూ అందుబాటులో ఉండటం గమనించాల్సిన సంగతి. ‘ఇరవై ఒకటో శతాబ్దంలో నిరక్షరాస్యులు అంటే చదవడం, రాయడం రానివారు కాదు; నేర్చుకోవడం, నేర్చు కున్నదాన్ని వదిలేయడం, మళ్లీ కొత్తగా నేర్చుకోవడం తెలియని వారే’ అంటాడు అమెరికన్‌ రచయిత, ఫ్యూచరిస్ట్‌ ఆల్విన్‌ టాఫ్లర్‌. ప్రస్తుతం డేటా సైన్స్‌, ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ ఇత్యాది కోర్సులు, టాఫ్లర్‌ చెప్పినట్టుగా విద్యార్థుల వ్యక్తిగత ప్రతిభకు తగిన గుర్తింపునూ, సరిపడా ఆదాయాన్నీ తెచ్చిపెడతాయి. అందుకే ఈ కోర్సు లకే యువకులు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. 

మునుపటితో పోల్చితే పూర్తి అధునాతనమైన ఈ కోర్సుల్లో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత. కోట్ల కొద్దీ ఉన్న పాత సమాచారాన్ని అర్థంచేసుకొని, భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే ఊహించే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. మనం యూట్యూబ్‌ లేదా నెట్‌ఫ్లిక్స్‌లో ఒక వీడియో చూడగానే ‘మీకు ఇది కూడా నచ్చుతుంది’ అంటూ కింద కొన్ని ఆప్షన్స్‌ వస్తుంటాయి. ఇది డేటా సైన్స్‌ మహిమే. మనుషుల్లాగే సొంతంగా ఆలోచించి నిర్ణ యాలు తీసుకునే తెలివితేటలు యంత్రాలకు వచ్చేశాయి. డ్రైవర్‌ లేకుండా దానంతటదే రోడ్లపై నడిచే ‘టెస్లా’ కార్లు, మనతో మనిషిలా మాట్లాడే ‘చాట్‌జీపీటీ’... కంప్యూటర్లకు కళ్ళు, చెవులు, మెదడు వచ్చేశాయి. ఇది ఏఐ పుణ్యమే!

మారిన మార్కెట్‌ స్వరూపం మన డబ్బును, వ్యక్తిగత సమాచారాన్ని రక్షించే ఒక అదృశ్య సైన్యం మనకు అందుబాటులో ఉంది. మన బ్యాంక్‌ అకౌంట్‌ హ్యాక్‌ కాకుండా వచ్చే ఓటీపీలు, ఫోన్‌ లాక్‌ చేసే బయోమెట్రిక్‌ సిస్టమ్స్‌ ఇలా చాలా విషయాల్లో ఈ అదృశ్య సైన్యం పర్యవేక్షిస్తూ అభయ హస్తం చూపుతుంది. ఇదే సైబర్‌ సెక్యూరిటీ. ఇట్లాంటి ఫ్యూచర్‌– ప్రూఫ్‌ కోర్సుల ఫలితంగానే కాలేజీలు కేవలం డిగ్రీలు ఇచ్చే ఫ్యాక్టరీ లుగా కాకుండా, విద్యార్థులను ఆధునిక సవాళ్లను ఎదుర్కొనే సమ ర్థులుగా రూపొందించే నైపుణ్య కేంద్రాలుగా నిలబడుతున్నాయి.

ఈ కోర్సులను పూర్తి చేసి ఫేస్‌బుక్, అమెజాన్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్‌ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఎంపికైతే, ఫ్రెషర్‌ స్థాయిలోనే నెలకు 1.5 లక్షల నుండి 2 లక్షల పైనే ప్రారంభ వేతనం లభిస్తోంది. ఈ ‘ఫాంగ్‌’ సంస్థలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞా నాన్ని ఉపయోగించి, సంప్రదాయ వస్తుసేవల రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్‌ చేశాయి. వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేసే విధానం నుండి సేవలను పొందే విధానం వరకు ఈ సంస్థలు సృష్టించిన డిజిటల్‌ ఎకోసిస్టమ్‌ మార్కెట్‌ స్వరూపాన్నే మార్చేసింది. ఒక్కమాటలో, ఈ ఫ్యూచర్‌ రెడీ కోర్సులు ‘నేర్చుకోండి, సంపాదించండి, ఎదగండి’ నినాదానికి ఆచరణాత్మక రూపాలు. 
– ప్రొ. బెల్లి యాదయ్య, ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నకిరేకల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement