ఆయన ప్రాణం కాపాడండి! | Social Activist Sonam Wangchuk's Indefinite Hunger Strike In Delhi | Sakshi
Sakshi News home page

ఆయన ప్రాణం కాపాడండి!

Jul 18 2026 12:17 PM | Updated on Jul 18 2026 12:31 PM

Social Activist Sonam Wangchuk's Indefinite Hunger Strike In Delhi

సోనమ్‌ వాంగ్‌చుక్‌

సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ జూన్‌ 28 నుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ‘నిరవధిక నిరాహార దీక్ష’లో ఉన్నాడు. బరువు తగ్గాడు. బలహీనపడ్డాడు. అయినా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది. వాంగ్‌చుక్‌ లద్ధాఖ్‌లోని ఉలేటోక్ఫో గ్రామ నివాసి. పర్యావరణ కార్యకర్త. విద్యా సంస్కర్త. హిమాలయ ప్రాంతానికి అనువైన ‘ఐస్‌ స్థూప’ అనే కృత్రిమ మంచు నిల్వ వ్యవస్థను అభివృద్ధి చేసి, అంతర్జాతీయ గుర్తింపును పొందారు. విద్యార్థులకు ‘ప్రత్యామ్నాయ విద్య’ను అందించాలనే లక్ష్యంతో ‘సెక్‌మోల్‌’ విద్యా సంస్థను స్థాపించారు. 2018లో ‘రామన్‌ మెగసెసే’ అవార్డును అందుకున్నారు.

ఆయనకు దీక్షలు చేయడం కొత్తేమీ కాదు. ‘లద్ధాఖ్‌ను భారత రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌ పరిధిలోకి తేవాలి’ అంటూ, 2024లో 21 రోజుల పాటు ‘నిరాహార దీక్ష’ చేశారు. ప్రస్తుత దీక్ష సంగతికి వస్తే: ఈ ఏడాది మే నెలలో జరిగిన ‘నీట్‌’ పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్‌ అయ్యింది. పరీక్ష నిర్వహణలో కొన్ని అవకతవకలు జరిగాయి. ఇది విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఈ నేపథ్యంలో ‘కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలి, పరీక్షల నిర్వహణలో జవాబుదారీతనం తీసుకు రావాలి’ అంటూ ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ ఉద్యమం ప్రారంభించింది. దానికి సంఘీ భావంగా సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్షను మొదలెట్టారు.

‘పరీక్షల నిర్వహణలో సంస్కరణలు చేపడతామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని’ జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) తెలిపింది. కానీ ఇలాంటి హామీలను నమ్మే స్థితిలో విద్యార్థులూ, ఉద్యమకారులూ లేరు. ఎందుకంటే 2024లో బిహార్‌లో ఇలాగే జరిగింది. అప్పుడు కూడా ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించింది. బిహార్‌లోని పట్నా, జార్ఖండ్‌లోని హజారీబాగ్‌ ప్రాంతాల్లో ప్రశ్నాపత్రం లీక్‌ అయినట్లు గుర్తించింది. ‘155 మంది విద్యార్థులు ఈ మోసంతో ప్రయోజనం పొందినట్లు’ సుప్రీమ్‌ కోర్టుకు సీబీఐ తెలియజేసింది.

2019లో తమిళనాడులోనూ ఇలాగే జరిగింది. అయితే అది లీకేజీ కాదు. అది ఇంపర్సనేషన్‌ రాకెట్‌! పరీక్షలు రాయవలసిన వారి స్థానంలోకి వేరేవాళ్లు వెళ్లి పరీక్షలు రాయడమన్నమాట! 2021, 2023లో కూడా ఇలాంటి స్కాములు కొన్ని చోట్ల జరిగాయి. కాబట్టి, ‘భవిష్యత్‌లో జరగకుండా చూసుకొంటాము’ అనే మాట నీటిమూట. 2018కి 2019 ఒక భవిష్యత్తు. 2024కు 2026 ఇంకో భవిష్యత్తు. కాబట్టి ఈ ‘భవిష్యత్తు హామీ’ అనేది ‘విద్యార్థుల భవిష్యత్తు’ నాశనం చేయడానికి తప్ప ఎందుకూ పనికిరాదు. ఆ విషయం తెలిసే వాంగ్‌చుక్‌ దీక్షకు కూర్చున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ‘ప్రతి పౌరుడి ప్రాణం అమూల్యమైనదే. అతడి ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేయాలి’ అంటూ కీలకమైన ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
– నన్నూరి వేణుగోపాల్‌, పౌర హక్కుల కార్యకర్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement