అభిప్రాయం
‘నీవు ఓటరువని నిరూపించు’ అనే ధోరణి కంటే, ‘నీ ఓటు హక్కు రక్షించడం మా రాజ్యాంగబద్ధ బాధ్యత’ అనే ధోరణి ఎన్నికల సంఘానికి మరింత గౌరవాన్ని తీసుకొస్తుంది.
‘లాహిరి లాహిరి లాహిరిలో...’ అని పాడుకునే ‘మాయాబజార్’ సినిమా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచిపోయింది. ఆ చిత్రానికి నిజానికి ‘శశిరేఖా పరిణయం’ అని ఉండాలి. కానీ ప్రపంచం మాయాబజార్ గానే గుర్తుంచుకుంది. ఎందుకంటే ఆ కథలో మాయ, వ్యూహం, వేషధారణ, భ్రమ – అన్నీ కలగలిసి ఉంటాయి. ఎవరు నిజం? ఎవరు మాయ? అనే సందేహమే కథకు ప్రాణం. నేటి ఓటరు జాబితాల ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (సర్) ప్రక్రియను గమనిస్తే కూడా ఇటువంటి సందేహాలే తలెత్తుతున్నాయి. ప్రజాస్వా మ్యంలో ఎన్నికలు ఒక పవిత్ర ప్రక్రియ. ఆ ప్రక్రియలో పారదర్శకత కనిపించకపోతే, అది ‘మాయాబజార్’లా అనిపించడం సహజం.
మాయాబజార్‌లో ‘సత్యపీఠం’ ఉంటుంది. దానిపై కూర్చుంటే అసత్యం బయటపడుతుందని భావిస్తారు. కానీ వాస్తవ జీవితంలో రాజ్యాంగ పదవులు చేపట్టే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, న్యాయమూర్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు– అందరూ సత్యనిష్ఠతో పనిచేస్తామని ప్రమాణం చేస్తారు. అయినప్పటికీ, వారి నిజాయితీని నిరూపించేందుకు అటువంటి ‘సత్యపీఠం’ లేదు. భారత సుప్రీంకోర్టు కూడా ‘సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక’ (2010) కేసులో పాలీగ్రాఫ్, నార్కో అనాలిసిస్, బ్రెయిన్ మ్యాపింగ్ వంటి పరీక్షలను వ్యక్తి సమ్మతి లేకుండా నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ప్రశ్న ఏమిటంటే, పౌరుడి విషయంలో రాజ్యాంగం అంత జాగ్రత్తగా వ్యవహరిస్తే, ఓటరును మాత్రం మళ్లీ మళ్లీ తన ఉనికిని నిరూపించమని అడగడం ఎంత వరకు సమంజసం?
ఓటరు ఎవరు?
ఎన్నికల సంఘం చెబుతున్నది ఒకటే: ఫారం నింపండి, పత్రాలు ఇవ్వండి, వివరాలు సమర్పించండి. ప్రజలు అడుగుతున్న ప్రశ్న కూడా ఒక్కటే: ‘నేను ఇరవై ఏళ్లుగా ఓటు వేస్తున్నాను. నా పేరు ఇప్పటికే ఓటరు జాబితాలో ఉంది. మళ్లీ నేను ఎవరో ఎందుకు నిరూపించాలి?’ ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇప్పటివరకు ప్రజలకు అందలేదు. 2002లో జరిగిన ప్రత్యేక సవరణ తరువాత అనేక ఎన్నికలు జరిగాయి. అదే జాబితాల ఆధారంగా లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో లక్షలాది మంది ఓటు వేశారు. అప్పుడు చెల్లుబాటైన ఓటరు ఇప్పుడు అకస్మాత్తుగా సందేహా స్పదుడిగా ఏ విధంగా మారాడు?
ఎన్నికల జాబితా రూపొందించడం భారత ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ బాధ్యత. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను గుర్తించడం, ఫారాలు అందించడం, సందేహాలు నివృత్తి చేయడం బూత్ లెవల్ అధికారుల విధి. కానీ అనేక ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా కనిపి స్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి వంటి పట్టణ ప్రాంతాల్లో వేలాది మందికి ఫారాలు అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్నిచోట్ల బీఎల్వోలు కాలనీల్లో కూర్చొని వచ్చిన వారికి మాత్రమే ఫారాలు ఇస్తున్నారు. అలాంటి పరిస్థితిలో, ఫారం అందకపోయినా బాధ్యత ఓటరుపైనే వేయడం న్యాయమా?
జూలై మధ్య నాటికి సుమారు 1.66 కోట్ల తెలంగాణ ఓటర్లలో సగానికి కూడా తక్కువ మంది మాత్రమే ఫారాలు సమర్పించారని అధికారిక సమాచారం చెబుతోంది. అంటే మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? ఫారం అందలేదా? సమయం సరిపోలేదా? లేక ప్రక్రియపై సరైన అవగాహన కల్పించలేదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేకుండా గడువులు పొడిగించడం ప్రజల సందేహాలను తగ్గించదు.
డిజిటలైజేషన్ ఎందుకు?
డిజిటల్ ఇండియా గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆధార్, ఓటర్ ఐడీ, జనన–మరణ నమోదు, చిరునామా రికార్డులు, ప్రభుత్వం వద్ద ఇప్పటికే విస్తృత సమాచారం ఉంది. ఈ సమాచారాన్ని సమన్వయం చేయకుండా, ప్రతి ఓటరునూ మళ్లీ పత్రాలతో రావాలని అడగడం పరిపాలనా సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. డిజిటల్ వ్యవస్థ పౌరుడికి సౌలభ్యం కలిగించాలా? లేక అతనిపై కొత్త భారం మోపాలా?
ప్రత్యేకంగా హైదరాబాద్ మహానగర పరిధిలోనే లక్షలాది నమోదులు పరిశీలనకు వస్తే, ఎన్నికల విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తడం సహజం. ఇటువంటి సందర్భాల్లో ఎన్నికల సంఘం మరింత పారదర్శకంగా వివరాలు వెల్లడించడం అత్యవసరం. ఎన్నికల సంఘం ఒక సాధారణ ప్రభుత్వ శాఖ కాదు. అది రాజ్యాంగం సృష్టించిన స్వతంత్ర సంస్థ. దాని నిర్ణయాలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలి, అనుమానాలను కాదు. పౌరుడు ఎన్నికల సంఘాన్ని నమ్మాలి, ఎన్నికల సంఘం కూడా పౌరుడిని నమ్మాలి. ఈ పరస్పర విశ్వాసమే ప్రజాస్వామ్యానికి మూలాధారం.
మాయాబజార్ సినిమాలో చివరికి మాయ తొలగిపోతుంది. నిజం బయటపడుతుంది. అందుకే ఆ కథ సుఖాంతమవుతుంది. ప్రజాస్వామ్యంలో కూడా అదే జరగాలి. ఎన్నికల ప్రక్రియలో మాయకు, సందేహాలకు, అపార్థాలకు చోటు ఉండకూడదు. ‘నీవు ఓటరువని నిరూపించు’ అనే ధోరణి కంటే, ‘నీ ఓటు హక్కు రక్షించడం మా రాజ్యాంగబద్ధ బాధ్యత’ అనే ధోరణి ఎన్నికల సంఘానికి మరింత గౌరవాన్ని తీసుకొస్తుంది.
సర్ అనేది కేవలం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ మాత్రమే కాదు. అది ఎన్నికల సంఘం విశ్వసనీయతకు కూడా పరీక్ష. ఆ పరీక్షలో విజయం సాధించేది గణాంకాలు కాదు; పారదర్శకత, నిష్పాక్షికత, ప్రజల విశ్వాసం. అదే ప్రజాస్వామ్యానికి నిజమైన ‘సత్యపీఠం’.
- మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త కేంద్ర సమాచార సంఘం మాజీ కమిషనర్


