ఔషధాల అన్వేషణ ఏఐతో సులభతరం | Sakshi Guest Column On Drug discovery made easier with AI | Sakshi
Sakshi News home page

ఔషధాల అన్వేషణ ఏఐతో సులభతరం

Jul 23 2026 1:26 AM | Updated on Jul 23 2026 1:26 AM

Sakshi Guest Column On Drug discovery made easier with AI

మానవాళి ఆరోగ్య సంరక్షణ చరిత్రను పరిశీలిస్తే ప్రకృతే తొలి వైద్యశాలగా నిలిచిందని స్పష్టమవుతుంది. శతాబ్దాలుగా ఆయుర్వేదం, యునాని, సిద్ధ, నాటు వైద్య విధానాలు మనుషులకు ప్రాథమిక ఆరోగ్య రక్షణను అందిస్తూ వచ్చాయి. 1950వ దశాబ్దానికి పూర్వం వరకు మానవ మనుగడ ప్రధానంగా ఈ సహజ మూలికా వైద్యంపైనే ఆధారపడి సాగింది. ఆధునిక వైద్యంలో అత్యంత కీలకమైన మోర్ఫిన్, కొకైన్, క్వినైన్, ఆస్పిరిన్‌ వంటి అనేక ఔషధాల ఆవిష్కరణకు ప్రకృతిసిద్ధమైన వృక్ష సంపదే మూలధారంగా నిలిచింది. అయితే, నేటి మారుతున్న జీవనశైలి కారణంగా హృద్రో గాలు, మధుమేహం, కాన్సర్, ఊబకాయం వంటి తీవ్రమైన రుగ్మతలు మానవాళికి సవాలుగా మారాయి. వీటి నివారణకు ప్రాచీన మూలికా విజ్ఞానాన్ని ఆధునిక కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో అనుసంధానించటం ఆవశ్యకంగా మారింది.

ఔషధ ఆవిష్కరణలో నూతన శకం
మన దేశంలో ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానానికి అపారమైన ప్రాధాన్యత ఉంది. అశ్వగంధ, శతావరి, నేలవేము, తులసి, గుడుచి, త్రిఫల వంటి ఎన్నో  శతాబ్దాలుగా రోగనిరోధక శక్తిని పెంపొందించటంలోనూ, అనేక రుగ్మతల నివారణలోనూ ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. అయితే, ఈ సంప్రదాయ మూలికా వైద్యంలో ఉన్న క్రియాశీల రసాయన ఘటకాలను (యాక్టివ్‌ ప్రిన్సిపుల్స్‌) వేరుచేసి, వాటి ప్రామాణీకరణను ఆధునిక రసాయనిక, జీవశాస్త్ర పద్ధతుల ద్వారా నిర్ధారించవలసిన అవసరం ఉంది. సంప్రదాయ వైద్యం కేవలం అనుభవపూర్వక నమ్మకంగా మాత్రమే మిగిలిపోకుండా ప్రజారోగ్య వ్యవస్థలో భాగం కావాలంటే శాస్త్రీయ విశ్లేషణ, ఆధారిత రుజువులు (సైంటిఫిక్‌ రిగర్‌) చాలా ముఖ్యం.

నూతన ఔషధాల అన్వేషణలో కృత్రిమ మేధ (ఏఐ) ప్రవేశం ఒక విప్లవాత్మకమైన మార్పునకు శ్రీకారం చుట్టింది. ఒక కొత్త ఔషధాన్ని కనుగొనటానికి సాధారణంగా దశాబ్దాల సమయం, భారీ ఆర్థిక వ్యయం అవసరమవుతాయి. కానీ, ఏఐ సాంకేతికత సహాయంతో కోట్లాది రసాయన నిర్మాణాలను చాలా తక్కువ సమయంలోనే వర్చువల్‌ స్క్రీనింగ్‌ చేయవచ్చు. ఇవి లక్ష్యిత వ్యాధి కణాలపై ఎలా పనిచేస్తాయి? ఎంతవరకు ప్రభావవంతంగా ఉంటాయి? వాటి వల్ల ఏవైనా విషపూరిత పరిణామాలు ఎదురవుతాయా? అనే అంశాలను ఏఐ ద్వారా ముందే ఊహించడానికి అవకాశముంది. ప్రాచీన మూలికా సమాచారాన్ని డిజిటలైజ్‌ చేసి ఏఐ డేటాబేసులతో అనుసంధానించటం ద్వారా పరిశోధన వేగాన్ని పెంచవచ్చు.

ఏఐ నిర్ణేత కాదు, పరికరం మాత్రమే!
ఏఐ ఎంత శక్తిమంతమైనదైనప్పటికీ, అది మైక్రోస్కోప్‌ లేదా స్పెక్ట్రోమీటర్‌ లాంటి ఒక పరిశోధనా సాధనం మాత్రమే తప్ప స్వయంభూ నిర్ణేత కాదు. ఏఐ కోట్లాది రసాయన నమూనాలను వేగంగా విశ్లేషించగలదు. కానీ అది సత్యానికి ప్రమాణం లేదా శాస్త్రీయ నిజం కాదు. ఏఐ ఇచ్చే అంచనాలలో ‘ఫాల్స్‌ పాజిటివ్స్‌’, ‘ఫాల్స్‌ నెగె టివ్స్‌’, తప్పుడు ఊహలు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. ఏఐకి మానవ భావోద్వేగాలు, జీవశాస్త్ర పద్ధతుల వెనుక ఉన్న నిజమైన కారణాలు లేదా ప్రయోగశాల ప్రత్యక్ష అనుభవం ఉండవు. పెన్సిలిన్, టాక్సాల్‌ వంటి విప్లవాత్మక ఆవిష్కరణలు... అనుకోకుండా, మానవ సృజనాత్మక పరిశీలన వల్లనే సాధ్యపడ్డాయి. కాబట్టి, ఏఐ ఆలోచనను భర్తీ చేయలేదు, కేవలం శాస్త్రవేత్త ఆలోచనా పరిధిని విస్తరింపజేస్తుంది. ఔషధ నాణ్యత, క్లినికల్‌ భద్రత, తుది నిర్ణయం ఎప్పుడూ మానవ మేధస్సు, శాస్త్రీయ విశ్లేషణ పైనే ఆధారపడి ఉంటాయి. 

సంప్రదాయం, శాస్త్రీయతల సమతుల్యత
ఏఐ నమూనాల (ప్యాటర్న్స్‌)ను గుర్తిస్తుంది. కానీ శాస్త్రానికి కారణ–ఫలిత సంబంధం (కాజేషన్‌), జీవశాస్త్రపరమైన సమర్థత (బయలాజికల్‌ ప్లాసిబిలిటీ) అవసరం. వివరణ లేకుండా చేసే అంచనాలు బలహీనమైన శాస్త్రాన్ని సృష్టిస్తాయి. అందువల్ల ఏఐ పట్ల శాస్త్రీయ సందేహ దృష్టి (సైంటిఫిక్‌ స్కెప్టిసిజమ్‌), విమర్శనాత్మక శాస్త్రీయ ఆలోచన (సైంటిఫిక్‌ రీజనింగ్‌) సమాజ అభ్యున్నతికి అత్యంత అవసరం. కాబట్టి, భవిష్యత్తు ‘మనిషి వర్సెస్‌ ఏఐ’ కాదు, ‘మనిషి + ఏఐ’ అనే సహకార దృక్పథమే వాస్తవం. ఏఐ మన జిజ్ఞాసను విస్తరించాలి, దాన్ని భర్తీ చేయకూడదు. అందువల్ల, ఇదీ భవిష్యత్తు విజయసూత్రం: ఏఐ+సాంప్రదాయ జ్ఞానం+కఠినమైన ప్రయోగాత్మక పరిశోధన+ విమర్శనాత్మక ఆలోచన= సమాజ పురోగతి, మానవ సంక్షేమం. 

భారతదేశానికి ఉన్న అపారమైన ప్రాచీన వైద్య సంపదను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమ్మేళనం చేయటమే నేటి మన ప్రధాన లక్ష్యం కావాలి. ఏఐ అందించే విశ్లేషణలను గుడ్డిగా నమ్మ కుండా, విమర్శనాత్మక ఆలోచన, ప్రయోగశాల నిర్ధారణల ద్వారా పరిశీలించాలి. ఆయుర్వేద ఔషధాల నాణ్యత, భద్రత, సమర్థతలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిరూపించినప్పుడే భారతీయ వైద్య విజ్ఞానానికి ప్రపంచస్థాయిలో సముచిత స్థానం లభిస్తుంది. ఏఐ పరిశోధనల వేగాన్ని పెంచినప్పటికీ, మానవ మేధస్సు, శాస్త్రీయ దృక్పథం మాత్రమే నిజమైన ఆరోగ్య విప్లవానికి బాటలు వేస్తాయి. 
– డా‘‘ కె. నాగయ్య : విశ్రాంత ముఖ్య శాస్త్రవేత్త, ప్రాకృతిక ఉత్పత్తులు–ఔషధ రసాయన శాస్త్ర విభాగం, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (సీఎస్‌ఐఆర్‌–ఐఐసీటీ), హైదరాబాద్‌;
– ఫణిరాజ్‌ జి : ఐటీ ప్రొఫెషనల్, బోస్టన్, యూఎస్‌ఏ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement